తాజాగా 80వ వడిలోకి అడుగుపెట్టారు కృష్ణ. ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆయన ముఖంలో మెరుపు ఇంకా తగ్గలేదు. బరువు పెరగలేదు. మరి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి?
“ఎక్కువగా రెస్ట్ తీసుకుంటాను. పనిలేకుండా బయటకు వెళ్లను. ఎండకు ఎక్స్ పోజ్ అవ్వను. నా బరువు 76-77 మధ్య ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా నా వెయిట్ ఇదే. ఇది ఎప్పుడూ మారదు. ఇలా బరువు మెయింటైన్ అవ్వడానికి ప్రత్యేకంగా వ్యాయామాలు చేయను, జాగ్రత్తలు తీసుకోను. దేవుడి దయ అంతే.”
ఇలా స్వయంగా తన ఆరోగ్య రహస్యాల్ని బయటపెట్టారు కృష్ణ. కష్టపడి పనిచేయడమే తన హెల్త్ సీక్రెట్ అంటున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి యోగా చేస్తున్నానని, ఒకప్పుడు అది కూడా లేదని, కేవలం పని చేయడమే తనకు వ్యాయామం అన్నారు.
“ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి వాకింగ్, యోగా చేస్తున్నాను. సినిమాలు చేసే టైమ్ లో ఆ వ్యాయామం కూడా లేదు. వర్క్ చేయడమే ఎక్సర్ సైజ్. అల్లూరి సీతారామరాజు సినిమాకు ముందు రోజుకు 17 గంటలు పని చేసేవాడ్ని. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే పనిచేయాలనే నిబంధన పెట్టుకున్నాను. ఎన్నో దశాబ్దాలు అదే నాకు ఎక్సర్ సైజు.”
ఇక తన ఆహారపు అలవాట్లు కూడా బయటపెట్టారు కృష్ణ. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకంగా ఆహార పదార్థాలు తినాల్సిన అవసరం లేదని, ఇంట్లో వండుకున్న ఆహారం ఏదైనా తింటే సరిపోతుందని అన్నారు.
“పొద్దున లేచిన వెంటనే లీటరు మంచినీళ్లు తాగుతాను. ఆ తర్వాత గంట గ్యాప్ ఇచ్చి జ్యూస్ తాగుతాను. స్నానం చేసిన తర్వాత టిఫిన్ తింటాను. టిఫిన్ లో అందరూ తిన్నట్టుగానే ఇడ్లి, దోశ తింటాను. 11 గంటల టైమ్ లో మజ్జిగ తాగుతాను. మధ్యాహ్నం భోజనం మాత్రం ఫుల్ గా తింటాను. సాయంత్రం జున్ను తింటాను. రాత్రి డిన్నర్ లో పుల్కా, చికెన్ కర్రీ తింటాను. స్వీట్స్ మాత్రం తినను, నాకు నచ్చదు.”
ఇలా తన ఆహారపు అలవాట్లను కృష్ణ బయటపెట్టారు. ఇప్పుడంటే హీరోలకు కారవాన్స్ వచ్చాయని, తన టైమ్ లో అలాంటివేం ఉండేవి కావని, సెట్స్ లోనే కూర్చోవడం లేదా అటుఇటు తిరిగేవాడినని కృష్ణ చెప్పుకొచ్చారు. అదే తన ఆరోగ్య రహస్యం అన్నారు.