టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కుటుంబం నుంచే గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే అఖిలప్రియతో వరుసకు సోదరుడైన భూమా కిషోర్‌రెడ్డి విభేదించి తన దారి తాను చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం. మరోవైపు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో అఖిలకు ఏ మాత్రం పొసగడం లేదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేనట్టు సమాచారం.
ఇది చాలదన్నట్టు అఖిలప్రియకు కొత్త సమస్య ఎదురు కానుంది. అఖిలప్రియ చెల్లి భూమా మౌనికారెడ్డి త్వరలో ఆళ్లగడ్డ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారని విశ్వసనీయ సమాచారం. మౌనికారెడ్డికి రాజకీయాలంటే ఆసక్తి. మంచి మాటకారి కూడా. అక్క కంటే చెల్లి బాగా మాట్లాడ్తారని, అభిమానంగా వుంటారని ఆళ్లగడ్డలో టాక్. హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసులో అఖిలప్రియ జైలుకెళ్లినప్పుడు మౌనికారెడ్డి ఆళ్లగడ్డ వెళ్లారు.
అక్క లేకపోయినా, తానున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అఖిలప్రియ జైల్లో వున్నప్పుడే ఆళ్లగడ్డలో తిష్ట వేయాలని మౌనికారెడ్డి ప్రయత్నించారు. అయితే అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలున్న నేపథ్యంలో మౌనిక రాకను అఖిలప్రియ అంగీకరించలేదు. దీంతో మౌనిక మళ్లీ ఆళ్లగడ్డ వైపు చూడలేదు. మౌనికకు కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ కరువైంది. దీంతో సమయం కోసం ఎదురు చూస్తూ గడిపారు.
తాజాగా మంచు మనోజ్ అండతో ఆళ్లగడ్డలో రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించడానికి మౌనిక సిద్ధమైనట్టు తెలిసింది. మంచు మనోజ్ కుటుంబ నేపథ్యం అందరికీ తెలిసిందే. మనోజ్‌తో మౌనిక అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పెళ్లి, రాజకీయ ప్రవేశంతో త్వరలో చెబుతానని మంచు మనోజ్ నర్మగర్భ వ్యాఖ్యల వెనుక మౌనికను దృష్టిలో పెట్టుకుని చెప్పి వుంటారనే చర్చ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతోంది.
రాజకీయంగా, ఆస్తుల పరంగా అక్కతో తాడోపేడో తేల్చుకోవాలనే పట్టుదలతో మౌనిక ఉన్నట్టు సమాచారం. తన వెనుక ఎవరూ లేరని ఇంత కాలం ఇష్టానుసారం అఖిలప్రియ వ్యవహరిస్తోందనే ఆగ్రహం చెల్లిలో గూడు కట్టుకుంది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని మౌనిక తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని తెలిసింది. దీంతో రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో మాత్రం అక్కాచెల్లి మధ్య దబిడి దబిడే అని చెప్పక తప్పదు.