నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఆయనపై బాలీవుడ్ లేనిపోని ప్రేమను వ్యక్తం చేసిందని, మీడియా కూడా అదే తీరున వ్యవహరించిందని పలువురు అభిప్రాయపడ్డారు. దేశంలో మీడియాకు కావాల్సింది సెన్షేనల్ న్యూస్ లు మాత్రమే. అందులో నిజానిజాలూ అవసరం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై కూడా మీడియా అదే తీరున వ్యవహరిస్తూ ఉంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో ఈ వ్యవహారంలో మీడియాకు మళ్లీ మేత లభించింది. దీంతో కొత్త కొత్త కథనాలను ఇచ్చేస్తూ ఉన్నారు. మీడియా తనే ధర్యాప్తు చేసినట్టుగా కలరింగ్ ఇస్తోంది.
ఈ వ్యవహారంలో రియా చక్రబర్తి పేరు కూడా రావడంతో మీడియాకు ఇక పట్టపగ్గాలేకుండా పోయాయి. మరణించింది ఒక సినిమా హీరో, ఆరోపణలు వస్తున్నది ఒక సినిమా హీరోయిన్ మీద. బహుశా మీడియాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది? దానికి తోడు మహారాష్ట్ర సీఎం తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు కూడా ఈ వ్యవహారంలో వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మీడియా వాళ్లూ, సోషల్ మీడియా వాళ్లూ తమకు తోచిన క్రైమ్ కథలను అల్లుతున్నారు!అయితే ఎవరికి వాస్తవాలు ఏమిటీ తెలియవు. అయితే వీరి క్రియేటివిటీని ఉపయోగించి సుశాంత్ ఆత్మహత్యను క్రైమ్ కథగా మారుస్తున్నారు.
అయితే తనెందుకు ఆత్మహత్య చేసుకున్నదీ సుశాంత్ లేఖ రాయలేదు. మొదట్లో అతడి ఆత్మహత్యపై మీడియా ఎలాంటి అనుమానాలనూ వ్యక్తం చేయలేదు. అప్పుడంతా బాలీవుడ్ లో నెపొటిజం అని, అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్నట్టుగా ప్రచారం చేశారు. అప్పుడు సుశాంత్ పాలిట బాలీవుడ్ సినీ ప్రముఖులను విలన్ గా చూపించారు. మీడియానే అనుకుంటే సోషల్ మీడియా కూడా రచ్చ రచ్చ చేసింది. అయితే అప్పుడంతా సుశాంత్ కు సినిమా అవకాశాలు ఇవ్వలేదని బాలీవుడ్ వాళ్లను తిట్టి, ఇప్పుడు మళ్లీ అదే విషయంలో రియా చక్రబర్తిని, ఆదిత్య ఠాక్రేను తిడుతున్నారు. మరి వీళ్లకు సుశాంత్ ఆత్మహత్యతో నిజంగానే సంబంధం ఉందా? అంటే అది చట్టబద్ద సంస్థలే తేల్చాలి!
అయితే ఆ నిజానిజాలు బయటకు రావాలి. నిజంగానే సుశాంత్ ఆత్మహత్యకు వీళ్లు ప్రత్యక్ష కారణం అయినా, లేక సుశాంత్ ది ఆత్మహత్య కాక హత్య అయితే ఆ వ్యవహారంలో దోషులకు కచ్చితంగా శిక్ష పడాలి. అయితే ఇంతలోపు మీడియా మాత్రం వీక్షకుల కోసం అన్నట్టుగా ఇష్టానుసారం కథనాలను వండి వారుస్తూ ఉంది.
ఎంతలా అంటే.. రియా చక్రబర్తి పేరిట 60 లక్షల ఫ్లాట్ ఉందట, ఆమె తండ్రి పేరిట మరో ఫ్లాట్ ఉందట.. ఇవి కూడా భారీ ఆస్తులు, అక్రమాస్తులు అన్నట్టుగా మీడియాలో హెడ్డింగులు పెడుతున్నారు. ఈ రోజుల్లో ఆ స్థాయి ఫ్లాట్లు కొనడం కష్టమా? రియా ఫ్లాట్ కోసం లోన్ కూడా 40 లక్షల వరకూ తీసుకుందని అంటున్నారు. మరలాంటప్పుడు అది భారీ ఆస్తి అవుతుందా? ఆమె తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ అట, ఆయన పేరిట ఒక ఫ్లాట్ ఉండటం వింత? నిజంగానే సుశాంత్ డబ్బు రియా అక్రమంగా బదిలీ చేయించుకుని ఉంటే ఆమెకు అందుకు తగిన శిక్ష ను న్యాయస్థానం వేయొచ్చు. కానీ.. మీడియా మాత్రం చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూపించడం మానుకుంటే మంచిది. సెలబ్రిటీల కేసుల్లో మీడియా మొదట్లో గోరంతలను కొండతలు చేయడం, ఆ తర్వాత ఆ విషయాలను మీడియా కూడా విస్మరించడం గతంలో కూడా జరిగిన ఉదంతాలే.