పిలిచి పెద్దపీట వేస్తే.. ఫిటింగు పెట్టాడే!

125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరించడం ద్వారా.. దళిత వర్గాల్లో తిరుగులేని క్రేజ్ ను, ఓటు బ్యాంకును కేసీఆర్ ఆశించడంలో తప్పులేదు. ఇందుకోసం ఆయన చేయదగిన అన్ని ప్రయత్నాలూ చేశారు.  Advertisement…

125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరించడం ద్వారా.. దళిత వర్గాల్లో తిరుగులేని క్రేజ్ ను, ఓటు బ్యాంకును కేసీఆర్ ఆశించడంలో తప్పులేదు. ఇందుకోసం ఆయన చేయదగిన అన్ని ప్రయత్నాలూ చేశారు. 

భీమ్‌రావు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను ప్రత్యేకంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథిగా పిలిపించారు. ఆయన వచ్చి తాతగారి విగ్రహం చూసుకుని మురిసిపోయారు. ఇంత పెద్ద ప్రయత్నం చేసిన కేసీఆర్ సర్కారును వేనోళ్ల పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాటలు కొన్ని కేసీఆర్ ను ఇరుకున పెట్టేవే.

హైదరాబాదు నగరాన్ని కీర్తించిన ప్రకాష్ అంబేద్కర్, దీనిని దేశానికి రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనేది తన తాతయ్య భీమ్ రావు అంబేద్కర్ స్వప్నం అని ఆయన వెల్లడించారు. దేశానికి హైదరాబాదు రెండో రాజధానిగా చెలామణీ కావడం అనేది వినడానికి బాగానే ఉంటుంది.. కానీ ఆచరణలో ఏమౌతుంది అనేది ఇప్పుడు లోతుగా చర్చ నడుస్తోంది. 

అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం, అంబేద్కర్ మనవడిని పిలిచి ఆయనతో ఈ ఘనతను కీర్తింపజేసుకోవడం ద్వారా.. అంబేద్కర్ ఆశయసాధన అన్నట్టుగా ఒక మైలేజీ సాధించుకున్నారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఎత్తుగడలకు వెళ్లి అంబేద్కర్ ఆశయసాధనకు తాము కట్టుబడి ఉన్నాం అని హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే ఏమవుతుంది? 

హైదరాబాదు విషయంలో అంబేద్కర్ స్వప్నం అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ విషయం బహుధా చర్చకు వచ్చింది. అంబేద్కర్ స్వప్నం సాకారం చేస్తూ హైదరాబాదును రెండో రాజధానిగా ప్రకటించి, దీనిని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని, హైదరాబాదు మినహా మిగిలిన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తారని అప్పట్లో ఒక ప్రతిపాదనగా తెరపైకి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ అండ్ కో కు కంగారు పుట్టింది. హైదరాబాదుతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని వారు ఉద్యమాలు చేశారు. 

ఇన్నాళ్లకు హైదరాబాదు రెండో రాజధాని అనే టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కేంద్రం దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం  చేసి, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి మాదిరిగానే ఇక్కడినుంచి పనిచేయవచ్చునని.. కానీ ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని చెబితే గనుక.. నగరం మీద భారాస పెత్తనం పోతుంది. కేసీఆర్ కు ఇది చాలా చేదు ప్రతిపాదన అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.