సుమ అంటేనే మాటల జలపాతం. సమయ స్ఫూర్తికి సుమ పెట్టింది పేరు. బుల్లితెర గారాలపట్టి సుమ. ఇలా యాంకర్ సుమ గురించి ఎన్ని విశేషాలైనా చెప్పుకోవచ్చు. తాజాగా ‘సుమక్క’ యూట్యూబ్ చానల్ ద్వారా తన వ్యక్తిగత, వృత్తిగత ఆసక్తికర విశేషాలను సుమ తన అభిమానులతో పంచుకుంటున్నారు. యాంకర్‌గా మాటల ప్రవాహాన్ని సాగించే సుమ వృత్తిలో బాగా ‘బాధ’పడిన సందర్భాన్ని కూడా పంచుకున్నారు. అలాగే యాంకర్‌గా ఎప్పుడు , ఎలా ప్రస్థానాన్ని ప్రారంభించారో కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
తాను కెరీర్ మొదలు పెట్టినప్పుడు యాంకరింగ్ అనే పదమే లేదని సుమ చెప్పారు. అప్పట్లో కేవలం అనౌన్సర్లు అనే పదం మాత్రమే ఉందన్నారు. దూరదర్శన్‌లో ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తే ‘ఇక్కడ మాట్లాడాలమ్మా’ అని మాత్రమే చెప్పేవారన్నారు. అంటే సుమ మాటలను బట్టి యాంకరింగ్ చేయాలని చెప్పడం అని అర్థం చేసుకోవాలి. ఫలానా వ్యక్తి తనకు యాంకరింగ్‌లో స్ఫూర్తి అని చెప్పుకోకుండానే ఆ వృత్తిలో స్థిరపడినట్టు సుమ పేర్కొన్నారు.
జెమినీలో తాను యాంకరింగ్ చేసిన మొదటి కార్యక్రమం ‘వన్స్ మోర్ ప్లీజ్’ అని సుమ చెప్పారు. సరైన యాంకరింగ్ షో అంటే ఇదేనని ఆమె పేర్కొన్నారు. అలాగే తన కెరీర్‌లో అతిపెద్ద లేడీస్ గేమ్ షో ‘మహిళలూ… మహారాణులు’ అని సుమ తెలిపారు. ఆ తర్వాత ఇదే కార్యక్రమం స్టార్ మహిళగా రూపాంతరం చెంది… దాదాపు 12 ఏళ్లపాటు సాగిన ఒకేఒక్క మహిళా కార్యక్రమంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్టు సుమ గర్వంగా చెప్పారు.
తెలుగులో తాను ఇంత చక్కగా మాట్లాడటానికి కారణం తాను పనిచేసిన దర్శకులు, టెక్నీషియన్లు, రచయితలు, కెమెరామెన్లే అని సుమ వినయంగా చెప్పారు. వీరిలో దర్శకుడు మీర్ పాత్ర చాలా ఎక్కువన్నారు. మొదట్లో తనకు ‘బాధ’ అనే పదాన్ని కూడా సరిగా చెప్పడం వచ్చేది కాదన్నారు. పదేపదే ‘బాద…బాద’ అని పలికేదాన్నని, అలా పలకడం తప్పని చెబుతూ…‘బాధ’ అని పలకాలని చెప్పి నాటి పెద్దలు నేర్పించారని సుమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు.