మోహన్ బాబు ప్రెస్ మీట్ పెడతారా? పెట్టరా? నిన్నటివరకు ఈ చర్చ పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని జరిగింది. “మా” ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటేసిన పవన్ కల్యాణ్, గతంలో తను చేసిన వ్యాఖ్యలపై మోహన్ బాబుకు వివరణ ఇచ్చినట్టుగా కనిపించింది. ఇద్దరూ ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్నారు కూడా. సో.. పవన్ వ్యవహారంపై ఇక మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చని అంతా అనుకున్నారు.
కట్ చేస్తే, ఇప్పుడు మోహన్ బాబు తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం ప్రకాష్ రాజ్ ప్యానెల్ చేసిన ఆరోపణలు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన అభ్యర్థులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో పాటు.. మోహన్ బాబుపై ఆరోపణలు కూడా చేశారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకొని మెలొడ్రామా కూడా పండించారు.
సో.. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై కాకపోయినా.. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకైనా మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. ఆ ముహూర్తం ఈరోజే అంటున్నారు చాలామంది.
ఇప్పుడు మోహన్ బాబు వంతు..
ఇప్పటికే చాలామంది మీడియా ముందుకొచ్చారు. తమ వాదనలు వినిపించారు, ఆరోపణలు చేశారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, శివాజీరాజా, నరేష్, ప్రభాకర్.. ఇలా చాలామంది ఎన్నికల వేళ వివిధ సందర్భాల్లో మీడియా ముందుకొచ్చారు. చివరికి చిరంజీవి కూడా ఓటేసినప్పుడు ఓసారి, ఆ తర్వాత జరిగిన సినిమా ఫంక్షన్ లో మరోసారి ఎన్నికలపై స్పందించారు. అదే టైమ్ లో మురళీమోహన్ లాంటి పెద్ద మనుషులు కూడా స్పందించారు.
ఇంతమంది స్పందించినప్పటికీ మోహన్ బాబు మాత్రం సంయమనంతోనే ఉన్నారు. 2-3 సందర్భాల్లో మీడియా ముందుకొచ్చినప్పటికీ, మైక్ అందుకునే అవకాశం దక్కినప్పటికీ మోహన్ బాబు పెదవి విప్పలేదు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
ప్రతిదానికి ఓ సందర్భం ఉంటుందని మాత్రమే చెప్పారు. ఆ సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా మాట్లాడతానన్నారు. ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. చిరంజీవి లాంటి వాళ్లు పరోక్షంగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రత్యక్షంగా తమ వేళ్లను మోహన్ బాబు వైపే చూపిస్తున్నారు. కాబట్టి ఈసారి మోహన్ బాబు స్పందించాల్సిందే.
ఇప్పుడు మోహన్ బాబు దృష్టిలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు చిన్నవి అయిపోయాయి. ఆయన అంతకంటే పెద్ద ఆరోపణలకు ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. తన కొడుకు మంచు విష్ణుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మోహన్ బాబుపై ఉంది.