కింగ్ ఖాన్ షారూక్ మరోసారి స్టేడియంలో కనిపించాడు. తన టీమ్ ను ఉత్సాహపరిచేందుకు అహ్మదాబాద్ స్టేడియంకు వచ్చిన షారూక్, వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అట్నుంచి అటు నేరుగా ముంబయి వెళ్లిపోయిన షారూక్, ఫైనల్ మ్యాచ్ కు మాత్రం హాజరయ్యాడు.
ఐపీఎల్ ఫైనల్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఓడించింది. దీంతో షారూక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన టీమ్ తో కలిసి అతడు ఆనందంగా కనిపించాడు. స్టేడియంలో మరోసారి కలియతిరిగాడు.
వడదెబ్బ కారణంగా షారూక్ నీరసంగా మారాడు. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోవచ్చని చాలామంది భావించారు. అతడి మేనేజర్ పూజా కూడా అదే అర్థం వచ్చేలా ప్రకటన చేశారు. షారూక్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడని అన్నారు.
కానీ చెన్నైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ కు హాజరై, తన టీమ్ లో, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపాడు షారూక్. మ్యాచ్ మధ్యలో అప్పుడప్పుడు నీరసంగా కనిపించిన ఈ హీరో, ఎప్పుడైతే తన టీమ్ గెలిచిందో ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయాడు. తన అనారోగ్యాన్ని సైతం పక్కనపెట్టి చిన్నపిల్లాడిలా స్టేడియంలో ఎంజాయ్ చేశాడు.
కుటుంబాన్ని కౌగలించుకున్న తర్వాత, గౌతమ్ గంభీర్ కు ముద్దిచ్చాడు. మిగతా ప్లేయర్స్ ను కూడా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపాడు.