‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో ఊరూ వాడా తిరుగుతూ సభలు పెడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తన సభల్లో భాగంగా ప్రజలకు జోకులు చెప్పి నవ్విస్తున్నారు. చాలా చోట్ల ఆయన జోకులకు ప్రజలు నవ్వుకోవడంతో పాటు, అసహ్యించుకుంటున్నారు కూడా. తాజాగా నూజివీడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు చెప్పిన జోక్ కూడా.. మరోసారి నవ్వుకునేలాగానే ఉంది.
ఇంతకూ నూజివీడు ప్రజలకు చంద్రబాబు చెప్పిన జోక్ ఏంటో తెలుసా.. మార్గదర్శి సంస్థ విశ్వసనీయత, నిజాయితీ గురించి. తమను అడిగేవారు లేరు కదా అని.. విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అసలేమాత్రం చట్టాలనే పట్టించుకోకుండా అక్రమార్క వ్యాపారం సాగిస్తున్న సంస్థ మార్గదర్శి అనే సంగతి.. ఏపీ సీఐడీ సోదాలతోనే బయటకు వచ్చింది.
ఇన్నాళ్లూ అంత గుట్టుగా వాళ్లు ఆ వ్యాపారం సాగించారు. మొత్తానికి సీఐడీ వారి సోదాలు, విచారణలతో డొంక నెమ్మదిగా కదులుతోంది. ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన పెద్దకోడలు శైలజా కిరణ్ ఉన్నారు. వారిని ఇప్పటికే ఓ విడత సీఐడీ విచారించింది కూడా. నిబంధనల అతిక్రమణను వారు ఒప్పుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
వారే స్వయంగా తాము సంస్థ నిర్వహణలో చట్టాలు పట్టించుకోలేదని చెబుతూ ఉంటే.. మధ్యలో చంద్రబాబునాయుడుకు నొప్పి కలిగినట్టుంది. రామోజీరావు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, విలువలతో ఉన్న వ్యక్తి అంటూ ఆయన డప్పు ఈయన కొడుతున్నారు.
ఇదే ఒక జోకు అనుకుంటే, అంతకంటె పెద్ద జోకు కూడా మరొకటి పేల్చారు. ఎన్నో ప్రభుత్వాల మీద పోరాడిన రామోజీరావు, చంద్రబాబు మీద కూడా చాలా విమర్శలు చేశారట. అయినా సరే.. ఆయన విలువలున్న వ్యక్తి అని తెలుసు గనుక.. ఆయనను చంద్రబాబు ఎఫ్పుడూ ఇబ్బంది పెట్టలేదట.
చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, తాను రాష్ట్రంలో కింగ్ మేకర్ గా తిరుగులేని అవతారంలో మిగిలిపోవాలని కలలు కనే రామోజీరావు.. చంద్రబాబు మీద ఎప్పుడు విమర్శలు చేశారో.. నారా వారు ఒక్క ఉదాహరణైనా చెబితే బాగుండేది.
తన మాట వినని రామారావుకు వ్యతిరేకంగా ఒక దశలో రామోజీరావు రెచ్చిపోయారే తప్ప.. చంద్రబాబును ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. ఇంకా తెలుగుదేశంలోని చంద్రబాబు వ్యతిరేకవర్గం నాయకుల మీద , చంద్రబాబు వ్యూహం ప్రకారంగా అవినీతి కథనాలు ప్రచురించి ఆయా నాయకుల మీద వేటు వేయడానికి రామోజీ తోడ్పడ్డారు. అలాంటిది.. ఇప్పుడిలా ఆయన నిజాయితీ, విలువల గురించి జోకులు చెబుతూ చంద్రబాబు వెనకేసుకు రావడం కామెడీగా ఉంది.