మాజీ మిస్ యూనివర్స్, అందాల నటి సుశ్మిత సేన్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆమెకు యాంజియోప్లాస్టీ నిర్వహించి, గుండెలో స్టెంట్ వేశారు. ఈ విషయాల్ని స్వయంగా సుశ్మితా సేన్ వెల్లడించింది.
కొన్ని రోజుల కిందట తనకు పెద్ద హార్ట్ ఎటాక్ వచ్చిందని, వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపింది సుశ్మిత సేన్. ప్రస్తుతం తను కోలుకుంటున్నానని, ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటించింది.
“నీ హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా ఉంచుకో, నీకు అవసరమైనప్పుడు అది నీకు అండగా నిలుస్తుంది షోనా” అంటూ తన తండ్రి ఎప్పుడూ తనతో చెప్పేవారని, అది ఇప్పుడు నిజమైందని చెప్పుకొచ్చింది సుశ్మితా సేన్. తను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని, తనకు విశాల హృదయం ఉందంటూ సర్జరీ చేసిన వైద్యుడు కూడా చెప్పాడంటూ ఓ చిన్న జోక్ వేసింది.
ప్రస్తుతం అంతా బాగానే ఉందని, ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపింది ఈ మాజీ విశ్వసుందరి. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పుడూ దాచిపెట్టలేదు సుశ్మిత సేన్. తను అనారోగ్యంతో ఉన్నానని, తన జుట్టు రాలిపోతోందని ఆమె రెండేళ్ల కిందటే ప్రకటించింది. అంతేకాదు, తనకు ఏదైనా జరిగితే అందరికీ తెలియాలని, అందుకే ఇనస్టాలోకి వచ్చానని కూడా తెలిపింది.
ఆమె ఊహించినట్టుగానే జరిగింది. సుశ్మిత గుండెపోటుకు గురైంది. ఆ విషయాన్ని స్వయంగా సుశ్మితానే సోషల్ మీడియాలో తెలిపింది. గుండె ధైర్యం అంటే ఇదీ అంటూ నెటిజన్లు సుశ్మితను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సుశ్మిత సేన్ వయసు 47 సంవత్సరాలు.