ఇది సినిమా టైటిల్ కాదు.. ఓ ఆన్ లైన్ మోసం. ఒకే ఒక్కడు చేసిన దుర్మార్గం. తన అకృత్యాలతో ఏకంగా వంద మంది అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేశాడు కర్నూలుకు చెందిన మహ్మద్ హైమద్. ఎట్టకేలకు అతడి పాపం పండింది. సైబరాబాద్ పోలీసులు ఈ కేటుగాడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్ హైమద్ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేస్తున్నాడు. తిరిగి అవే ఫొటోల్ని ఆయా యువతులకు పంపి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. ఇనస్టాగ్రామ్ వేదికగా దాదాపు 7 నెలలుగా మహ్మద్ చేస్తున్న ఈ బ్లాక్ మెయిలింగ్, హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో బయటపడింది.
తన ఫొటోల్ని మార్ఫింగ్ చేసి, తనకే పంపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడిన మహ్మద్ పై పోలీసులకు ఫిర్యాదుచేసింది హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయి. అలా మహ్మద్ అకృత్యాలు బయటపడ్డాయి. విచారణలో ఏకంగా వంద మంది అమ్మాయిల్ని మహ్మద్ ఇలా బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుసుకొని పోలీసులే అవాక్కయ్యారు.
పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా.. ఏపీ, తెలంగాణలో ఇతడిపై దాదాపు 10 కేసులు నమోదైనట్టు తేలింది. సోషల్ మీడియాలో అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయం ఈ ఘటనతో మరోసారి తెలిసొచ్చింది.