ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజాప్రయోజనాలు తప్ప మరొక మాట ఎరగని వ్యక్తిగా మన్నన ఉన్నవారు. ప్రొఫెసర్ కోదండరాం.. మనిషి మేధావే గానీ.. విధానం ఏమిటి? నాయకుడిగా అనుసరించే సిద్ధాంతం ఏమిటి? అనేది ఆయనకే తెలియదు. మరో మేధావి సుప్రీం మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ. వీరందరూ కూడా అమరావతి రాజధాని గురించి తమ తమ అమూల్య అభిప్రాయాలు వెల్లడించారు. వీరందరూ అమరావతి రాజధాని మాత్రమే ఉండాలనే అంటున్నారు. ఇదంతా ఒకే. కానీ.. వారికి జరుగుతున్న పరిణామాల గురించి స్పష్టత ఉన్నదా అనేదే సందేహం.
హరగోపాల్ చెప్పిన మాట కరక్టే. కానీ దానికి అనుగుణంగా పాతప్రభుత్వమైనా వ్యవహరించిందా అనేదే సందేహం. ప్రభుత్వాలు మారినప్పుడెల్లా రాజధానిని మార్చితే ఎలా అనడం కరక్టే. కానీ సిఆర్డీయే రూపంలో తప్ప.. రాజధానిగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేయలేదనేది అందరికీ తెలుసు. వెసులుబాటు ఉన్నది గనుకనే జగన్ సర్కారు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది. లేని రాజధానిని ఉన్నట్లుగా భ్రమించి… దాని మార్చినట్లుగా వ్యాఖ్యానిస్తే ఎలా?
ప్రొఫెసర్ కోదండరాం మాటలకు అసలు ఏమాత్రం విలువ లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ఇవాళ అనాథ రాష్ట్రంలాగా, దిక్కలేని రాష్ట్రంలాగా.. వనరులు లేక ఆదాయం కోల్పోయి కునారిల్లుతున్నదంటే.. రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన రూపేణా.. కేసీఆర్ కు ఎంత పాత్ర ఉందో.. కోదండరాంకు అంతే పాత్ర ఉంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ చేటు కోరుకునే ఈ మేధావి నాయకుడు.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిజమైన కన్నీళ్లు కారుస్తాడనుకోవడం భ్రమ. వికేంద్రీకరణ ద్వారా ఏపీ బాగుపడుతుందంటే.. దానిని అడ్డుకోడానికే ఈ మేధావి ఈ ప్రయత్నం చేస్తుంటాడన్నది నిజం.
ఇక సుప్రీం మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ. ఆయన కోర్టు ధిక్కరణ మాట ఎత్తుతున్నారు. ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయం అని అనడం లేదు. వెసులుబాటు చూసుకుంటోంది. కోర్టు ధిక్కరణ ఆవగింజంత జరిగినా ఆ మేరకు కేసులు వేయడానికి అమరావతి నిపుణులే బోలెడంత మంది ఉన్నారు. ఈ మాజీ న్యాయమూర్తి సలహా చెప్పక్కర్లేదు. కోర్టు తీర్పు అమలులో జాప్యం జరిగినా కూడా.. అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు సహకరించకపోయినా కూడా అది ధిక్కరణ కేసు అవుతుందా లేదా.. ఈ న్యాయనిపుణుడు చెప్పాలి.
ఇలాంటి మాటలు వేదికల మీద బాగుంటాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కావు అసలు ఏపీతో సంబంధం లేని ఇతర రాష్ట్రాల మేధావులు అందరినీ తీసుకువచ్చి.. వారి విలువైన.. ఏపీ గురించి శ్రద్ధలేని అభిప్రాయాలను వేదికమీదనుంచి వినిపిస్తే అది రాష్ట్రానికి మంచిచేస్తుందా అనేది ప్రజలు ఆలోచించాలి.