ప్రజానీకాన్ని ఎన్నికలు విసిగించాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత దాదాపు రెండు నెలలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కౌంటింగ్‌కు మూడు వారాల గడువు. ఎన్నికల ప్రక్రియలో ఇంత గ్యాప్‌ను భరించే ఓపిక జనానికి లేదు. అందులోనూ ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యానికి ఆహ్లాదకరమైనవి కాదు. కలుషిత రాజకీయాలు మానసిక ఆరోగ్యానికి హానికరం.
మరీ ముఖ్యంగా మీడియా తీరు రాజకీయాలపై పూర్తిగా విసుగెత్తించేలా చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా? అని జనం ఎదురు చూసే పరిస్థితి. ఎలాగోలా ఎన్నికల తంతు ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఒక్కటే మిగిలింది. ఏపీలో ఏడాది కాలంగా అధికారం ఎవరిదనే చర్చకు తెరలేచింది. రకరకాల లెక్కలు చెబుతున్నారు.
అయితే ఎన్నికలు ముగిసినా ఈ దఫా ప్రజల నాడి ఎవరూ పట్టుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. ఇటు వైసీపీ, అటు కూటమి శ్రేణుల్లో అధికారంపై ఎవరి ధీమా వారిది. బెట్టింగ్స్ సరేసరి. అయితే ఈవీఎంలలో ప్రజాతీర్పు నిక్షిప్తమై వుంది. ఫలితాలు ఎలా ఉన్నా, టెన్షన్ భరించలేకపోతున్నామని, త్వరగా కౌంటింగ్ జరగాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి.
కౌంటింగ్‌కు ముందు రకరకాల సంస్థలు సర్వేల పేరుతో అధికారం వారిది, వీరిది అంటూ చెబుతున్నాయి. వీటిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. తమకు అనుకూలంగా వుంటే మానసికంగా సంతృప్తి చెందడం తప్ప, ఉత్కంఠ మాత్రం తప్పడం లేదని అంటున్నారు. ఇక ఈ టెన్షన్‌ను భరించలేమని, ఫలితం ఇటో, అటో, ఏదైనా ఫర్వాలేదని, త్వరగా తేలాలని, ఆ సమయం కోసం జనం ఎదురు చూస్తున్నారనేది నిజం.