రాజకీయ నాయకులు లేదా సినీ సెలబ్రిటీల గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నదంటే అతను లేదా ఆమెలో ఏదో ప్రత్యేకత తప్పక ఉంటుంది. ఆ చర్చ మంచిగా లేదా చెడుగా …ఏదైనా కావచ్చు. ఏ వ్యక్తి గురించి ఇటు పూర్తి పాజిటివ్‌గా లేదా పూర్తి నెగిటివ్‌గా ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరిగే అవకాశం లేదు.
ఇంకా చెప్పాలంటే పనిగట్టుకుని ఎవరినైనా అప్రతిష్టపాలు చేయాలని కుట్ర చేస్తే బూమ్‌రాంగ్ కాక తప్పదు. ఉదాహరణకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి , ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ గురించి జరిగినంత విష ప్రచారం…బహుశా భారతదేశ రాజ కీయ చరిత్రలో మరే రాజకీయ నాయకులపై జరిగి ఉండదనే అభిప్రాయాలున్నాయి. అయితే ఆ విష ప్రచారం శ్రుతిమించడంతో జగన్ పాలిట అమృతమైందని చెప్పక తప్పదు. ఎందుకంటే దురుద్దేశంతో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే మన సమాజం అంగీకరించదు. జగన్ విషయంలో కుట్రదారుల ఎత్తుగడలు విఫలం కావడానికి కారణమదే.
ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే మెగాస్టార్ ఫ్యామిలీ గురించి తప్పక చెప్పుకోవాలి. ఏ రాజకీయ కారణాలైతే జగన్‌ను దెబ్బతీయాలని చూశారో…అదే మనుషులు, అదే ఎత్తుగడతో మెగాస్టార్ చిరంజీవిని బద్నాం చేయడంలో ఒక రకంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రాజకీయ తన ఒంటికి, మనసుకు పడవని భావించిన చిరంజీవి…ఆ తర్వాత కాలంలో పూర్తిగా వైదొలగి పూర్తిస్థాయిలో సినిమాలకే పరిమితమయ్యారు.
చిరు సోదరుడు పవన్‌కల్యాణ్‌పై కూడా వ్యక్తిగత దాడి తక్కువేం కాదు. అయితే అన్నలా తమ్ముడు వెన్ను చూపి పారిపోలేదు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో పవన్‌కల్యాణ్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న తమ అభిమాన అగ్రహీరో పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
హ్యాపీ బర్త్ డే పవన్‌కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. అసలే పవన్‌కల్యాణ్. ఆయన వ్యక్తిత్వాన్ని ద్వేషించే వాళ్లు ఎందరున్నా…అభిమానించే వాళ్లు అంతకు రెట్టింపు ఉన్నారు. అలాగే ఆయన నటనంటే పడిచచ్చే వాళ్లు తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో దేశంలోనే ట్విట్టర్ ట్రెండింగ్ స్టార్‌గా పవన్ కల్యాణ్ పేరు రికార్డ్ సృష్టించింది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 27.3 మిలియన్స్ ట్వీట్స్ వచ్చాయి. దీన్నిబట్టి పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పవన్‌కల్యాణ్ అంటే పవర్‌స్టార్ మాత్రమే కాదు…ట్రెండింగ్ స్టార్ కూడా అని రుజువైంది.