ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ క్రేజీ లీడర్ ఎవరంటే… బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు చెబుతారు. ప్రస్తుతం ఆయన శాప్ చైర్మన్. ఎన్నికలకు రెండేళ్ల గడువు వున్న నేపథ్యంలో… గత మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి ఇంటింటికి తెలియజేసేందుకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికార పార్టీ చేపట్టింది. ప్రతి ఒక్క నాయకుడు ఇంటింటికెళ్లి మరోసారి ప్రజాశీర్వాదం కోరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకే అందరూ వెళుతున్నారు.
అయితే గడపగడపకూ వెళ్లొద్దని వైసీపీ క్రేజీ యూత్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పార్టీ పెద్దలు ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేస్తాన్రా బాబూ అని అతను వేడుకుంటుంటే… వద్దొద్దు అని కొందరు పార్టీ పెద్దలు ఆదేశించడం గమనార్హం. నువ్వు గడపగడపకూ వెళితే గొడవలు అవుతాయని, కాబట్టి వేరే పనేదైనా వుంటే చూసుకోవాలని చెప్పినట్టు తెలిసింది.
కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్ధది బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. సిద్ధార్థ అబ్బ (నాయన తండ్రి) శేషశయనారెడ్డి ఏపీ మంత్రిగా, పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. పెదనాన్న రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో సిద్ధార్థరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కాలంలో పెదనాన్నతో విభేదించి రాజకీయంగా తన దారి తాను చూసుకున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
నందికొట్కూరు రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి ఆర్ధర్ గెలుపులో బైరెడ్డిది కీలక పాత్ర. ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యే, బైరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలొచ్చాయి. స్థానిక సంస్థల్లో బైరెడ్డి అభ్యర్థులకే ఎక్కువ సీట్లను అధిష్టానం కేటాయించింది. అభ్యర్థులందరినీ గెలిపించుకుని అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టారు.
సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రస్తుత తరుణంలో బలమైన నాయకుడైన బైరెడ్డిని ఇంటికే పరిమితం చేయడం, రాజకీయంగా చేతులు కట్టేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనివల్ల వైసీపీ భారీగా నష్టపోయే స్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నందికొట్కూరుకు వచ్చే సరికి టీడీపీ, బీజేపీలకు వైసీపీ తోడు అయ్యిందంటే వ్యక్తిగతంగా సిద్ధార్థ్‌ను ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
కర్నూలు జిల్లాలో తమకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్నాడనే భయమా? లేక పార్టీ మారుతారనే అనుమానమా? అనేది తెలియడం లేదు. కానీ, పార్టీ మాత్రం కట్టడి చేయడం చర్చనీయాంశమైంది. అయితే రాజకీయంగా చాలా యాక్టీవ్‌గా వుండే బైరెడ్డి లోలోపల బాధపడుతూ పార్టీలోనే కొనసాగుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు కర్నూలు వైసీపీలో ఏం జరుగుతోంది? యువనాయకుడి మనసులో ఏముంది? అనేవి తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
సొదుం రమణ