కన్నడ హీరోయిన్ ధరించిన డ్రెస్…ఆమెకు చిక్కులు తెచ్చింది. హిందుత్వానికి వ్యతిరేకంగా ఆమె నడుచుకుంటోందని సామాజిక కార్యకర్తలనే చెప్పుకునే కొందరు ఆమెపై దాడి చేశారు. ఈ దాడికి గురైన ఆ హీరోయిన్ పేరు సంయుక్త. బెంగళూరులోని పబ్లిక్ పార్క్‌లో ఫ్రెండ్‌తో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఆమెపై సామాజిక కార్యకర్తలమంటూ పది మంది యువకులు దాడికి పాల్పడ్డారు.
పబ్లిక్ పార్క్‌లో అసభ్యకర దుస్తులు ధరించి ఇలా చేయడం ఏంటని హీరోయిన్‌ను మందలించడంతో వివాదానికి తెరలేపింది. ప్రతిరోజూ పార్క్‌లో ఆమె అభ్యంతరకర దుస్తులతో వర్కవుట్స్ చేస్తున్నట్టు కొందరి ఫిర్యాదు మేరకు పది మంది యువకులు అక్కడికి వెళ్లారు.
కన్నడ హీరోయిన్‌తో ఆ యువకులకు మాటామాటా పెరిగింది. పరిస్థితి చేయి దాటిపోతున్న సమయంలో పోలీసుల రంగప్రవేశంతో సదరు హీరోయిన్ క్షేమంగా బయటపడింది. అయితే తనపై దాడికి యత్నించిన యువకుల వీడియోను పోలీసులకు ఆమె చూపించారు.
స్పోర్ట్స్ బ్రా ధరించడం నేరమా, ఇదేనా ఇండియాలో మాకున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలంటూ అంటూ ప్రశ్నించారు. పోలీసులు సంయుక్తతో పాటు సామాజిక కార్యకర్తలని వచ్చిన వారిని స్టేష్‌న్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.