లాక్ డౌన్ తో టాలీవుడ్ బిజినెస్ అంతా కిందామీద అయింది. దీంతో చిన్న సినిమాలతో పాటు ఓ మోస్తరు సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. త్వరలోనే తెలుగు నుంచి ఓ 2 పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.
ఓవైపు ఇంత జరుగుతుంటే మరోవైపు షకలక శంకర్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తను హీరోగా నటిస్తున్న సినిమాలు బిగ్ స్క్రీన్ పైనే చూడాలంటున్నాడు ఈ హీరో కమ్ కమెడియన్. తన సినిమాల్లో ఆ క్వాలిటీ ఉంటుందంటున్నాడు.
“చేతిలో హీరోగా 3-4 సినిమాలున్నాయి. లాక్ డౌన్ తర్వాత అన్నీ స్టార్ట్ చేయాలి. ఏదీ ఓటీటీకి కాదు.. అన్నీ నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలే. థియేటర్లు రన్నింగ్ లోకి వచ్చాక ఆ సినిమాలు వస్తాయి. నా సినిమాలన్నీ థియేటర్లలోనే చూడాలి. ఒక్కో పాటకు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ తీస్తున్నాం.”
ఇలా షకలక శంకర్ తన సినిమాల గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఇతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. కొన్నైతే శాటిలైట్ కు కూడా నోచుకోలేదు. అయినప్పటికీ తన అప్ కమింగ్ సినిమాలన్నీ థియేటర్లలోనే రిలీజ్ అవుతాయంటున్నాడు ఈ నటుడు.
ప్రస్తుతం షకలక శంకర్, పరాన్నజీవి అనే సినిమా చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మపై సెటైరిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. ఆన్ స్క్రీన్ ఆర్జీవీగా కనిపించబోతున్నాడు షకలక శంకర్.