వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిరిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారా? ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. నియోజకవర్గాల్లో తిరగకుండా, ఎక్కడో దూరంగా పట్టణాలు, నగరాలకు పరిమితమైన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చే ప్రశ్నే లేదని చంద్రబాబు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఆచరణలో ఇది వరకూ సాధ్యమనే చర్చ టీడీపీలో జరుగుతోంది.
స్వయంగా బాబు తనయుడు లోకేశే సోషల్ మీడియాకు పరిమితమై క్షేత్రస్థాయిలో తిరగడం లేదు. ఆయనకు హితవు చెప్పే ధైర్యం, అలాగే టికెట్ ఇవ్వకుండా ఉండగలరా? అనే ప్రశ్న సొంత పార్టీలోనే ఉత్పన్నమైంది. కొడుకు కావడంతో లోకేశ్‌ను మినహాయించినా, మిగిలిన వారి విషయంలో చంద్రబాబు అంత సులువుగా నిర్ణయం తీసుకోలేరని అంటున్నారు.
సర్వే నివేదికల్లో ఎవరికైనా ప్రతికూలత ఉన్నట్టు తేలితే నిర్మొహమాటంగా టికెట్ నిరాకరిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. అంతెందుకు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత ఉందనే సమాచారం వచ్చిన నేపథ్యంలో అక్కడ అదనపు సమన్వయకర్తను వైఎస్ జగన్ నియమించారు. శ్రీదేవి ఎంత మొత్తుకున్నా జగన్ నిర్ణయంలో మార్పు ఉండదు. అలాగే తిరుపతి జిల్లా గూడూరులో కూడా అదనపు సమన్వయకర్త త్వరలో వచ్చే అవకాశం వుంది.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. జగన్ ఒక నిర్ణయానికి వస్తే… తాను ఏమనుకుంటున్నారనేదే తప్ప, ఎదుటి వాళ్ల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు అలా కాదు. ప్రతిదీ నాన్చివేయడం ఆయన నైజం. జెట్ వేగంతో రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ధోరణి టీడీపీకి నష్టం కలిగిస్తోందనే అభిప్రాయాలున్నాయి.
అభ్యర్థులను మార్చుతానని కేవలం మీడియా ద్వారా భయపెట్టడానికే తప్ప, మరొకటి కాదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయాలకు కాలం చెల్లిందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ నాయకుడు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు గర్జనలు, ఆగ్రహావేశాలు అన్నీ మీడియాకు పరిమితం అవుతున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ ప్రక్షాళనకు సమయం కేటాయించి వుంటే బాగుండేదని, కానీ ఆయన ఆ పని చేయడం లేదంటున్నారు.