తెలుగు రాజకీయం.. గందరగోళం!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. ఇప్పుడు ఉన్నంత గందరగోళంగా గతంలో ఎప్పుడూ లేదేమో అనిపిస్తోంది.. జరుగుతున్న గజిబిజి చూస్తుంటే. Advertisement తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్… ఒక రాజకీయ బాహుబలిగా కనిపించే వారు. బీజేపీని,…

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. ఇప్పుడు ఉన్నంత గందరగోళంగా గతంలో ఎప్పుడూ లేదేమో అనిపిస్తోంది.. జరుగుతున్న గజిబిజి చూస్తుంటే.

తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్… ఒక రాజకీయ బాహుబలిగా కనిపించే వారు. బీజేపీని, కాంగ్రెస్‌ను అసలు కేర్ చేసేవారు కాదు అన్నట్టుగా ఆయన ఉండేవారు. అయితే ప్రగతి భవన్.. కాకపోతే ఫార్మ్ హౌస్.  కేటీ రామారావు, టీ. హరీష్ రావే పాలన, రాజకీయం నడిపించేవారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ లకు  మాత్రం పరిమితం అనే భావన కూడా పరిశీలకులలో ఉండేది.

బీజేపీకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అధ్యక్షుడిగా వచ్చిన తరువాత, ఆ పార్టీ లో కొంత జోష్ వచ్చింది కానీ, కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టడంతో.. బీజేపీకి, బీఆర్ఎస్ కు కూడా కొంత సెగ తగిలింది. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రతిపక్ష పార్టీలు సవాలు విసురుతున్నాయనే వాతావరణం ఏర్పడింది. దీంతో, ముక్కోణపు రాజకీయం మొగ్గ తొడిగింది. ' మరి, నా సంగతేంటి?' అంటూ వైఎస్ రాజశేఖర‌రెడ్డి కుమార్తె షర్మిళ రంగంలోకి దిగేశారు. వీటికి తోడు, ' మేమూ ఉన్నాం కదా ' అంటూ కమ్యూనిస్టులు, కోదండరామ్, గద్దర్ వగైరాలు కూడా అంటున్నారు. ప్రతి ఓటూ కౌంట్ అయ్యే పరిస్థితుల్లో… రాజకీయ వ్యాపారులు జూపల్లి కృష్ణారావు, 'పొంగు'లేటి  శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక‌కు సిద్ధ‌మ‌య్యారు. నిజానికి వారు బీజేపీలో చేరతారనే ప్రచారం బాగా సాగినా, చివరకు కాంగ్రెస్సే అని  తేల్చేశారు.

'కర్ణాటక కాంగ్రెస్ తాలింపు ' గుబాళింపు హైదరాబాద్ ముక్కు పుటాలను తాకడంతో , ప్రచార సాధనాల్లో కాంగ్రెస్ ఊపు పెరిగింది. అయితే , కాంగ్రెస్ కంటే బీజేపీ వెనుక పడడాన్ని బీజేపీ ఢిల్లీ పెద్దలు సహించలేరు. అంతకు మించిన రాజకీయ తలవంపు ప్రధాని మోదీకి ఉండదు. అందులోనూ…. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలను ఎదురుగా పెట్టుకుని, తెలంగాణలో కాంగ్రెస్ కంటే వెనుకబడి ఉండడాన్ని బీజేపీ కేంద్ర నేతలు జీర్ణం చేసుకోలేరు.

ఈ పరిస్థితుల్లో…. రెండో స్థానానికి – కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్రాతి తీవ్ర పోటీ అనివార్యంగా కనపడుతున్నది. ఈ రెండింటిలో ఒకటి – మొదటి స్థానానికి వస్తే మాత్రం…. అదో చరిత్రత్మాక రాజకీయ విశేషమే అవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అంతఃపురం వీడి బయటకు వస్తున్నారు. ఆయన కుమారుడు కేటీ రామారావు, మేనల్లుడు హరీష్‌రావ్‌ క్రియాశీలకం అయ్యారు. కాలికి బలపం కట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారు. వాళ్లిద్ద‌రికీ ప్రజల్లో మంచి గుడ్ విల్ ఉంద‌న‌డంలో సందేహమే లేదు. అయితే, వారి తొలి రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనేదే ఇంకా తేలడం లేదు.

బీఆర్ఎస్‌ను కేటీ రామారావు, హరీష్‌రావ్ ముందుండి నడిపిస్తుంటే, బీజేపీ సారథ్య‌ బాధ్యతలను స్వయంగా నరేంద్ర మోదీయే  ముందు ముందు స్వీకరించలేకబోతున్నారు. బీజేపీ గెలిస్తే, ఆయన గెలిపించినట్టు, ఓడిపోతే బండి సంజయ్ వల్ల ఓడిపోయినట్టు అనే ఫార్ములా ఉండనే ఉంది కదా!  ఓవర్ యాక్షన్ చేసి కర్ణాటకను పోగొట్టుకున్న బీజేపీ, తెలంగాణలో నవ్వులపాలు కావడానికి సిద్ధంగా లేదు. అందుకే, మోడీ, అమిత్ షా దిగుతున్నారు.

ఇక, కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి సారధ్యం వహిస్తున్నట్టు పైకి కనపడుతున్నప్పటికీ, చాలా మంది రంగంలోకి దిగబోతున్నారు.  రాహుల్, ప్రియాంక, ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధులు సమ‌ష్టిగా సారధ్యం వహించ బోతున్నారు. అందుకే ఎన్నికల ముఖంచిత్రంలో స్పష్టత రావడానికి మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చు.

ఇక, ఆంధ్రలో అయితే…. రాజకీయ పరిస్థితి మరింత గందరగోళంగా… గజిబిజి గా కనపడుతున్నది. ఉన్నది ముగ్గురే ప్రధాన ఆటగాళ్లు. కానీ, ఒక్క పరుగూ తీయలేని నాలుగో ఎక్స్ ట్రా ప్లేయర్ కోసం ఈ ముగ్గురూ తాపత్రయం పడడంతో, రాజకీయాల్లో స్పష్టత లేకుండా పోయింది.

2019 లో 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ, తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి, నగదు బదిలీ పథకాలను నమ్ముకుంది. వైసీపీ గెలిస్తే దేశంలోని 29 రాష్ట్రాలు కూడా మిగిలిన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన అనే పనికి మాలిన ఆలోచనలు పక్కన పడేసి, నగదు బదిలీ పథకాలకే మొగ్గు చూపవచ్చు. తమను ఎన్నికల వైతరిణి దాటించడానికి, 'నగదు బదిలీ' మార్గమే శరణ్యమని మిగిలిన రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు భావించవచ్చు. నగదును బదిలీ చేయడానికి వీలైన సాకుల కోసం వెదుకులాట… అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభం కావచ్చు. అందుకే, దేశంలోని రాజకీయ పార్టీలు…. వైసీపీ ప్రయోగ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

వైసీపీని ఓడించి, అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్న టీడీపీ కూడా ఇప్పటికే ఒక భారీ నగదు బదిలీ పథకాన్ని ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు.

ఇక, వైసీపీని ఓడించడానికి కంకణం కట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – గోదావరి జిల్లాల్లో విస్తృతంగానే తిరిగారు. అయితే, వైసీపీని ఓడించడం తనకు ఎలా సాధ్యమనే విషయం మాత్రం స్పష్టం చేయడం లేదని ఆయన అభిమానులు జుట్లు పీక్కుంటున్నారు. ఫలితంగా ఏపీ రాజకీయాల్లో స్పష్టత కొరవడింది.

దీనికి తోడు, బీజేపీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏ వైఖరి తీసుకుంటారు అనే విషయం లో కూడా స్పష్టత రావలసి  ఉంది. ఈ లోగా ఎవరి (దుష్)ప్రచారం వారు చేసుకుంటున్నారు. దానివల్ల కూడా స్పష్టత రావడం లేదు. తెలంగాణతో పాటే, ఆంధ్రకు కూడా ఈ డిసెంబర్లో ఎన్నికలు రావడం తప్పకపోవచ్చని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది నమ్ముతున్నారు.

ఏ టెన్షనూ లేనిది బీజేపీకే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఒకటే. అసలు రాకపోయినా బీజేపీకి ఒకటే అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి ఉంది. అలా అని చెప్పి, దానిని పక్కన బెట్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ, జనసేన లేవు.

ఈ పరిస్థితుల్లో ఏపీలో ఏ పార్టీ గట్టెక్కుతుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం క్లిష్టం గా తయారైంది. టీడీపీతో జనసేన కలవకుండా చూడడానికి వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తీరును చూసిన వారికి, ” ఆ రెండు కలిస్తే వైసీపీ పని ఔటా?  అంత శ్రమ పడుతున్నది, వాళ్ళను విడగొట్టడానికి ” అనిపిస్తున్నది. టీడీపీపై కంటే, జనసేనపై ఎక్కువ ఫోకస్ పెట్టి, వైసీపీ నేతలు ”  వ్యూహాత్మక “తప్పిదానికి పాల్పడుతున్నారని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జనసేన గనుక టీడీపీతో పొత్తు ప్రకటించి ఉంటే వైసీపీ దాడి మరింత అర్ధవంతంగా ఉండేది. కానీ, పొత్తు దిశగా జనసేనను వైసీపీ నేతలు వెంటబడి తరుముతున్నారు. ఈ పొత్తు విషయం లో….'అవును ' అని గానీ, ' కాదు ' అని గానీ ఆ రెండు పార్టీల అధినేతల నుంచి అధికారిక ప్రకటన వెలువడితే గానీ, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో స్పష్టత రాదు.

ఈ లోపు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్…. ఏదో ఒక నగదు బదిలీకని ఏదో ఒక ఊరు వెళ్లి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. అలా మాట్లాడడం ద్వారా తన గ్రాఫ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారేమో తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారాహి వాహనంపై నుంచి వైసీపీ నేతలను తూర్పార బడుతున్నారు. ఏమి మాట్లాడితే, తన అభిమానులు వెర్రెత్తి, ఈలలు, చప్పట్లతో హోరెత్తి పోతారో…. అవి మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ప్రసంగాలలో పరిపక్వత కనబడుతున్నదని…. ఆ ప్రసంగాలను ఫాలో అవుతున్న వారు అంటున్నారు.

టీడీపీతో పొత్తు ఉన్నదనో…. లేదు అనో ఆయన అధికారికంగా చెప్పినప్పుడే, ఆయనకు ఎంత ” పరిపక్వత ” వచ్చింది అనేది అర్ధం కాదు. దానిని బట్టి కూడా ఆయన ఓట్ బ్యాంకు పెరగడమో…. తరగడమో ఆధార పడి ఉంటుంది.

ఈ రకంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు గజిబిజి గా, గందరగోళంగా తయారయ్యాయి. ఏ రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. 

తెలంగాణ లో ప్రతి పార్టీకి లక్ష్యం –  ముఖ్యమంత్రి అధికారిక నివాసం – ప్రగతి భవన్.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పార్టీకి లక్ష్యం – (ఎంతయినా దుర్వినియోగం చేయడానికి వీలైన) ప్రభుత్వాధికారం.

భోగాది వెంకట్రాయుడు