ఊహించని ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఆ కాంబినేషన్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, యంగ్ డైరక్టర్ తరుణ్ భాస్కర్ కలిశారు. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అసలు వీళ్లిద్దరూ కలిశారనే విషయమే ఆసక్తికరం. ఇక ఆ సినిమా ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుందో?
సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ఓ స్క్రిప్ట్ పై చర్చించాడట తరుణ్ భాస్కర్. ఆ కథను వీళ్లిద్దరూ కలిసి రాశారంట. ఆ స్టోరీని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ భాస్కర్ వెల్లడించాడు.
సింగీతం శ్రీనివాసరావు ఆల్రెడీ ప్రాజెక్ట్-కె అనే సినిమాకు వర్క్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సింగీతం సేవల్ని వినియోగించుకుంటున్నారు నిర్మాత అశ్వనీదత్. ఆ సినిమాతో పాటు ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో కలిసి మరో కథ కూడా రాశారట ఈ సీనియర్ డైరక్టర్.
సింగీతం అంటేనే ప్రయోగాలు. అలాంటి దర్శకుడితో కలిసి రాసిన తాజా స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగా ఉందని చెబుతున్నాడు తరుణ్ భాస్కర్. ఇందులో నటించే హీరోహీరోయిన్లు, పనిచేయబోయే టెక్నీషియన్స్ ఎవరనే విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తానంటున్నాడు తరుణ్.
ప్రస్తుతం ఈ దర్శకుడు ఓ క్రైమ్ కామెడీ సబ్జెక్టుతో సినిమా చేయబోతున్నాడు. రేపోమాపో ఇది స్టార్ట్ అవుతుంది. మరోవైపు ఓరగల్లు అనే వెబ్ సిరీస్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది ఉంటుందని అంటున్నాడు తరుణ్ భాస్కర్.