చిన్న, మిడ్ రేంజ్ హీరోలకు కొన్ని ఫాంటసీలు వుంటాయి. అవకాశం వచ్చినపుడు వాటిని తీర్చుకుందామని చూస్తుంటారు. ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది. ఒక్కోసారి కాదు. మాస్ సినిమాలు చేయాలని, డిష్యుం..డిష్యుం..యాక్షన్ సినిమాలు చేయాలని వుంటుంది. మాంచి డ్యూయట్లు, పాటలు చేయాలని వుంటుంది.
ఈవారం విడుదలైన స్పై సినిమా మిడ్ రేంజ్ హీరో నిఖిల్ కు కూడా ఓ ఫాంటసీ లాంటిదే. జేమ్స్ బాండ్ టైప్ సినిమా. పాన్ ఇండియా సినిమాగా చేయడానికి అన్ని విధాలా సూటయ్యే సబ్జెక్ట్. సినిమా హిట్ అయితే కార్తికేయ సిరీస్ మాదిరిగా చేసుకోవచ్చు. సో..అందుకే ఆ సినిమా చేసాడు.
కానీ ఈ సినిమాలో ఒక వెలితి వుండిపోయింది. మాంచి పాట వుండాలిగా. అదే లేదు. అందుకే విడుదలకు ముందే నిఖిల్ ఓ స్పెషల్ సాంగ్ చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు ముఫై లక్షలు ఖర్చు చేసి, బికినీలు వేసిన అమ్మాయిలతో హీరో కలిసి డ్యాన్స్ చేసిన స్పైసీ సాంగ్. కానీ తీరా చేసి, సినిమాలో ఆ పాట ఎక్కడ పెట్టినా సెట్ కాక పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
కనీసం రోలింగ్ టైటిల్స్ మీద వేద్దాం అన్నా కుదరలేదని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్ గా సోషల్ మీడియాలోకి వదిలే ఆలోచనలో వున్నాడట హీరో. బాగుంటే యూ ట్యూబ్ లో కాస్త హడావుడి వుంటుంది. 30 లక్షలు ఖర్చు చేసినందుకు కాస్తయినా రికవరీ వస్తుందేమో?
స్పై సినిమా గురువారం విడుదలై, మాంచి ఓపెనింగ్ తీసుకుంది. టాక్ తో సంబంధం లేకుండా డే నాలుగు షో లు మంచి కలెక్షన్లు కనిపించాయి.