24 గంటలూ, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి కలిసే ఉంటున్నా.. భార్యాభర్తల మధ్య కొన్ని దాగిన విషయాలు అలాగే ఉంటాయి! కలిసి కాపురం చేసే వాళ్ల మధ్య చాలా వరకూ వ్యవహారాలు దాగవు. అయితే ఎంత దాగని అంశాలను కూడా దాచే కళ మగాళ్లలో ఉంటుంది!
భర్త మీద భార్య ఎంతగా నిఘా ఉంచినా కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లో బయటపడవు అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్.
మగాడు భార్య వద్ద కొన్ని విషయాలను దాస్తాడని, అవి బయటపడనీయడని వారు వివరిస్తున్నారు. అలాంటి విషయాల్లో ముఖ్యమైనవి ఏమిటంటే..
పరస్త్రీ పట్ల ఆకర్షణ..
చాలా మంది మగాళ్లకు ఇది చాలా సహజమైన లక్షణం. అది మానవ సహజ లక్షణం అనాలేమో! పెళ్లి చేసుకున్నంత మాత్రానా భార్యను మాత్రమే ఆరాధించే మగావాళ్లెంతమంది? అందరూ బయట సంబంధాలు పెట్టుకోకపోవచ్చు గాక, మనసులో మాత్రం బోలెడన్ని ఆకర్షణీయమైన విషయాలు ఉండవచ్చు. పెళ్లికి ముందు కూడా అలాంటి ఆకర్షణలు ఉంటాయి, పెళ్లి తర్వాత అలాగే కొనసాగేవి, కొత్త పరిచయాలు- ఆకర్షణలు..ఇవన్నీ ఎంతో మంది మగాళ్ల జీవితాల్లో ఉంటాయి. అయితే భార్యవద్ద మాత్రం ఈ విషయాలను వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టుకోరు, పెట్టుకోలేరు!
మహా అయితే.. ఫలానా ఆమె బాగా అందంగా ఉందని ఒక చిన్న కామెంట్ అయితే చేయొచ్చేమో కానీ, అంతకు మించి మిగతా విషయాలను మగాడే సెన్సార్ చేసుకుంటాడు. మరీ ఫీలింగ్స్ ను బయటపెట్టుకుని భార్య వద్ద బుక్ అయ్యే మగాళ్లు మాత్రం దాదాపుగా ఉండకపోవచ్చు!
భార్య వల్ల వచ్చే విసుగునూ దాచేస్తాడు!
మనిషిని మనిషి భరించడం అంటే మాటలేమీ కాదు. అందుకే భార్యభర్తల మధ్యన కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో గట్టిగా అరుచుకుని వాళ్లు గొడవపడొచ్చు. మరి కొన్ని అంశాల్లో మాత్రం మగాడు మౌనమే దాలుస్తాడట. భార్య కొన్ని కొన్ని విషయాల్లో విసిగించినా, ఆ విషయాన్ని బయటపెట్టడట. ఆమె బాధపడుతుందనో.. మరో ఫీలింగ్ తోనో ఆమె అతిగా విసిగించే కొన్ని అంశాలను కూడా మగాడు బయటకు ప్రస్తావించడట!
ఆర్థిక వ్యవహారాలు..
కొంతమంది మగాళ్లకు సంబంధించిన అంశమే కావొచ్చు ఇది. తన భార్యకు తన సంపాదన ఎంతనే విషయాన్ని చెప్పడానికి, ఆ విషయం ఆమెకు అర్థం కావడానికి కొంతమంది మగాళ్లు అస్సలు ఒప్పుకోరట. తన భార్య ఇప్పటి వరకూ తన జీతమెంతో అడగలేదు.. అని కొంతమంది గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు! తన భార్యకు అన్ని రకాల ఆర్థిక అవసరాలను తీర్చేస్తానని, అంతకు మించి ఆమెతో ఆర్థిక విషయాలను చర్చించే అవకాశమే లేదని కొంతమంది మగాళ్లు చెబుతుంటారు. కొంత వరకూ కుటుంబ ఆర్థిక పరిమితుల గురించి భార్యకు క్లారిటీ ఇచ్చినా, పూర్తి వివరాలు మాత్రం భార్యకు తెలీయకుండా మేనేజ్ చేడయానికే ఎక్కువమంది మగాళ్లు ప్రాధాన్యతను ఇస్తారట.