ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలూ స్టార్లే! ఎవరికి వారు ఏదో ఒక స్టార్ బిరుదును తమ పేరు ముందు తగిలించుకుంటూ ఉంటారు. అయితే సూపర్ స్టార్ అనే బిరుదు మాత్రం ప్రత్యేకం! సౌత్ లో ఆ బిరుదుకు సూటైన వ్యక్తులు ఇప్పటి వరకూ ఇద్దరే అభిప్రాయాలున్నాయి. ఆ బిరుదు కల్ట్ హిట్ అయ్యింది ఇద్దరి విషయంలోనే. వారి పేరు ముందు సామాన్య ప్రేక్షకులు కూడా సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను యాడ్ చేసి మాట్లాడుకుంటారు. వారే సూపర్ స్టార్ కృష్ణ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్! నిజానికి సూపర్ స్టార్ అనే బిరుదాంకితులు వీరే. రజనీకాంత్ సినిమాల టైటిల్స్ లో ధైర్యంగా సూపర్ స్టార్ అని వేస్తారు. కృష్ణ దశాబ్దాల కిందటే సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నారు. వారిద్దరూ సూపర్ స్టార్లు! అది సౌతిండియన్ ప్రేక్షకులు స్పష్టం చేసిన విషయం.
వారి తర్వాత ఆ రేర్ ట్యాగ్ ను పెట్టుకోగల స్టార్ హీరో, సూపర్ స్టార్ హీరో నిస్సందేహంగా మహేశ్ బాబు. వారసత్వాలతో హీరోలు అయిన చాలా మంది తమ తండ్రుల బిరుదును కాస్త ఇటూ ఇటూ చేసి వారి పేరు ముందు చేర్చుకుంటూ ఉంటారు. అయితే స్టార్ స్టేటస్ అనేది వారసత్వంగా రావడం కన్నా ప్రేక్షకుల నుంచి వస్తేనే.. అందంగా ఉంటుంది. కృష్ణ, రజనీకాంత్ లు ప్రేక్షకుల ద్వారానే సూపర్ స్టార్లు అయ్యారు. మహేశ్ వారసుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను, విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే సూపర్ స్టార్ అనేది ఒక స్టేటస్ కాదు, అదొక బాధ్యత కూడా! ఆ బాధ్యత ఎలా ఉంటుందో.. కృష్ణ, రజనీకాంత్ లాంటి వాళ్ల కెరీర్ లను పరిశీలించినా అర్థం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో నయా సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ తీరుతెన్నులను ఒకసారి సమీక్షిస్తే!
మహేష్ చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే వుంటూ వచ్చాడు. రాజకుమారుడు సినిమా ప్రారంభంతోనే మహేష్ ఓ ప్రిన్స్ లా ప్రొజెక్ట్ అయ్యాడు. అందుకు తగ్గట్టుగా మహేశ్ తొలి సినిమాలు రాజకుమారుడు, యువరాజు వంటి టైటిల్స్ తో వచ్చాయి! అప్పటి కే వారసుల రంగ ప్రవేశం జరిగినా మహేష్ ఎంట్రీ వేరుగా,స్పెషల్ గా మారింది. సినిమాలో కూడా మహేష్ అందగాడిగా ముద్రపడ్డాడు. అక్కడి నుంచి మహేష్ గ్లామర్ అన్నదే అతని విషయంలో కీ రోల్ గా మారింది. మహేష్ టాలీవుడ్ అందగాడు అన్నది బాగా జనంలో ముద్ర పడిపోయింది. ఫార్టీ ప్లస్ కు మారినా అదే లుక్, అదే ఫిజిక్ తో వుండడంలో మహేష్ సక్సెస్ అయ్యాడు. కానీ ఈ అందం, ఆ స్వీట్ స్మయిల్, ఆ క్లాస్ టచ్ నే మహేష్ నటుడిగా బహుముఖంగా విస్తరించడానికి అడ్డం పడుతోందేమో?
కెరీర్ ఆరంభంలోనే ప్రయోగాలకు సై!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. మహేశ్ కెరీర్ పై కూడా ఆ ప్రయోగాల ప్రభావం కొనసాగింది. హిట్ లు ఫ్లాపుల సంగతి పక్కన పెడితే, మహేష్ కెరీర్ ప్రారంభం లో సినిమాల ప్లానింగ్ బాగుండేది. మురారి, అతడు, టక్కరిదొంగ, ఒక్కడు, అర్జున్, ఖలేజా ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేని జోనర్లు. వీటిల్లో ఫన్ సినిమాలు వున్నాయి, ఎమోషనల్ సినిమాలు వున్నాయి, మాస్ సినిమాలు వున్నాయి, ఫ్యామిలీ టచ్ వున్నాయి. అయితే అభిమానుల సంగతి ఎలా వున్నా, హిట్ లు అన్నవి హీరోకి అవసరం కాబట్టి, మహేష్ ఆ దిశగా కాస్త దృష్టి పెట్టి గట్టి ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
గడచిన ఇరవై ఏళ్లలో దాదాపుగా డజనుకు పైగా హిట్ సినిమాలు మహేష్ ఖాతాలో వున్నాయి. మరో అరడజను మంచి సినిమాలు కూడా వున్నాయి. కానీ మహేష్ జీవితంలో కెరీర్ రెండు సార్లు మలుపు తిరిగింది.
పోకిరి… గేమ్ చైంజర్!
ఒక్కడు తరువాత మహేష్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ పోకిరి. ఆ తర్వాత కొన్నేళ్లకు బిజినెస్ మన్. కానీ ఆగడు, వన్ సినిమాలు మహేష్ ను కాస్త వెనక్కు నెట్టాయి. నిజానికి వాటి తరువాత ధైర్యం చేసి వాటి దోవనే వెళ్లి వుంటే ఎలా వుండేదో? శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు వరుసగా వచ్చి మహేష్ ను కాస్త కార్నర్ చేశాయి. ఒక విధంగా. నలగని డ్రెస్, మెసేజ్, అలా అలా నడుచుకుంటూ రావడం, లిమిటెడ్ గా కదలికలతో వచ్చిన ఆ సినిమాలు మహేష్ ను జనం ఇలాగే చూస్తారా? మరోలా చూడరా? అని అనుమానించేలా చేశాయి.
నిజానికి అతడు, మురారి, అర్జున్ సినిమాల్లోని ఎమోషన్లు, మాస్ టచ్ మళ్లీ కనిపించలేదు. హిట్ అయిన సినిమాల్లో కూడా అన్ని రసాలు టచ్ చేసి ఉండొచ్చు. అదిరిపోయే యాక్షన్ సీక్సెన్స్ లు వుండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో కావచ్చు. భరత్ అనే నేను లో థియేటర్ యాక్షన్ సీన్ కు వచ్చిన అప్లాజ్ వేరు.
సరిలేరు నీకెవ్వరు సినిమా నిజానికి అభిమానుల ఆకలి తీర్చింది. కానీ కథాపరంగా కాదు. దానివల్ల ఇప్పుడు మహేష్ ఏం చేయాలి? అన్నదానిపై క్లారిటీకి రాలేకపోతున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్ టైనర్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఓ మిర్చి లాంటి పుల్ యాక్షన్ ఎమోషనల్ సినిమా మహేష్ చేయాలి.
నిజానికి ఎర్లీ డేస్ లో చేసినట్లు ఇప్పుడు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆ ధైర్యం చేయగలగాలి అంటే అలాంటి డైరెక్టర్ల స్క్రిప్ట్ ను మహేష్ ఓకె చేయాలి. ఖలేజా వచ్చేవరకు మహేష్ అంత ఫన్ పండించగలరా అనుకున్నారు. కానీ సినిమా ఫలితం ఎలా వున్నా, ఆ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన సినిమా. అదే కాదు, అప్పట్లో యావరేజ్, ఫ్లాప్ అనుకున్న సినిమాలు ఇప్పటికీ టీవీలో క్రేజీ మూవీస్. అవి చూస్తుంటే మహేష్ మళ్లీ ఇలా రకరకాల సినిమాలు ఎప్పుడు చేస్తాడా? అన్న ప్రశ్న వినిపిస్తూ వుంటుంది. శ్రీమంతుడు, మహర్షి సినిమాల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్లు మహేష్ కు బాగా నప్పాయి. ఈ దిశగా అయినా ధైర్యం చేసి ఉండాల్సింది.
దర్శకులతో మహేశ్ కు దూరం పెరుగుతోందా?
ఎందుకు జరుగుతోందో తెలియదు కానీ ఒక్కో డైరక్టర్ మహేష్ కు దూరం అవుతున్నారు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూరం జరిగారు. ఆ ఇధ్దరి మధ్య ఏం జరిగింది అన్నది వారికే తెలియాలి. ఆ తరువాత ఇటీవల సుకుమార్ అర్థాంతరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. స్క్రిప్ఠ్ బాగుందా లేదా అన్నది పక్కన పెడితే, ఏదోలా డైరక్టర్ ను పట్టి ఉంచాల్సింది. ఆ మధ్య పూరి జగన్నాధ్ ను ఎందుకో హర్ట్ చేసినట్లు అయింది. ఆయన దూరం అయినట్లే. లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి. వీరు కాక సందీప్ వంగా తో సినిమా అనుకున్నారు అక్కడా స్క్రిప్ట్ తేడా అని వినిపించింది.
ఇప్పుడు టాప్ లైన్ లో రాజమౌళి, కొరటాల శివ మాత్రమే మిగిలారు. మరీ కొత్త దర్శకులతో చేయలేరు. మిడ్ రేంజ్ లో అంత అద్భుతమైన దర్శకులు ఎక్కువ మంది లేరు. అనిల్ రావిపూడితో అలాగే ట్రయ్ చేసారు. ఫలితం ఓ మేరకు మాత్రమే వచ్చింది. ఇక పరభాషా దర్శకులు. వీరి స్టయిల్ తనకు నప్పదేమో అని మహేష్ కు చిన్న అనుమానం వుంది. మురుగదాస్ లాంటి డైరక్టర్ కూడా సరైన కథను ఇవ్వలేకపోయారు. ఇక మాస్ సినిమాలు తీసే అట్లీ, ప్రశాంత్ నీల్ ను తీసుకోవడానికి చిన్న జంకు.
వేగం పెంచాలి!
సూపర్ స్టార్ అంటే ఇండస్ట్రీకి కూడా పని కల్పించాలి. కృష్ణ అదే చేశారు. లీడర్ అయ్యారు. వేగంగా సినిమాలు చేయడంలో కృష్ణకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు మహేశ్. ఈ తరం స్టార్ హీరోలంతా ఏడాదికి ఒకటీ అర సినిమాలు చేయడమే కష్టం అయిపోయిన మాట వాస్తవమే. అయితే అందరు హీరోలకు అభిమానుల బలం వుంటుంది కానీ మహేష్ కు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు వుంది. మహేష్ అంటే ఫ్యామిలీ, యంగ్ లేడీస్ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఓవర్ సీస్ మార్కెట్ బాగుంది. ఇలాంటి మంచి అవకాశం అందరు హీరోలకు ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కానీ మహేష్ దీన్ని పూర్తిగా వాడుకోవాల్సివుంది. ముందుగా వారి కోసం చకచకా సినిమాలు చేయాలి. ఇలా చేయాలి అంటే ధైర్యం చేసి, రకరకాల జోనర్లు ట్రయ్ చేయడమే. ఫ్లాపులుపలకరించవచ్చు. హిట్ లు కొట్టవచ్చు. కానీ ఫైనాన్షియల్ హిట్ అన్నదే క్రయిటీరియాగా చూసుకోవాలి.
మార్కెటింగ్ గురించి ఆలోచించాలి!
మహేష్ సినిమాకు అన్నీ కలిపి 150 కోట్ల మేరకు మార్కెట్ వుంది. ముందుగా చేయాల్సింది తనకు తానే దాన్ని తగ్గించడం. తన రెమ్యూనిరేషన్, ప్రొడక్షన్ అన్నీ కలిసి 80 కోట్లలో ఫినిష్ అయ్యేలా సినిమాలు చేస్తే, వంద కోట్ల మేరకు మార్కెట్ చేస్తే, మహేష్ సినిమాల్లో కమర్షియల్ ఫ్లాపులు అన్నవి ఉండవు. ఎందుకంటే ఫ్లాప్ అయినా హిట్ అయినా 60 నుంచి 70 కోట్ల రేంజ్ కలెక్షన్లు మహేష్ సాధించగలరు. బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్ కూడా వరల్డ్ వైడ్ గా 60 కోట్లు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నలభై కోట్లు సాధించింది. ఇది అప్పటి మాట. ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫెరిగింది.
అందువల్ల తను తక్కువ తీసుకుని, లేదా పూర్తిగా రెమ్యూనిరేషన్ లేకుండా షేర్ తీసుకుని, బయ్యర్లకు లాభం వుండేలా తక్కువకు అమ్మించి, నిర్మాతకు కూడా లాభం వుండేలా అన్ని విధాలా తనే మార్కెట్ స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం వుంది. అల్లు అర్జున్ 24 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా, ఎన్టీఆర్ 30 కోట్లు లాభాల్లో వాటా అంటుంటే మహేష్ యాభై కోట్లు అనడం కాస్త ఇబ్బంది అయిన విషయమే. ఇదే కనుక మహేష్ కూడా అన్నీ కలిపి ఓ నలభై దగ్గర ఆగితే నిర్మాతకు అక్కడే పది కోట్ల లాభం వస్తుంది. ఆ మేరకు అమ్మకాలు కూడా తగ్గించమని నిర్మాతను కట్టడి చేయవచ్చు.
ఇలా ఆర్థిక భారం లేనపుడు కాస్త ధైర్యం చేసి చకచకా సినిమాలు చేసే అవకాశం, ప్రయోగాలుచేసే ధైర్యం వుంటుంది. కానీ ఎందుకో మహేష్ ఆ ధిశగా ఆలోచించడం లేదు. సూపర్ స్టార్ కృష్ణకు నిర్మాతల హీరో అనే పేరు వుండేది. ఆ రోజుల్లో ఆయననే అంటి పెట్టుకునే నిర్మాతలు వుండేవారు. వారి కష్టనష్టాలను ఆయన పట్టించుకునేవారు వారిని అన్ని విధాలా ఆదుకునేవారు. రోజులు మారి వుండొచ్చు. మహేష్ కూడా తనకంటూ ఓ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్లను అలా తయారుచేసుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నం జరగడం లేదు.
ప్రకటనలు తగ్గించాలి!
మహేష్ అందగాడు. అందులో సందేహం లేదు. కానీ హీరోను తెరమీద సినిమాలో చూస్తుంటే ఆ థ్రిల్ వేరు. కానీ టీవీలో పది నిమషాలకు ఒక సారి ఏదో ఒక ప్రకటనలో చూస్తుంటే అభిమానుల సంగతి అలా వుంచితే మిగిలిన వారిలో క్రేజ్ తగ్గుతుంది. అల వైకుంఠపురం కలెక్షన్ల మీద బన్నీని ఏడాదిన్నరగా చూడని వ్యవహారం కూడా కాస్త వుందని గమనించాలి. మహేష్ ను చూడాలి. మహేష్ ను చూడాలి అనే ఉత్సాహం ప్రేక్షకుల్లో ఎప్పటికీ వుండాలి. సినిమా స్టార్ఠ్ కాగానే హీరోను చూడగానే విజిల్స్ మిన్నుముడతాయి దీనికి కారణం, సినిమా స్టార్ట్ అయింది ఎప్పుడు హీరో వస్తాడా? అన్న ఉత్సాహమే. సినిమాల విషయంలో కూడా ఇలాగే ఉండాలి.
ఇటీవల మరీ సీరియళ్ల ప్రకటనలకు కూడా మహేష్ వచ్చేయడం కాస్త విమర్శలకు గురయింది. ఇవి పైకి వినిపించకపోవచ్చు. కానీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో, ఫ్యాన్స్ కే తెలుస్తుంది. పైకి వారు బాహాటంగా చెప్పరు.
ఫీడ్ బ్యాక్ అందుతోందా?
మహేష్ కు మంచి టీమ్ వుంది. కానీ అది ఫ్యాన్స్ కు ఆయనకు మధ్య వారధిగా ఉంది. లేదా మహేష్ ను సోషల్ మీడియాలో బలంగా వుంచడానికి ఉంది. కానీ అభిమానుల్లో వినవస్తున్న ఫీడ్ బ్యాక్ ను కానీ, మహేష్ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారు అన్నదాన్ని కానీ ఆయనకు అందించే స్టేజ్ లో ఉన్నట్లు లేదు.
ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే మహేష్ కు సన్నిహిత స్నేహితులు కూడా తక్కువే అనిపిస్తుంది. ఆయన పూర్తిగా, పక్కాగా ఫ్యామిలీ మన్. అందువల్ల సరైన ఫీడ్ బ్యాక్ మహేష్ కు చేరడం లేదేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
మహేష్ కు వున్న చరిష్మాకు, ఇమేజ్ కు, ఫ్యాన్ ఫాలోయింగ్ కు, ఇంకా చాలా ఏళ్లు, చాలా సినిమాలు చేసే అవకాశం వుంది. కానీ రెండు విషయాలు మాత్రమే కీలకంగా చూసుకోవాలి. నిర్మాతలు, బయ్యర్లు హ్యాపీగా వుండేలా చూసుకోవాలి. అభిమానుల ప్రచారం, బయట కబుర్లు కాదు, ఇండస్ట్రీ జనాలు అయిన నిర్మాతలు, బయ్యర్లు రియల్ గా ఫీలయ్యేవి వేరు. భరత్ అనే నేను, మహర్షి విషయాలు మహేష్ కు తెలియనవి కాదు.
ఇక రెండో విషయం, ధైర్యం, అనుమానాలు, ఇగోలు పక్కన పెట్టి అందరు దర్శకులను దగ్గరకు తీసి, సరైన ప్రాజెక్టులు ప్లాన్ చేయగలగాలి. ఏడాది రెండు సార్లు పెద్ద తెరపై కనిపించగలగాలి. చిన్నతెర పై కనిపించడం తగ్గించాలి. ఇవన్నీ సూక్తి ముక్తావళి కాదు, పైకి చెప్పలేక, ఫ్యాన్స్ వారిలో వారు మాత్రమే ముచ్చటించుకుంటున్న విషయాలు.
సరైన ప్లానింగ్ ను ఇప్పటి నుంచే మహేష్ టేకప్ చేయాలి. అలా చేస్తే ఎప్పటికీ సూపర్ స్టార్ నే. అలా కాకుండా ఇప్పటి పంథాలోనే సాగితే భవిష్యత్ ఎలా వుంటుంది అన్నది వేచి చూడాల్సిన సంగతి అవుతుంది.
ఆర్వీ