2014లో సినిమాలు చేసింది.. మళ్లీ 2018 వరకు కనిపించలేదు. అప్పుడొక సినిమా చేసింది. మళ్లీ 2020 వరకు కనిపించలేదు. ఆ తర్వాత ఇంకో రెండేళ్లు గ్యాప్. ఇప్పుడు మళ్లీ 2022లో సినిమా చేస్తోంది. నజ్రియా ఎందుకిలా గ్యాప్స్ తీసుకుంటోంది. ఈ గ్యాప్స్ లో ఆమె ఏం చేస్తుంది? ఆమె కావాలనే సినిమాల్ని తిరస్కరిస్తుందా లేక ఆమెను ఎవ్వరూ సంప్రదించరా?
“ఓ సినిమా అయిన తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకుంటాను. అది కాస్తా రెండేళ్లు అయిపోతుంది. నేనేదో రోజుకొక స్టోరీ విని రిజెక్ట్ చేస్తానని చాలామంది అనుకుంటారు. అలాంటిదేం లేదు. కొంతమంది వచ్చి స్క్రిప్టులు చెబుతుంటారు. ఆ టైమ్ లో నేను సినిమాలు చేసే మూడ్ లో ఉండను. కొన్నిసార్లు ట్రావెలింగ్ లో ఉంటాను. పర్సనల్ లైఫ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అందుకే తక్కువగా సినిమాలు చేస్తాను.”
ఇలా తన కెరీర్ గ్యాప్స్ పై స్పందించింది నజ్రియా. స్క్రిప్టుల ఎంపిక విషయంలో తను సెలక్టివ్ గా ఉంటానని, అందుకే చాలా తక్కువ మంది మాత్రమే తనకు కథలు వినిపిస్తారని నజ్రియా చెప్పుకొచ్చింది. అందుకే తన కెరీర్ లో గ్యాప్స్ ఎక్కువగా కనిపిస్తాయని అంటోంది.
“నేను ఎక్కువగా బ్రేక్స్ తీసుకుంటాను. ఒకప్పుడు చాలామంది ఆడియన్స్ నా కమ్ బ్యాక్ ను సెలబ్రేట్ చేసేవాళ్లు. నజ్రియా కమ్ బ్యాక్ మూవీ అని గొప్పగా చెప్పేవారు. ఆ తర్వాత వాళ్లకు కూడా అర్థమైపోయింది. నా బ్రేక్స్ చూసి కమ్ బ్యాక్ ను సెలబ్రేట్ చేయడం మానేశారు. అంతా ఇప్పుడు నన్ను లైట్ తీసుకుంటున్నారు.”
ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా, తనను ఇష్టపడే వారు ఇంకా ఉన్నారని, అది తన అదృష్టం అంటోంది నజ్రియా. అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఎప్పుడు నటిస్తానో తెలియదని చెబుతోంది.