విశాఖ లో రామానాయుడు స్టూడియో వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకట రెండు సార్లు ఈ స్టూడియో వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. ఆంధ్ర సిఎమ్ జగన్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారని, కొంత స్టూడియో స్థలం తీసుకోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సహజంగానే జగన్ అంటే కిట్టని వారు, బెదిరింపులు, హెచ్చరికలు లాంటి పదాలు కూడా వాడేసాయి. కానీ స్టూడియో అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం ఈ విషయంలో ఎక్కడా పెదవి విప్పలేదు. తన వ్యవహారం తాను చక్కబెట్టుకోగలను అని మాత్రమే చెప్పేసి ఊరుకున్నారు.
ఆ తరువాత జగన్ కు సురేష్ బాబుకు ఓ ఒప్పందం ఏదో కుదిరిందని, కొంత ప్లేస్ జగన్ కు అమ్ముతున్నారని వార్తలు వినిపించాయి. కానీ అవీ నిజం కాలేదు. ఈ విషయంలో సుబ్బారెడ్డి కొంత రాయబారం నడిపారనీ గుసగుసలు వినిపించాయి. కానీ అవీ నిర్ధారణ కాలేదు.
ఇప్పుడు వున్నట్లుండి తెలుగుదేశం జనాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ సురేష్ బాబు ప్లాన్ ను బయటపెట్టేసారు. స్టూడియో కోసం ఎకరా 25 లక్షల రేటున చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వ స్థలం ఇచ్చారు. ఇప్పుడు స్టూడియో కోసం వాడకుండా కొంత భాగాన్ని లేఅవుట్ చేసి అమ్ముకోవాలనుకుంటున్నారు అన్నది సూక్ష్మంగా ఇప్పుడు బయటకు వచ్చిన విషయం. ఇందుకోసం లే అవుట్ కు పర్మిషన్ కావాలని దరఖాస్తు చేయడం, వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ తాత్కాలిక అనుమతి ఇవ్వడం జరిగిపోయింది.
ప్రతి లేఅవుట్ కు రూల్స్ ప్రకారం తయారయ్యే వరకు కొంత పార్ట్ ను ప్రభుత్వం మార్టిగేజ్ కింద వుంచుకుంటుంది. నియమ నిబంధనలు అన్నీ పాటించిన తరువాత ఆ మార్టిగేజ్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రతి లేఅవుట్ కు కామన్. ఇప్పుడు సురేష్ బాబు తన స్టూడియో ప్లేస్ లో వేసే లే అవుట్ కూడా కొన్ని ఎకరాలు ప్రభుత్వానికి మార్టిగేజ్ చేసారు. దీంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
తెలుగుదేశం మద్దతు మీడియా దీన్ని బయటకు తెచ్చి, దీని వెనుక ఏదో మతలబు వుందన్న అనుమానం వ్యక్తం చేసింది. అసలు సినిమా పరిశ్రమకు కేటాయించిన దాన్ని లే అవుట్ గా ఎలా మారుస్తారు అని ప్రశ్న వచ్చేలా చేసింది. గతంలో హైదరాబాద్ పద్మాలయా స్టూడియో విషయంలో వైఎస్ ఇటువంటి అనుమతి ఇచ్చారు. అక్కడ అపార్ట్ మెంట్ లు కట్టుకుని విక్రయించుకున్నారు హీరో కృష్ణ ఫ్యామిలీ.
నిజానికి విశాఖ బీచ్ లో చాలా కీలకమైన ప్లేస్ లో కొండ మీద లే అవుట్ అంటే అది చాలా ఖరీదుతో వుంటుంది. విలాసవంతంగా వుంటుంది. బాగా అంటే బాగా డబ్బు చేసిన వారు మాత్రమే కొనగలరు. రేటు కూడా ఆకాశంలో వుంటుంది. అందువల్ల ఈ వెంచర్ కచ్చితంగా దగ్గుబాటి సురేష్ బాబుకు లాభదాయకమే.
పైగా ఆ ప్లేస్ లో స్టూడియో ను నిర్వహించలేకపోతున్నారు. సముద్రపు గాలి వల్ల ఆ ప్లేస్ లో నిర్మాణాల నిర్వహణ కష్టం అవుతోంది. షూటింగ్ లు జరపడం కూడా కష్టం అవుతోంది. అందుకే తెలివిగా ఇలా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. కానీ జగన్ కనుక అనుమతి ఇవ్వాలనుకుంటే ఆపేవారు లేరు. కానీ సిన్మా రంగ అభివృద్దికి ఇస్తే లే అవుట్ వ్యాపారం అన్నదే క్వశ్చన్ పాయింట్ అవుతుంది.
తానేదో సైలంట్ గా చేసుకుందాం అనుకుంటే ఇలా బయటకు వచ్చిందని సురేష్ బాబు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అసలు జగన్ ను సురేష్ బాబు ఎలా ఒప్పించగలిగారు..దీని వెనుక ఏం జరిగి వుంటుందన్నది ముందు ముందు బయటకు వస్తుందేమో?