ఓటీటీ డైరక్ట్ రిలీజ్.. కేవలం చిన్న సినిమాలకు మాత్రమే. ఎంత లేట్ అయినా ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలతో పాటు పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోనే రిలీజ్ అవుతాయి. మొన్నటివరకు చాలామంది సినీజనాలతో పాటు సామాన్య ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదే. అయితే థియేటర్ల కోసం ఎదురుచూడడం కష్టంగా మారిన ఈ గడ్డు పరిస్థితుల్లో పెద్ద సినిమాలు కూడా ఇప్పుడిప్పుడే ఓటీటీ బాట పడుతున్నాయి.
ఇందులో భాగంగా తెలుగు నుంచి ఆల్రెడీ V మూవీ ఓ అడుగుముందుకేసింది. నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన ఈ సినిమా వచ్చేనెల 5న ఓటీటీలో డైరక్ట్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో పెద్ద సినిమా చేరింది. ఈసారి సూర్య వంతు.
అవును.. సూర్య నటిస్తున్న “ఆకాశం నీ హద్దురా” సినిమా కూడా డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో డీల్ కుదుర్చుకున్నాడు హీరో కమ్ నిర్మాత సూర్య. అక్టోబర్ 30న ఈ సినిమా ఒకేసారి తమిళ-తెలుగు భాషల్లో ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి రాబోతోంది.
భార్య జ్యోతిక నటించిన సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చినప్పుడు కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు సూర్య. ఇకపై సూర్య సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేయమంటూ ఒక దశలో వార్నింగ్ కూడా ఇచ్చాయి థియేటర్ యాజమాన్యాలు. మారిన పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా తన నిర్ణయాలు ఇలానే ఉంటాయని.. అప్పట్లోనే చిన్న హింట్ ఇచ్చాడు సూర్య. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తన కొత్త సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు.
సూర్య సినిమాలకు తమిళ, తెలుగు భాషల్లో మంచి మార్కెట్ ఉంది. ఇలాంటి నటుడే తన సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశాడంటే.. ఇక ఈ బాటలో మరింతమంది హీరోలు క్యూ కట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయితేజ్, వైష్ణవ్ తేజ్, రాజ్ తరుణ్, అనుష్క, రామ్ సినిమాల్ని ఇంకెన్నాళ్లు ఇలానే దాస్తారో చూడాలి.