ఓజీ అంటే చాలామందికి తెలుసు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని అర్థం. కాబట్టి పవన్ కల్యాణ్ తో చేస్తున్న సినిమాకు ఆ టైటిల్ పెట్టి ఉంటారని అంతా అనుకుంటున్నారు. అయితే ఓజీ అనే టైటిల్ ఆ ఉద్దేశంతో పెట్టలేదంట.
“ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని అర్థం. సినిమాలో ఓజాస్ అంటే మాస్టర్ పేరు, గంభీర్ అంటే హీరో పేరు. రెండూ కలిపితే ఓజీ అని వస్తుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. పవన్ ఎప్పుడూ తన సినిమాల్లో కథతో సంబంధం లేకపోయినా జపాన్ ఫ్లేవర్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఆయనతో జపాన్ స్టయిల్ లో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఫిక్స్ అయ్యాను. అదే ఓజీ.”
ఇలా ఓజీ టైటిల్ వెనక మీనింగ్ బయటపెట్టాడు దర్శకుడు సుజీత్. ఈ సందర్భంగా పవన్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చిందో కూడా బయటపెట్టాడు.
“నిజానికి రీమేక్ కోసం నన్ను పిలిచారు. నాకు ఇష్టం లేదు. ఒరిజినల్ మూవీ చేస్తే వచ్చే కిక్ రీమేక్ తో రాదు కదా. అందుకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూశాను. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ప్రకృతి కూడా నాకు సహకరించింది. ఏదైనా కొత్త కథ ఉందా అని ఒక రోజు కల్యాణ్ అడిగారు. ఒక లైన్ చెప్పాను, వెంటనే ఓకే అయిపోయింది. అదే ఓజీ.”
తనకు జపాన్ చిత్రాలంటే చాలా ఇష్టమంటున్నాడు సుజీత్. అదే టైమ్ లో పవన్ కు కూడా అవంటే చాలా ఇష్టమని, అందుకే తన కొడుక్కి అకిరా అని పేరు కూడా పెట్టారని గుర్తుచేసిన సుజీత్.. ఓజీ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ట్రయిలర్ కూడా రెడీ అయిపోయిందని ప్రకటించాడు.