ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని సినీ హీరో మంచు మనోజ్ పెళ్లాడనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. మంచు మనోజ్ వివాహం చేసుకోనున్న ఆ యువతి దివంగత భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల కుమార్తె మౌనికారెడ్డి. హైదరాబాద్ నగరంలోని గణేష్ మండపం వద్ద మౌనికారెడ్డితో కలిసి మంచు మనోజ్ పూజలు చేయడంతో పెళ్లి వార్తలకు బలం కలిగించాయి.
ప్రణతితో మంచు మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పెళ్లిపై రకరకాల ప్రచారాలు జరిగాయి. వాటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇక భూమా మౌనికారెడ్డి విషయానికి వస్తే బెంగళూరుకు చెందిన గణేష్‌రెడ్డితో మొదటి వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల క్రితం గణేష్‌తో మౌనికా విడాకులు తీసుకున్నారు. గణేష్ కుటుంబానిది చిత్తూరు జిల్లా. వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు.
విడాకుల అనంతరం మౌనికారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం మంచు మనోజ్, మౌనికా చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లోని ఓ విల్లాస్‌లో వున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇద్దరూ కలిసే ఉన్నట్టు తెలిసింది. మంచు మోహన్‌బాబు కుటుంబంతో మనోజ్ దూరంగా ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.
ఇదిలా వుండగా గణేష్ మండపం వద్ద మౌనికారెడ్డితో కలిసి పూజలు చేసిన మంచు మనోజ్‌ను పెళ్లి విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పెళ్లి తన వ్యక్తిగత అంశమన్నారు. సమయం వచ్చినపుడు చెబుతానన్నారు. అంతే తప్ప, పెళ్లి వార్తలను ఖండించకపోవడం గమనార్హం.