టాటా సన్స్ ఎక్స్-చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ కు రోడ్డు ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మిస్త్రీతో పాటు ఆయన సన్నిహితుడు ఒకరు మరణించగా, ఇతరులు గాయపడ్డారు. ముంబైకి 110 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తీరును చూస్తే యాక్సిడెంట్ లాగానే ఉందంటూ వారు వ్యాఖ్యానించారు.
ఈ ఘటనకు సంబంధించి అనుమానాలు వ్యక్తం కావడంలో ఆశ్చర్యం లేదు. అలాగని ఇది కచ్చితంగా కుట్ర అని ఎవ్వరూ అనలేరు. 2012లో రతన్ టాటా రిటైర్మెంట్ తర్వాత సైరస్ మిస్త్రీ ఆయన వారసుడిగా టాటా సన్స్ పగ్గాలు చేపట్టారు. నాలుగేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. వివాదాలో, విబేధాలో కానీ.. ఆయన ఆ స్థానం నుంచి వైదొలిగారు.
రెగ్యులర్ గా పేపర్ చదివే వాళ్లు కూడా కాస్త ఆశ్చర్యపోయిన పరిణామం అది. మిస్త్రీ టాటా బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు బాగా హడావుడి కథనాలు వచ్చాయి. వీరి నేపథ్యం గురించి బోలెడు కథనాలు వచ్చాయి. అంత హడావుడి తర్వాత నాలుగేళ్లకే ఆయన ఆ స్థానం నుంచి వైదొలగడం ఆశ్చర్యాలను కలిగించింది. ఆ తర్వాత కూడా వివాదాలకు సంబంధించిన వార్తలైతే వచ్చాయి.
వాటికీ మిస్త్రీ యాక్సిడెంట్ లో మరణించడానికి అణుమాత్రం సంబంధం లేకపోవచ్చు. అయితే అంత పెద్ద ధనికుడు, ఇతర ధనికులతో ప్రయాణం చేస్తూ.. రోడ్డు మార్గాన ప్రయాణం చేయడమే పెద్ద ఆశ్చర్యం. అది కూడా ముంబై నుంచి అహ్మదాబాద్ కు! విమాన సౌకర్యాలు ఉన్న నగరాల మధ్యన రోడ్డు ప్రయాణం ఒకింత ఆశ్చర్యమే. అది కూడా అర్ధరాత్రి తర్వాతే వీరి ప్రయాణం మొదలైందని స్పష్టం అవుతోంది. కుట్ర చేసి మిస్త్రీని ఎవ్వరూ రోడ్డు మార్గాన తీసుకువచ్చి ఉంటారని ఎవ్వరూ అనలేరు. ప్రముఖ వ్యక్తి కావడం, వివాదాలు రేగి ఉండటంతో.. కుట్ర? అనే ప్రశ్నార్థకం ఒకటి వ్యక్తం అవుతోంది.
ఈ అంశంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. మిస్త్రీ మరణంపై పూర్తి విచారణ చేయిస్తామని ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టుగా చెప్పారు! శ్రీమంతుడు అయినప్పటికీ అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రయాణానికి మొగ్గు చూపడం, బాగా ఖరీదైన కారు అయినప్పటికీ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు దక్కకపోవడం సామాన్యులకు ఆశ్చర్యాలను కలిగించే అంశాలు.