వాట్సాప్, స్కైప్ కాల్స్ కు చార్జీలు రాబోతున్నాయా!

ఇంట‌ర్నెట్ విస్తృతం అయ్యాకా, స్మార్ట్ ఫోన్లు మ‌రింత‌గా చేర‌వ‌య్యాకా.. ప్ర‌తి చేతిలోనూ స్మార్ట్ ఫోన్, ప్ర‌తి ఇంటికీ బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్లు త‌ప్ప‌నిస‌రి అవుతున్న త‌రుణంలో.. అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు టెక్ కంపెనీల‌కూ వాట్సాప్,…

ఇంట‌ర్నెట్ విస్తృతం అయ్యాకా, స్మార్ట్ ఫోన్లు మ‌రింత‌గా చేర‌వ‌య్యాకా.. ప్ర‌తి చేతిలోనూ స్మార్ట్ ఫోన్, ప్ర‌తి ఇంటికీ బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్లు త‌ప్ప‌నిస‌రి అవుతున్న త‌రుణంలో.. అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు టెక్ కంపెనీల‌కూ వాట్సాప్, స్కైప్, జూమ్ మీటింగ్స్ .. ఇత‌ర వీడియో కాన్ఫ‌రెన్సింగ్ అవ‌కాశాలు వ‌ర‌ప్ర‌దంగా మారాయి. 

వీడియో కాల్స్ ఇప్పుడు నిత్యావ‌స‌రం అయిపోయాయి. అటు సామాన్య ప్ర‌జ‌లూ ఈ స‌దుపాయాన్ని విప‌రీతంగా ఉప‌యోగిస్తూ ఉన్నారు. ఇక వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ లో ఉన్న ఉద్యోగులు వీటి ఆధారంగానే ముందుకు సాగుతూ ఉన్నారు. తిరుగులేని కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు వీటి మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి. మ‌రి ఇలాంటి త‌రుణంలో వీటిపై కేంద్ర ప్ర‌భుత్వం క‌న్ను ప‌డింది!

త్వ‌ర‌లోనే వీటిని రెగ్యులేట్ చేయ‌డానికి పూనుకోనుంద‌ట ప్ర‌భుత్వం. ఇందుకు సంబంధించి టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి ప‌ని చెప్పింద‌ట. వివిధ యాప్స్ లో ఉన్న వీడియో కాల్ స‌దుపాయాన్ని, వీడియో కాల్స్ కోస‌మే ఉన్న యాప్స్ లో కాల్స్ ను రెగ్యులేట్ చేయడానికి ట్రాయ్ పూనుకోనుంద‌ని తెలుస్తోంది. మ‌రి రెగ్యులేట్ చేయ‌డం అంటే.. స‌ద‌రు యాప్స్ ఓన్డ్ కంపెనీల నుంచి స‌బ్ స్క్రిప్ష‌న్ రేటును వ‌సూలు చేసే అవ‌కాశాలున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కూ ట్రాయ్ రెగ్యులేట‌రీలో టెలికాం కంపెనీలున్నాయి. టెలికాం కంపెనీలు ఎలాగైతే ట్రాయ్ కు లైసెన్స్ ఫీజులు చెల్లిస్తూ ఉన్నాయో, ఇదే త‌ర‌హాలో వీడియో కాన్ఫ‌రెన్సింగ్ టూల్స్ కూడా లైసెన్స్ ఫీజులు చెల్లించుకునే రోజు మ‌రెంతో దూరంలో లేద‌ని తెలుస్తోంది.

ఆ కంపెనీల నుంచి లైసెన్స్ ఫీజులు వ‌సూలు చేశాయంటే అవేం క‌డ‌తాయి. వెనువెంట‌నే ఆ మొత్తాన్ని వాటి వినియోగ‌దారుల నుంచినే వ‌సూలు చేస్తాయి. ఇందులో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో.. వాట్సాప్, స్కైప్ ఇత‌ర వీడియో కాల్ యాప్స్ కు మంత్లీ రీచార్జ్ లు చేయించుకునే ప‌రిస్థితి త‌లెత్త‌వ‌చ్చు. 

ఇంట‌ర్నెట్ డేటా ఉంటే చాలు.. వీడియో కాల్స్ ను విప‌రీతంగా మాట్లాడుతూ వ‌చ్చిన ప్ర‌జ‌లు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు.. ఇక ఈ సేవ‌ల విష‌యంలో కూడా స‌బ్ స్క్రిప్ష‌న్లు చేయించుకుని ఆ మేర‌కు వాడుకోవాల్సి వ‌చ్చేలా ఉంది. మ‌రి ఈ కంపెనీల లైసెన్స్ ఫీజులు ఏ రేంజ్ లో ఉంటాయో.. కేంద్రం ఈ అవ‌కాశాన్ని ఏ మేర‌కు సొమ్ము చేసుకుంటుందో!