2024 ఆంధ్ర ఎన్నికల్లో కీలకమైన పాత్ర ఉద్యోగస్తులదే. దాదాపు అయిదు లక్షలకు పైగా ఉద్యోగుల ఓట్లు, వారి సన్నిహతులు, కుటుంబ సభ్యుల ఓట్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లు మొత్తం వన్ సైడ్ అయ్యాయి. ఇవీ ఇటీవల ఎక్కడ చూసినా కనిపిస్తున్న వార్తలు. నిజమే కావచ్చు. కాకపోవచ్చు. కానీ జగన్ కన్నా చంద్రబాబు ను ప్రభుత్వ ఉద్యోగులు ఫ్రెండ్లీగా ఎందుకు భావిస్తున్నారు అన్నది క్వశ్చను.
చంద్రబాబు ఏనాడూ కూడా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా లేరు. వ్యవహరించలేదు. మునివేళ్ల మీద నిల్చోపెట్టి పని చేయించారు. అదలింపులు.. బెదిరింపులు.. ఒకటి కాదు. అందుకే ఎప్పుడూ ఉద్యోగస్తులు యాంటీ చంద్రబాబు స్టాండ్ మీదే వుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ఫ్రెండ్లీ అయ్యారు. అంటే చిన్న గీత పక్కన ఇంకా చిన్న గీత గీస్తే, ముందున్నది పెద్ద గీత అవుతుందనే సూత్రం వర్కవుట్ అయిందా. జగన్ కన్నా చంద్రబాబునే బెటర్ అనుకుంటున్నారా ఉద్యోగులు. లేదా అయితే బాబు లేదా జగన్ అనే తప్ప, మరో ఛాయిస్ లేకపోవడం వల్లనా?
నిజానికి జగన్ వల్ల ఉద్యోగులకు సమస్య కాదు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ వల్ల. గతంలో టెక్నాలజీ లేదు. స్కూళ్లలో డీఫాల్ట్ గా డేట్ లేని లీవ్ లెటర్లు పెట్టేసి, వంతుల వారీగా టీచర్లు ఆడింది ఆటగా, పాడింది పాటగా పని చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఫేస్ రికగ్నైజేషన్, థంబ్ ఇంప్రెషన్, ఇలా చాలా తాళాలు వచ్చాయి. ప్రయివేటు సంస్థల్లో అయితే అడుగు అడుగునా సిసి కెమేరాలు, సూపర్ విజన్లు వుంటాయి. అక్కడ కిక్కురు మనకుండా పని చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కదా, అటెండెన్స్ పక్కా అంటే గోల. సిగ్నల్ లేదు అంటూ వెటకారాలు. ఈ రోజుల్లొ సిగ్నల్ లేని ప్రాంతాలు ఎక్కడ వున్నాయి. కొండ కోనల్లో కూడా సిగ్నల్ వుంటోంది. అదో వంక.
బతకలేక బడిపంతులు అనే వారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రభుత్వ టీచర్ కు జీతం ఎంతో తెలిస్తే మహా మహా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నోరు వెళ్ల బెడతారు. అంతటి జీతాలు అందుకుంటూ మరి టైమ్ కు అటెండెన్స్ అడుగుతున్నారు, వేరే డ్యూటీలు వేస్తున్నారు అని ప్రభుత్వం మీద కోపగించుకుంటే ఎలా?
సరే, జగన్ కు ఓటేయవద్దు. మరి చంద్రబాబు వచ్చాక ఈ బయో మెట్రిక్ సిస్టమ్ తీసేస్తారా? ఫేస్ రికగ్నైజేషన్, యాప్ లో అప్ లోడింగ్ వంటివి వదిలేస్తారా? టెక్నాలజీ అంటే జగన్ కన్నా ఎక్కువ ఇష్టం కదా చంద్రబాబుకు. పథకాలకు టెక్నాలజీని అనుసంధానం చేయడం తప్పు అయితే కాదు కదా. మరి అవన్నీ తమకు బంధాలుగా మారాయని ఉద్యోగులు అనుకుంటే ఎలా?
జగన్ వైపు తప్పులు ఏమున్నాయి ఇవి కాక. జీతాలు, పింఛన్లు రాలేదా? అయిదేళ్ల పాలన ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని నెలల జీతాలు బకాయిలు వున్నాయి, ఎన్ని నెలల పింఛన్లు బకాయిలు వున్నాయి. చెప్పగలరా? ఒక్క నెల అయినా వుంది అని చెప్పగలరా? కొన్ని సార్లు ఒకటో తేదీనే రాకపోయి వుండొచ్చు. మరి ప్రయివేటు ఉద్యోగుల సంగతి ఏమిటి? వచ్చేదాకా గ్యారంటీ లేదు కదా?
ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వున్న ప్రో చంద్రబాబు స్టాండ్ మీదే మరో అయిదేళ్ల తరువాత కూడా వుంటారనే గ్యారంటీ వుందా? గతంలో రెండు సార్లు చంద్రబాబును మరి గద్దె దించడంలో ఉద్యోగులు ఎందుకు కీలకంగా వ్యవహరించారు. అప్పుడు లేని మార్పు ఇప్పుడు చంద్రబాబులో ఏం గమనించారు?
గోబెల్స్ ప్రచారానికి లొంగిపోయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వున్నారని అనుకోవాలా? లేక జగన్ కన్నా బెటర్ గా జీత భత్యాలు అందుతాయని ఆశిస్తున్నారా? వెయిట్ అండ్ సీ.!