మహిళలను భోగ వస్తువుగా భావించి, వారి శరీరాలతో వ్యాపారం చేసేవాళ్లకు ఈ సమాజంలో కొదవలేదు. అలాంటి వారిని పట్టుకుని ఎలాంటి శిక్ష విధించినా తప్పు పట్టేవారెవరూ ఉండరు. అలాంటి కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ప్రీతంసింగ్ తీర్పు చెప్పారు.
మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి, వారితో పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్న సోనూ పుంజాబన్ అనే మహిళకు 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఢిల్లీలో గత కొన్నేళ్లుగా గీత అరోరా అలియాస్ సోనూ పుంజాబన్ మైనర్ బాలికలను కొనుగోలు చేస్తూ, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది.
బాలికలను విక్రయిస్తున్న రాకెట్‌ను నడుపుతున్న సోనూ వందలాది మంది తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగుల్చుతోంది. వేలాది మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇప్పటికీ తేలనవి ఎన్నో. దీంతో ఢిల్లీ పోలీసులు బాలికల విక్రయ ముఠాపై ఉక్కుపాదం మోపడంతో సోనూ వ్యభిచార వ్యవహారం వెలుగు చూసింది.
ఈ కేసులో నేరం రుజువు కావడంతో సోనూతో పాటు ఆమె సహనిందితుడికి ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ప్రీతంసింగ్ 24 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఇద్దరికీ రూ.65 వేల జరిమానా కూడా విధించారు. ఈ తీర్పు సంచలనం సృష్టించింది. ఈ తీర్పుపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.