బాలీవుడ్ వరస పరాజయాల నేపథ్యం, ఇదే సమయంలో సౌత్ సినిమాలు నార్త్ ను ఆకట్టుకుంటూ ఉన్న నేపథ్యంలో… యాడ్ మార్కెట్ చూపు కూడా సౌత్ స్టార్లపై పడుతోంది.
ఎవరు ఊపు మీద ఉంటే వారినే బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడానికి కంపెనీలు మొగ్గు చూపుతాయనేది స్పష్టం అయ్యే విషయమే. ఫామ్ లో ఉన్న వారితోనూ, ప్రజల చూపును ఆకర్షిస్తున్న వారితోనే బ్రాండింగ్ ప్రమోషన్లో బిజీగా ఉన్న కంపెనీలు ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో కార్పొరేట్ వ్యాపార సంస్థల చూపు సౌత్ స్టార్లపై పడింది.
అల్లు అర్జున్, రష్మిక, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ… ఇలా కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటున్న వారిలో సౌత్ నటీనటుల పేర్లే ముందు వరసలో నిలుస్తూ ఉన్నాయి. బాలీవుడ్ తారలతో ఒప్పందాలను రద్దు చేసుకుని సైతం కొన్ని సంస్థలు ఇటువైపు మొగ్గు చూపుతూ ఉండటం గమనార్హం. ఇలా యాడ్స్ విషయంలో కూడా సౌత్ స్టార్లు పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు!
ఈ పరంపర కొన్నేళ్ల కిందటే మొదలైంది. మహేశ్ బాబుతో కొన్ని యాడ్స్ ను చేయించి వాటిని ఇండియా వ్యాప్తంగా ప్రసారం చేశాయి కొన్ని సంస్థలు. మామూలుగా అయితే అంతకు ముందు తెలుగు స్టార్లు చేసే యాడ్స్ తెలుగునాటకే పరిమితం. హిందీ, తమిళం, కన్నడ ఇలా ఎక్కడిక్కడ వేరే వాళ్లతో యాడ్స్ ను చేయించే సంప్రదాయం ఉండేది. మహేశ్ ఫామ్ లో ఉన్న దశలో పాన్ ఇండియా యాడ్స్ లో కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్ వంతు వచ్చింది. బాహుబలి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ యాడ్ మార్కెట్ లో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఇప్పుడు అల్లు అర్జున్, రష్మిక, రామ్ చరణ్ వంటి వారి వంతు వచ్చింది. అల్లు అర్జున్ ఇప్పటికే అరడజను బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. ఇక అండర్ వేర్ యాడ్ లో నటించి విమర్శల పాలైనప్పటికీ రష్మిక ఇప్పుడు యాడ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న నటి. అలాగే రామ్ చరణ్ కూడా తనవైన ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాడు.
ఇన్నేళ్లూ సౌత్ నటీనటులో యాడ్ చేయిస్తే అది ఆ ప్రాంతీయ భాషకు పరిమితం అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో కూడా పూర్తి మార్పు కనిపిస్తూ ఉంది!