సినిమా హీరోల్లో కొందరికి లవర్ బాయ్ ఇమేజి ఉంటుంది. పార్టీల్లో టిడిపి లవర్ పార్టీ యిమేజి తెచ్చుకుంటోంది. అవతలి పార్టీలో ప్రేమ రగలకపోయినా తన ప్రయత్నాలు మాత్రం మానటం లేదు. జనసేనతో అలాగే ఒన్‌సైడ్ లవ్ (బాబు గారి మాటల్లోనే) జరిపి చివరకు సాధించింది. ‘టిడిపితో కాలు కదిపి కదం తొక్కకపోతే, మీతో కటీఫ్ కైనా వెరవను’ అని బిజెపికి చెప్పే స్థాయిలో పవన్ ప్రేమలో పడ్డారు. పవన్ వికెట్ పడేశాక, యిప్పుడు బిజెపితో ఒన్‌సైడ్ లవ్‌లో పడింది టిడిపి. ప్రస్తుతానికి బిజెపి నాయకులు ఛీ, అలాటిదేం లేదు అంటున్నారు. జివి నరసింహారావు, సునీల్ దేవధర్, డా. లక్ష్మణ్‌లు ఏం చెప్పినా టిడిపి మీడియా మాత్రం ఇండియన్ ఎక్స్‌ప్రెస్, రిపబ్లిక్ టివి అని పలవరిస్తూ కథనాలు వండి వార్చేస్తోంది.
‘పారాహుషార్, బాబూ’ పేరుతో రాసిన వ్యాసంలో బిజెపి కబళింపుకు ఎఱ కాకుండా తన పార్టీని కాపాడుకోవలసిన అవసరం బాబుకి ఏ మేరకు ఉందో విపులీకరించడం జరిగింది. ఆయనకూ ఆ అవగాహన ఉంది కానీ పార్టీని సంస్కరించి, కార్యకర్తల్లో ఉత్తేజం రగిలించి క్యాడర్‌ను, నాయకులను బిజెపి పాలపడకుండా కాపాడు కోవడమనే క్లిష్టమైన ప్రక్రియ జోలికి పోదలచుకోలేదు. అదే సమయంలో యథాతథ పరిస్థితి కొనసాగితే బిజెపి దాడిని తట్టుకునే శక్తి లేదనే అంచనాకు వచ్చారు. ‘ఇఫ్ యూ కాంట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్’ అన్నట్లు, బిజెపితో కలహించే బదులు, కత్తు కలుపుకుంటే మేలు అనే ధోరణిలో పడ్డారాయన. అయితే బిజెపి అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించటం లేదు. వారిలో ఆ ఆలోచన కలిగించి, పొత్తు ఎంత ఉభయతారకమో నచ్చచెప్పే ప్రయత్నాల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
దానికి గాను తనకు అచ్చివచ్చిన మీడియా మేనేజ్‌మెంట్ టెక్నిక్కును వాడుతున్నారు. టిడిపితో చేతులు కలిపితే బిజెపికి ఎంత మేలు కలుగుతుందో జాతీయ మీడియాలో కథనాలు వచ్చేట్లా చేస్తున్నారు. దానివలన బిజెపి అధిష్టానం కరిగినా కరగకపోయినా, ఆంధ్రలో టిడిపి క్యాడర్, నాయకులు మాత్రం ‘మనం బిజెపివైపు చూడనక్కరలేదు, దసరాకో, తప్పితే దీపావళికో కేంద్రంలో అత్యంత బలంగా ఉన్న ఎన్‌డిఏలో మన పార్టీ చేరబోతోంది. చేరి మన శత్రువు వైసిపి దుంప తెంపబోతోంది. ఈలోగా మనం తొందరపడి బిజెపిలోకి గెంతకూడదు’ అని ఆగుతారు. ఇదీ బాబు ఆశ. దీపావళి నాటికి ఆ చేరిక జరగకపోతే ‘జగన్ మోదీ దగ్గరకెళ్లి ఏడ్చి రాగాలు పెట్టాడట, అందువలన తెలుగు సెంటిమెంటుతో సంక్రాంతికి వాయిదా వేశారట’ అనే కథనాన్ని అందించవచ్చు.
ఆగస్టు 28 న ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, న్యూ దిల్లీ’ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ కూమీ కపూర్ ఓ వ్యాసం రాశారు ’పక్షం రోజుల క్రితం బాబు మోదీని కలిసినప్పుడే, ఆయన కుమారుడు లోకేశ్ రహస్యంగా అమిత్ షాను కలిశారు. జగన్‌తో బిజెపికి వైరం వచ్చిన కారణంగా, టిడిపితో చేతులు కలపాలని బిజెపి ఆలోచిస్తోంది. టిడిపి చేయించిన ఒక సర్వేలో బిజెపికి ఆంధ్రలో 4-5% ఓట్లున్నట్లు తేలింది. బిజెపి-టిడిపి పొత్తు పెట్టుకుంటే యిద్దరి ఓట్ల శాతం విపరీతంగా పెరుగుతుందని బిజెపి భావిస్తోంది. రాబోయే పండగ రోజుల్లో టిడిపిని ఎన్‌డిఏలోకి చేరుతుందనే ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.’ అని ఆవిడ రాసింది. దీనిపై టివి5 రిపోర్టరు వ్యాఖ్యానిస్తూ ఎన్‌డిఏలోంచి అకాలీదళ్, శివసేన, తాజాగా జెడియు వెళ్లిపోవడంతో అది డీలా పడిపోయిందని, అందుకని టిడిపి వంటి బలమైన ప్రాంతీయ పార్టీని చేర్చుకుని బలపడదామని చూస్తోందని అన్నారు.
ఎన్‌డిఏ లోంచి అకాలీ దళ్ వెళ్లిపోయినందు వలన బిజెపి ఖేదపడుతోందని అనుకోవడానికి ఏమీ లేదు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ ప్రధాన నాయకులతో సహా అందరూ ఓడిపోయారు. ఉప యెన్నికలో గెలిచినా ఆ పార్టీ యిప్పట్లో కోలుకోలేదు. ఇక శివసేన పార్టీ ఎన్‌డిఏలోంచి వెళ్లిపోయిందని ఎందుకనుకోవాలి? మెజారిటీ ఉన్న చీలిక వర్గం బిజెపితోనే ఉంది కదా! జెడియు విషయానికి వస్తే బిజెపియే దాని పీక తెగ్గోయబోతే గంప లోంచి కోడి తప్పించుకున్నట్లు తప్పుకుంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు కోసం బిజెపి తహతహ లాడుతోందని అనుకోవడం పొరపాటు. అసలు దేశంలో ప్రాంతీయ పార్టీలను తుడిచి పెట్టేసి వాటి స్థానం ఆక్రమించాలనే లక్ష్యంతో ఉందా పార్టీ. ఎన్ని తగ్గించగలిగితే అంత మంచిది అనే భావంతో ఉన్న బిజెపి, ఓట్లున్నా, సీట్లు లేక అల్లాడుతున్న టిడిపికి ప్రాణం పోసి, నిలబెట్టి కేంద్రంలో అందలం ఎక్కిస్తుందంటే నమ్మడం కష్టం.
ఇక అమిత్ లోకేశ్‌ను రహస్యంగా కలవడం గురించి, కలిశారనీ, కలవలేదనీ మనం గట్టిగా ఏమీ చెప్పలేం. పాత్రికేయులకు ఎక్కడెక్కడి నుంచో సమాచారం వస్తూ ఉంటుంది. వెరిఫికేషన్ కోసం ఆగకుండా బ్రేకింగ్ న్యూసులు యిచ్చేస్తారు. ఖండనమండనలు వస్తే అప్పుడే చూసుకోవచ్చనే ధీమా వారిది. వాదన కోసం కలిశారనే అనుకుందాం. అంతమాత్రం చేత వారి మధ్య సంప్రదింపులు ఫలప్రదమయ్యాయని అనుకోగలమా? లోకేశ్‌కు టిడిపి నాయకులే పెద్దగా విలువ నివ్వరు. టిడిపిలో నిర్ణాయక శక్తి అంటే చంద్రబాబు తప్ప వేరెవ్వరూ అగపడరు. అలాటిది ఏకంగా అమిత్ లోకేశ్‌తో చర్చలు జరిపారంటే నమ్మడం కాస్త కష్టం. సమాన స్థాయిలో చర్చలు జరపక పోయినా మీ నాన్నగారికి యీ విషయం చెప్పు అని చెప్పడానికి పిలిచి ఉండవచ్చేమో!
ఆ టెర్మ్‌స్ ఉభయపక్షాలకూ అంగీకారమై ఉండి వుంటే ఫాలో అప్ కోసం అమిత్ హైదరాబాదు పర్యటనలో బాబుతో కలిసి ఉండేవారు. కలిశారని టిడిపి మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అమిత్ బిజీ షెడ్యూల్‌లో అది సాధ్యపడి వుండదని తక్కినవారు కొట్టి పడేశారు. కూమీ కపూర్ వ్యాసంలో బిజెపికి, వైసిపికి పడటం లేదని రాశారు. మామూలు ప్రజలకైతే ఆ దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. కేసుల కారణమో, మరోటో జగన్ కేంద్రానికి దాసోహమంటూనే ఉన్నాడు. ఆంధ్రకు యివ్వాల్సిన నిధులు యివ్వటం లేదన్న అభ్యర్థన తప్పిస్తే, కేంద్రం చేసే చట్టాలపై, తీసుకునే చర్యలపై పన్నెత్తి ఒక్క మాట అనటం లేదు. వాళ్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వాళ్లు అడక్కముందే పరిగెట్టుకెళ్లి మద్దతు ప్రకటించేస్తున్నాడు. అధికారంలో ఉన్న వైసిపితో పేచీ పెట్టుకుని అధికారానికి సుదూరంగా ఉన్న టిడిపితో పొత్తు కోసం బిజెపి వెంపర్లాడుతుందా?
2024లో వైసిపి మళ్లీ గెలవదని కచ్చితంగా తెలిస్తేనే బిజెపి వైసిపితో తెంపుకుని, టిడిపితో కలుపుకుంటుంది. కానీ వైసిపిని మళ్లీ గెలవకుండా చేయాలంటే, బిజెపి టిడిపి కలవాలి. ‘పెళ్లయితే తప్ప పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే తప్ప పెళ్లి కుదరదు’ అనే సామెతలా అయిందీ వ్యవహారం. ఒకవేళ టిడిపి, వైసిపిలలో పొత్తో, సఖ్యతో పాటించాలంటే బిజెపి టిడిపిని ఎంచుకుంటుంది అని అనుకోవడం కష్టం. ఎందుకంటే బిజెపికి జాతీయ స్థాయిలో ప్రధాన శత్రువు కాంగ్రెసు. కాంగ్రెసు ఎంత శల్యావశిష్టమైనా, స్థానిక నాయకుల కారణంగా 2024లో 40 ఎంపీ సీట్లు తెచ్చుకోవచ్చు. అంటే ఏ ప్రాంతీయ పార్టీ కన్నా ఎక్కువే. ఆ పార్టీతో కలిసి ఏర్పడే కూటమిలో చేరడానికి జగన్ ఛస్తే ఒప్పుకోడు. తనను జైల్లో పెట్టిన పార్టీపై అతనికి నరనరాలా ద్వేషముంది. కానీ బాబైతే కాంగ్రెసే కాదు, బిజెపితో ఆజన్మవైరం ఉన్న లెఫ్ట్‌తో నైనా కలిసిపోగలరు. అలాటాయనతో పొత్తు పెట్టుకోడానికి బిజెపి చేతిలో ఉన్న వైసిపిని వదులుకుంటుం దనుకోవడం తర్కరహితంగా ఉంటుంది.
ఏది ఏమైనా కూమీ కపూర్ వ్యాసం రాగానే సునీల్ దేవధర్ ఓ ట్వీటు పడేశాడు. అదంతా ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం తప్ప మాకా ఉద్దేశం ఏమీ లేదు. మా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా మా అంతట మేమే 2024లో ఆంధ్రలో అధికారంలోకి రావలసినదే అని ప్రకటించారు అని. కానీ యీ లోపునే వైసిపిలో టిడిపి ఓవర్టు రఘురామరాజు గారు మీడియా ముందుకు వచ్చేశారు. ఓవర్టు అనే పదాన్ని నామవాచకంగా వాడతారా లేదా అని నాకు తెలియదు. తమ మనిషి ఎదుటి పార్టీలో ఉంటూ రహస్యంగా తమకోసం పని చేస్తే కోవర్టు అంటున్నారు, అదీ విశేషణమే అయినా. రఘురామ గారు అలా బహిరంగంగా పనిచేస్తారు కాబట్టి ఓవర్టు అంటున్నాను. ఆయన ఎన్‌డిఏలో టిడిపి చేరడం ఖాయం, మా పార్టీకి నష్టం కలగడం ఖాయంన్నర అని మాట్లాడారు.
వెంటనే టీవీ5, ఎబిఎన్, ఆంధ్రజ్యోతి సమైక్యంగా పొత్తు రాగం అందుకున్నాయి. టిడిపి, బిజెపి కలయిక గురించి నాలుగైదు నెలలుగా (కొందరు వక్తలు రెండు, మూడు నెలలు అన్నారు) చర్చలు జరుగుతున్నాయని, అవి ఒక కొలిక్కి వచ్చి దీపావళి లోపున టిడిపి కేంద్ర కాబినెట్‌లో చేరి వైసిపి ప్రభుత్వానికి ముకుతాడు వేయడం ఖాయమని చెప్పసాగాయి. పొత్తు కుదిరిందని యిటీవలి కొన్ని సంఘటనలు నిరూపించాయని చెప్పాయి. వాళ్లు చెప్పినవి ఆరు పాయింట్లు. మొదటిది మోదీ, బాబు దిల్లీలో భేటీ కావడం! అసలు దాన్ని భేటీ అని ఎలా అంటారో నాకు అర్థం కాదు. బాబు స్వయంగా చెప్పినదేమిటి? ‘దిల్లీ రావటం లేదా? ఈ సారి వచ్చినపుడు కలవండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి.’ అనే కదా మోదీ అన్నది. సినిమా భాషలో చెప్పాలంటే ‘టచ్‌లో ఉండు’ అన్నట్టన్నమాట. అలా అన్నంత మాత్రాన వేషం యిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. నిన్ను మర్చిపోలేదు, అవసరమైతే పిలుస్తానులే అనే నోటిమాట.
మీతో చాలా మాట్లాడాలి అంటే అవేమైనా కావచ్చు. జగన్‌పై కేసులు పెట్టడానికి కొత్తగా చేసిన స్కాములైమైనా ఉన్నాయా? అని కూపీ లాగడానికి కావచ్చు. బాపుగారి కార్టూన్లో ‘ముగ్గురి పని చేస్తున్నానండి, ఇంక్రిమెంటు యిప్పించండి’ అని గుమాస్తా అడిగితే ‘నీ యింక్రిమెంటు సంగతి తర్వాత, ఆ తక్కిన యిద్దరూ ఎవరో చెప్పు, ఉద్యోగం పీకేస్తా’ అంటాడు మేనేజరు. అలాగే మోదీ బాబుతో ‘పొత్తు సంగతి తర్వాత చూద్దాంలే, ముందు జగన్ లొసుగులు చెప్పు, వాడుకోవాలి’ అనవచ్చు. పొత్తు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ‘కేంద్రంలో మీరు తోపయితే కావచ్చు, రాష్ట్రంలో మేమే తోపు. అసెంబ్లీ సీట్లలో 75% మాకే కావాలి. తక్కిన 25%లో మీరూ, జనసేన సర్దుకోవాలి.’ అని టిడిపి అనవచ్చు. దానికి స్థానిక బిజెపి నాయకులు ఒప్పుకోరు. ‘మోదీ ప్రభావం పల్లెపల్లెనా కనబడుతోంది. ఇన్ని తక్కువ సీట్లు తీసుకుంటే బాబు మనను ఎదగనివ్వరు’ అని వాదిస్తారు.
ఇలా అనేక బేరసారాలు కింది లెవెల్లో ప్రారంభమై ఓ దశలో నడ్డా, ఆ తర్వాత అమిత్ తేలుస్తారు. ఫైనల్‌గా మోదీ దగ్గర తునితగవు జరుగుతుంది. ఈ ప్రాసెస్ పైనుంచి కిందకు రాదు. పైగా గతానుభవాల దృష్ట్యా మోదీ, బాబు మధ్య అగాధాన్ని పూడుద్దామని మోదీ అనుకునుంటే, బాబుని రహస్యంగా కలిసి మాట్లాడేవారు. లేదా ఎపాయింట్‌మెంటిటిచ్చి గంటో, అరగంటో మాట్లాడేవారు. అవేమీ లేకుండా చుట్టూ వందమంది ఉన్నపుడు నవ్వుతూ పలకరిస్తే దాన్ని భేటీ అని ఎలా అంటారో నాకు తెలియటం లేదు. చిన్నప్పటి నుంచీ వింటూ వచ్చిన పాత్రికేయ భాష కాదిది. దీనికంటె అమిత్, లోకేశ్ రహస్యంగా కలిశారన్నది ప్రాధాన్యత ఉన్న వార్త. పైగా దాని గురించి రాసినది కూమీ కపూర్.
కానీ వింతగా యీ టిడిపి మీడియా దాని గురించి ఎక్కువగా చర్చించలేదు. అమిత్ వంటి అత్యంత శక్తిశాలి లోకేశ్‌ని పిలిపించి మాటామంతీ ఆడారంటే లోకేశ్ స్టేచర్ చాలా పెరిగిపోయినట్లే. ‘జూనియర్‌తోనే కాదు, అంతకంటె ముందుగా అమిత్ లోకేశ్ తోనే మాట్లాడాడు. పైగా జూనియర్‌తో సినిమా విషయాలు మాట్లాడితే దేశ, రాష్ట్ర రాజకీయాలపై లోకేశ్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి భేటీ అయ్యారు. పిన్న వయస్సులోనే లోతైన అవగాహన పెంచుకున్నందుకు లోకేశ్‌ను అమిత్ అభినందించారు.’ అని లీకుల రూపంలోనైనా టిడిపి చెప్పుకుని బాబు వారసుడిగా ‘వినా లోకేశం, ననాథో ననాథ’ అని ప్రచారం చేసుకోవచ్చుగా! అదేమీ చేయటం లేదు. దీన్ని బయటపెట్టవద్దని అమిత్ గట్టిగా చెప్పారేమో! లేదా వాళ్ల భేటీ పొత్తుల గురించి కాదేమో! వైసిపి మీ నాయకులపై మాధవ్ తరహా వీడియోలు తయారుచేయిస్తోంది చూస్కోండి అని హెచ్చరించడానికేమో1
ఇక రెండో పాయింటు బాబుకి ఎన్‌ఎస్‌జి సెక్యూరిటీ పెంచారు. దీనికీ పొత్తుకీ సంబంధం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. బాబుకి కుప్పంలో జరిగిన ‘సత్కారం’ చూశాక ఎవరైనా చేయవలసిన పనే అది. కుప్పంలో వేడి పెంచేసి, 2024 ఎన్నికలలో అక్కడ తన గెలుపుకై బాబుకి అనుమానం కలిగిస్తే బాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు తగ్గించుకుని కుప్పంకే ఎక్కువ రోజులు కేటాయిస్తారనే భావనతో కాబోలు అక్కడ వైసిపి విపరీతంగా దాష్టీకం చేస్తోంది. అందుకే సెక్యూరిటీ పెంచారు. అది బాబుకున్న థ్రెట్‌కు సంకేతం, పాప్యులారిటీకి కాదు. బిజెపితో ఉన్న సాన్నిహిత్యానికి అసలే కాదు. మూడో పాయింటు జూనియర్ని కలవడం. అది టిడిపికి శుభసంకేతమా? ఎలా? అతను టిడిపి సభ్యుడా? టిడిపికి ప్రచారకర్తా? టిడిపి తరఫున తన సవతి సోదరి నిలబడితే ప్రచారానికి కూడా వెళ్లలేదు. కానీ అమిత్ జూనియర్‌ను కలిస్తే యీ మీడియా లోకేశ్‌ను కలిసినంత హడావుడి చేస్తోంది.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ‘‘కొత్త పలుకు’’లో జూనియర్‌ను కలవడం టిడిపితో పొత్తు సంకేతంగా రాయలేదు. ‘జగన్, బాబులపై మోదీ, అమిత్‌లకు సదభిప్రాయం లేకపోవడం చేత సొంతంగా ఎదగడానికి సినిమా గ్లామరు అద్దడానికి, చిరంజీవిని కదలేసి చూశారు. ఆయన అనాసక్తి చూసి బహుశా పురంధేశ్వరి ద్వారా జూనియర్‌ను కలిశారు. జగన్ ఆటలు సాగడానికి బిజెపియే కారణమని భావిస్తున్న ఆంధ్రప్రజలకు బిజెపిపై సదభిప్రాయం లేదు. జూనియర్ బిజెపిలో చేరినా ప్రభావం కలిగించ లేకపోవచ్చు. ఆయన చేరికపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. జూనియర్‌కు రాజకీయాల్లో ఆసక్తి ఉందని చెప్తారు. ‘బిజెపిలో చేరే బదులు టిడిపిలో చేరి నాయకత్వం కోసం ప్రయత్నించమ’ని వైసిపిలో జూనియర్ సన్నిహితులు సలహా యిస్తున్నారు.’ – ఇదీ ఆయన రాసినదాని సారాంశం.
ఎంతో కెరియర్ ముందుండగా జూనియర్ రాజకీయాల్లోకి యిప్పుడే వచ్చేస్తారని అనుకోవడం సబబు కాదని నా అభిప్రాయం. నా గత వ్యాసంలో రాసినట్లు బిజెపి ఆయన్ను పార్టీలో చేరకుండానే ప్రచారసారథిగా ఉండమని కోరి ఉండవచ్చని నా ఊహ. దానికి జూనియర్ ఏమంటారో తెలియదు. ఇక పొత్తుకు సంకేతం అంటూ టిడిపి మీడియా చెప్పిన నాలుగో పాయింటు ఏమిటంటే, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి టిడిపి ఓటు వేయడం! వాళ్లకు ఓటేయని పార్టీలన్నిటికీ కేంద్ర కాబినెట్‌లో సీటు యివ్వాలంటే జంబో కాబినెట్ ఏర్పర్చాల్సిందే! ఐదో పాయింటు రామోజీ రావుగార్ని కలవడం గురించి. కానీ దానిపై ఎబిఎన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. పెడితే రామోజీయే రాజగురువు అని ఒప్పేసుకున్నట్లు అవుతుందనేమో!
అమిత్ రామోజీని కలవడంలో ఆంతర్యం ఏమిటన్నదానిపై చాలా ఊహాగానాలే సాగాయి. గుజరాత్‌లో ఈటీవీ ఉంది కాబట్టి గుజరాత్ ఎన్నికలలో హెల్ప్ చేయండి అని అడగడానికి అమిత్ వెళ్లి ఉంటారు అని ఒక బిజెపి లీడరు చెప్పినది నమ్మాల్సిన పని లేదు. అవన్నీ ఎలాగూ అంబానీ అజమాయిషీలో ఉన్నవే. బిజెపి వైపు ఉండి తీరతాయి. టిడిపితో పొత్తు కుదిర్చిపెట్టండి అని రామోజీని అడగవలసిన పని బిజెపికి లేదు. చిటికేస్తే చాలు, టిడిపి వచ్చి వాలుతుంది. పొత్తు కుదిరాక సీట్ల పంపిణీ దగ్గర పేచీ వస్తే పెద్దమనిషిగా రామోజీగారి వద్దకు ఉభయులూ వచ్చి కూర్చున్నారంటే కాబోలు అనుకోవచ్చు. మరి ఎందుకు కలిసి ఉంటారు? నా ఊహ ప్రకారం అమిత్ మీరు అటుంటారా? ఇటుంటారా? అని అడగడానికి వెళ్లి ఉండవచ్చు.
రామోజీ అటు బిజెపికి, యిటు టిడిపికి యిద్దరికీ సన్నిహితులని, హితైషి అని అందరికీ తెలుసు. ‘ఆంధ్రలో ఎదగాలని అనుకుంటున్నాం. ముందుగా టిడిపిని కొల్లగొట్టి, ఆ తర్వాత వైసిపిపై యుద్ధానికి వెళదామను కుంటున్నాం. మీరు సాయం చేయాలి, టిడిపికి అనుకూలమైన వార్తలు ఆపేయాలి. వారిలో నైతిక స్థయిర్యం దిగజారేందుకు దోహదం చేయాలి.’ అని అమిత్ కోరడానికి వెళ్లి ఉండవచ్చు. ఈ ఊహ కరక్టో కాదో, ‘‘ఈనాడు’’లో రాబోయే కథనాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా రంగు మార్చేస్తే రీడర్‌షిప్ దెబ్బ తింటుంది. అందువలన మార్పు క్రమేపీ రావచ్చు.
ఇక టిడిపి మీడియా చెప్పిన ఆరో పాయింటు, ‘బిజెపి ప్రస్తుత లక్ష్యం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణలో అనేక నియోజకవర్గాలలో ఆంధ్రమూలాల వారి ఓట్లు తెరాస నుంచి గుంజుకోవడానికి టిడిపితో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది.’ ఆంధ్రమూలాల వారు టిడిపి సమర్థకులని ఎలా తీర్మానించారో నాకు అర్థం కాలేదు. ఆంధ్రలో ఉన్న ఆంధ్రులే టిడిపికి 23 సీట్లిచ్చి కూర్చోబెట్టారు. తెలంగాణలోని ఆంధ్రమూలాల వారు స్థానిక రాజకీయావసరాలను కాదని టిడిపికి ఎలా వేస్తారు? నీటి తగాదాలున్న ఇరుగుపొరుగు రాష్ట్రాలలోని ప్రజలు తాము నివాసమున్న రాష్ట్ర ప్రయోజనాన్ని కాదని పొరుగు రాష్ట్ర పార్టీకి ఓటేస్తారా? తమిళనాడుకి చెందిన ప్రాంతీయ పార్టీలు డిఎంకె, ఎడిఎంకె కర్ణాటకలో నిలబడ్డాయా? రాష్ట్ర విభజన చేయాలని లేఖ యిచ్చినపుడు, యింకా విడగొట్టరేం అంటూ కేంద్రాన్ని గద్దించినపుడు తెలంగాణకు తిలోదకాలు యిచ్చేసినట్లే అని బాబు తెలుసు కోవల్సింది.
టిడిపి సానుభూతిపరులు 27 నియోజకవర్గాలలో ఫలితాలను తారుమారు చేయగలరని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశారు. వారి ఓట్లు ఛానెలైజే చేసేందుకు తెలంగాణలో టిడిపి నాయకులింకా ఉన్నారా? ఆంధ్రమూలాల వారు అధికసంఖ్యలో ఉన్న కూకట్‌పల్లిలోనే ఎన్టీయార్ మనవరాలు నిలబడితే గెలవలేక పోయారు. టిడిపి నాయకులందరూ తెరాసలో చేరి పోయి, పెద్ద పదవులు అధిష్టించారు. వారందరూ ఆంధ్రమూలాల వారితో మేం మీకు అండగా ఉన్నాం కదా అంటున్నారు. కెసియార్ కూడా ఆంధ్రద్వేషాన్ని కనబరచటం లేదు. అందుకే కార్పోరేషన్ ఎన్నికలలో వారి ప్రాంతాల్లో బిజెపి గెలవలేక పోయింది. టిడిపి ఎక్కడా గెలవలేదు. ఆంధ్రమూలాల వారు యిప్పుడు టిడిపికి, లేదా దానితో పొత్తు పెట్టుకున్న బిజెపికి ఓటేసి తమ ఉనికిని ప్రత్యేకంగా చాటుకుని, ముప్పు తెచ్చుకుంటారా?
2018 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకుని కాంగ్రెసు ఎలా నష్టపోయిందో బిజెపి తెలంగాణ నాయకులు కళ్లారా చూశారు. విభజన తర్వాత కూడా ఆంధ్రపెత్తనం కొనసాగిద్దామని బాబు చూస్తున్నాడు అంటూ కెసియార్ తెలంగాణ ఫీలింగు రెచ్చగొట్టి లాభపడ్డాడు. బాబుతో పొత్తు కొంప ముంచిందంటూ కాంగ్రెసు నాయకులు గగ్గోలు పెట్టేశారు. బిజెపి అదే తప్పు చేస్తుందా? ఇప్పటికే పొత్తు ఉన్న జనసేననే ఉపయోగించుకోవటం లేదు. ఎందుకంటే దాని అధ్యక్షుడు ఆంధ్రమూలాలుండి, ఆంధ్రలో రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్! ఆంధ్రమూలాల వారిని తెరాస నుంచి చీల్చాలంటే బిజెపి ఏదో కొత్త స్ట్రాటజీ మొదలెట్టాలి తప్ప టిడిపితో పొత్తు పెట్టుకోవడం వంటి ఆత్మహత్యాసదృశమైన పని చేస్తుందని అనుకోను. నా వాదనల సంగతి ఎలా ఉన్నా టిడిపి మీడియా మాత్రం పొత్తు ఖరారు అంటూ నానా హడావుడీ చేసేసింది.
ఇవన్నీ చూసి బిజెపి నాయకుడు జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ తమతో పొత్తుల కోసం కొందరు వెంపర్లాడుతున్నారని, బిజెపితో పొత్తు లేకుంటే తమకు భవిష్యత్తు లేదని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, తాము మాత్రం జనసేనతో తప్ప అన్యులతో పొత్తు పెట్టుకోమని, యీ విషయంలో తమకు స్పష్టత ఉందని చెప్పారు. పార్టీ ఎపి ఇన్‌చార్జి సునీల్ దేవధర్ కూడా కుటుంబ వారసత్వం ఉన్న టిడిపి, వైసిపిలకు సమానదూరంలో ఉన్నామని ప్రకటించారు. దీని తర్వాత కూడా బిజెపికి అనుకూలంగా ఉండే రిపబ్లిక్ టీవీ ఆగస్టు 30న మరో కథనం ప్రసారం చేసింది. ఆంధ్రలో గట్టి ఓటు బ్యాంకు ఉన్న టిడిపికి తెలంగాణలో కూడా 10-20% ఓట్లున్నాయి కాబట్టి బిజెపి ఆంధ్ర, తెలంగాణల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని దాని సారాంశం. దానికి సంకేతాలుగా మోదీ, బాబు ఐదు నిమిషాల ముచ్చట, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు టిడిపి మద్దతు, ఆగస్టు 15న బాబు మోదీపై ప్రశంసల జల్లు కురిపించడం చూపింది.
దాని ఆధారం చేసుకుని ఆంధ్రజ్యోతి ‘‘ఎన్‌డిఏ లోకి టిడిపి’’ అంటూ ఫ్రంట్ పేజీ కథనాన్ని యిచ్చింది. ఇక సునీల్ దేవధర్‌కు చిర్రెత్తినట్లుంది. వెంటనే ఆగస్టు 30నే మీడియాతో మాట్లాడుతూ టిడిపియే కావాలని యిలాటి పుకార్లు పుట్టిస్తోందని మండిపడ్డాడు. ‘‘ఈ అసత్యవార్తకు ఆధారాల్లేవి. పొత్తుల విషయం తేల్చేది పార్లమెంటరీ బోర్డు. దాని సమావేశమే జరగలేదు. ఇక యిలాటిదానికి అవకాశమే లేదు. టిడిపి మైండ్ గేమ్స్ ఆడుతోంది. ఆజాదీ అమృతోత్సవంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మోదీ బాబుని, ఫరూఖ్ అబ్దుల్లాను కూడా కలిశారు. జగన్మోహన్ రెడ్డి కూడా దిల్లీకి వచ్చిన ప్రతీసారీ మోదీకి వెంకటేశ్వరస్వామి బొమ్మ యిస్తూ ఉంటారు. వచ్చిన ప్రతీసారీ బొమ్మ సైజు పెరుగుతూంటుంది. అంత మాత్రం చేత వైసిపితో మేం పొత్తు పెట్టుకున్నట్లా? కృష్ణుడు దుర్యోధనుణ్ని కలవడానికి కూడా టైము కేటాయించాడు. అంత మాత్రాన అతనితో చేతులు కలిపాడా? (అతని ప్రత్యర్థికి అక్రమమార్గాన్ని ఉపదేశించి, గదాయుద్ధంలో తుదముట్టించాడు కూడా.. అని అనుకున్నాడేమో కానీ పైకి అనలేదు) అని పురాణాలు ఉటంకిస్తూ అలాటి కాజువల్ సమావేశాలను రాజకీయ కోణంలో చూడకూడదు’’ అంటూ ముక్తాయించాడు. వైసిపి, టిడిపి రెండూ ఆశ్రితపక్షపాతానికి, అవినీతికి ఆలవాలాలని బిజెపి అభిప్రాయం అని చేర్చాడు.
వైసిపిని కలిపి చెప్పినా, బిజెపితో పొత్తు కుదిరిపోయిందని చాటుకుంటున్నది టిడిపి కాబట్టి, టిడిపి మైండ్‌గేమ్ ఆడుతోందని సునీల్ బాహాటంగా చెప్పడంతో దానికి దెబ్బ గట్టిగా తగిలింది. దానికి తోడు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. లక్ష్మణ్ టిడిపితో పొత్తు ఉందన్న మాటలు వార్తలకే పరిమితం తప్ప పొత్తుపై ఎలాటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. టిడిపియే కాదు, ఆంధ్రలో పొత్తు ఉన్న జనసేనతో సైతం తెలంగాణలో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. ఇవన్నీ చూసి బాబు తన పాచిక పారలేదని గ్రహించారు. అందుకని సెప్టెంబరు 1న ‘ఈ పొత్తు ఉంటుందో లేదో, దాని గురించి మాట్లాడేవారే దానికి సమాధానం చెప్పాలి’ అని చెప్పారు. ఆ ప్రచారానికీ, తనకూ సంబంధం లేదని నిరూపించు కోవడానికి ఆయన తాపత్రయ పడినా, యిప్పటిదాకా మాట్లాడిన వారందరూ ఆయన పార్టీతో సంబంధం ఉన్నవారే కాబట్టి ప్రస్తుతానికి ఆయన యీ మైండ్‌గేమ్‌కు విరామమిచ్చారని అనుకోవాలి.
ఇప్పుడు సమాధానం చెప్పవలసిన భారం దీని గురించి యిక్కడ మొదటగా మాట్లాడిన రఘురామ గారిపై పడింది. ఉద్దండులను బాహుబలి అనే పేరుతో పిలిచినట్లు యీయన పేరులో పొడి అక్షరాలు కలుస్తాయి కదాని ఎబిఎన్ వెంకట కృష్ణ ఆయన్ని ఆరారార్ అని పిలిచేవారు. ఆ సినిమాకు డబ్బు వచ్చినా పేరు రాకపోవడంతో ఆ పిలుపు వెనకబడింది. ఆ పేరులోని రుధిరం ప్రజాస్వామ్యపు రోజుల్లో పనికి రాదు. రణం అయితే మాత్రం ఆయనకు అన్వయిస్తుంది, సొంత పార్టీతోనే పోట్లాడుతున్నాడు కాబట్టి. ఇక రౌద్రం అనేది అస్సలు నప్పదు. దేన్నయినా చమత్కారంగా, నవ్వుతూ చెప్పడం ఆయన స్టయిల్ కాబట్టి. ఇప్పుడీ కృష్ణ-దుర్యోధన సామ్యంపై ఆయన విసరబోయే చెణుకు కోసం ఎదురు చూస్తున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)