తప్పు చేసిన విద్యార్థిని శిక్షించడం ఓ ప్రిన్సిపాల్ తప్పైంది. తను పరీక్షలు రాస్తూ కాపీయింగ్ పాల్పడటంతో డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి ప్రిన్సిపాల్‌పై బ్లేడుతో దాడి చేసి అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని చిన్న మసీదు ప్రాంతంలో జరిగింది.
గొంట్ల గణేష్ అనే విద్యార్థి స్థానికంగా ఉండే సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గతేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్భంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచీ అతడు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కొండారెడ్డిపై కక్షతో రగిలిపోతున్నాడు. దీంతో నిన్న రాత్రి అదును చూసి ప్రిన్సిపాల్‌పై బ్లేడ్‌తో దాడి చేసి గొంతు కోయబోతుంటే ఆయన చేయి అడ్డుపెట్టుకోని పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
దాడి క్రమంలో ప్రిన్సిపాల్ చేతికి తీవ్ర గాయమవ్వడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని అదుపులో తీసుకున్నారు. చేసిందే తప్పు అయితే.. ఆ ప్రిన్సిపాల్‌పై దాడి చేసి ఇప్పుడు జైలు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు.