ఆరు గ్రాముల చరాస్ కేసు దేశంలో సంచలన వార్తగా కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో ఎన్సీబీ అధికారులు తమ ట్యాలెంట్ అంతా ఉపయోగించి, ఆర్యన్ ఖాన్ చాట్ లిస్టును బయటపెట్టారు. అయితే ఆ చాట్ లో కూడా డైరెక్టుగా డ్రగ్స్ గురించి మాట్లాడినట్టుగా లేదనే మాటా వినిపిస్తోంది! కోడ్ వర్డ్స్స్ లో డ్రగ్స్ గురించి చాట్ చేశారనేది అభియోగం.
ఇక ఈ కేసు విచారణలో మార్మోగుతున్న పేరు ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖేడే. ఇతడి గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయ నేతలు కొందరు వాంఖేడేను టార్గెట్ గా చేసుకున్నారు. అంతకన్నా సంచలన స్థాయిలో.. ఆర్యన్ ఖాన్ ను మొదట్లోనే విడిచిపెట్టడానికి అనుగుణంగా మొత్తం 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆర్యన్ ఖాన్ దొరకగానే షారూక్ మేనేజర్ తో 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టుగా ఒక ఇండిపెండెంట్ విట్ నెస్ చెబుతుండటం పెను సంచలనంగా నిలుస్తోంది. ఈ మేరకు వాంఖేడే పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి.
మొత్తం 25 కోట్లని, అందులో అతడి వాటా ఎనిమిది కోట్ల రూపాయలని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి చెబుతున్నాడు. ఈ కేసులో ప్రైవేట్ డిటెక్టివ్ గా వ్యవహరించిన వ్యక్తి సెక్యూరిటీ గార్డు అట ఇతడు. అక్కడ జరిగింది తను ప్రత్యక్షంగా చూసినట్టుగా చెబుతున్నాడు. మరి వాంఖేడే ఈ డీల్ చేశాడా? బాలీవుడ్ స్టార్ తనయుడు కాబట్టి.. ఆ మాత్రం ఇస్తారని అనుకున్నాడా? డీల్ కుదరలేదా? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలు అవుతున్నాయి.
ఇది వరకూ పలువురు సెలబ్రిటీలు-డ్రగ్స్ అనే ఆరోపణలు వచ్చినప్పుడు వారిలో చాలా మందిని అరెస్టు కూడా చేయలేదు. పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి, వదిలేసిన దాఖలాలున్నాయి. ఆర్యన్ వద్ద డ్రగ్స్ పట్టుబడలేదని ఎన్సీబీనే అంటోంది. ఆర్యన్ స్నేహితుల వద్ద డ్రగ్స్ దొరియానుకున్నా.. ఆ పరిమాణాన్ని బెయిల్ ఇవ్వవచ్చని ఆర్యన్ లాయర్లు వాదిస్తున్నారు.
పరిమాణాన్ని బట్టే అరెస్టు, శిక్షలుంటాయి కాబట్టి.. ఆ మేరకు చట్టపరంగానే బెయిల్ ఇవ్వాలని వారు వాదిస్తున్నా, ఎన్సీబీ వేరే విషయాలను ప్రస్తావిస్తూ ఉంది. ఆర్యన్ ఫోన్ లో చాట్ నే ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. అయితే అరెస్టు చేసింది ఫోన్ చాటింగుల ద్వారా కాదు, అరెస్టు అయిన తర్వాత ఫోన్ చాటింగులు ఎన్సీబీకి అస్త్రంగా మారాయి.
ఈ కేసులో ఇప్పుడు హైలెట్ అవుతున్న అంశం.. వాంఖేడే భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడనేది. అది కూడా షారూక్ మేనేజర్ తో సంప్రదింపులు జరిగాయని అక్కడున్న ఒక వ్యక్తి చెబుతున్నాడు. తేడా వస్తే.. ఈ విషయంలో ఎన్సీబీ తన అంతు చూస్తుందని ఆ వ్యక్తికి తెలియనిది కాదు. అయినా చెబుతున్నాడంటే.. అనేది ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది.
తనకు ఎన్సీబీ నుంచి ప్రాణహాని పొంచి ఉందని కూడా అతడు అంటున్నాడు. అలాగే వాంఖేడే కూడా అదే చెబుతున్నాడు. తనపై కుట్ర జరుగుతోందని అంటున్నాడు. ఈ ఉదంతంపై ఎన్సీబీ డైరెక్టర్ స్పందిస్తూ.. ఏం చెబుతారో కోర్టుకు చెప్పండని అంటున్నాడు. తాము తేలికగా వదలమని ఆయన చట్టపరంగా హెచ్చరించేశాడు!
మరి ఇప్పుడు స్పందించాల్సింది షారూక్ ఖాన్. ఒకవేళ ఆర్యన్ దొరకగానే వాంఖేడే డబ్బులు డిమాండ్ చేసి ఉంటే.. ఆ విషయం షారూక్ వరకూ వెళ్లడానికి నిమిషాల సమయమే పట్టి ఉంటుంది. షారూక్ మేనేజర్ తో డబ్బులు డిమాండ్ చేశారని సాయిల్ చెబుతున్నాడు. ఆమె వెంటనే షారూక్ కు విషయం చెప్పి ఉండాలి. తర్జనభర్జనలు జరిగి ఉండాలి. మరి ఏం జరిగిందో.. ఈ డబ్బుల డిమాండ్ వ్యవహారంపై స్పందించాల్సిన బాధ్యత ఇప్పుడు షారూక్ పైనే ఉంది. ముందుగా మేనేజర్ పెదవి విప్పాలి, ఆ తర్వాత షారూక్ స్పందించాలి.