ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, దానికి మూల్యం చెల్లించుకుంటాడు. సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా తన కెరీర్ లో రెండు పెద్ద తప్పులు చేశారు. ఇప్పటికీ దానికి మూల్యం చెల్లించుకుంటున్నానని అన్నారు. ఇంతకీ ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ఆ రెండు తప్పులేంటి?
“వజ్రం సినిమా కంటే ముందు నేను వేరే కథ సిద్ధం చేశాను. నాగార్జునకు అదే కథ చెప్పాను. నాగ్ కు కూడా బాగా నచ్చింది. ఓకే చెప్పారు. కానీ నిర్మాత నరసారెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. టేబుల్ ప్రాఫిట్ ఉంటే తప్ప నేను సినిమా చేయనన్నాడు. దీంతో అతడి కోసం నేను, నాగార్జున బెండ్ అవ్వాల్సి వచ్చింది. కథ మార్చేశాం. రైట్స్ కొనుక్కొని ఓ రీమేక్ సినిమా చేశాం. అదే నేను చేసిన మొట్టమొదటి తప్పు. నా కెరీర్ లో పెద్ద తప్పు కూడా అదే.”
కెరీర్ లో చేసిన ఆ అతిపెద్ద తప్పు వల్ల ఎస్వీ కృష్ణారెడ్డిపై ఏకంగా చాలా పెద్ద రిమార్క్ పడింది. పెద్ద హీరోలను కృష్ణారెడ్డి హ్యాండిల్ చేయలేరనే అపవాదను ఎదుర్కొన్నారు. అది నిజమే అంటున్నారు ఈ సీనియర్ దర్శకుడు. కేవలం ఆ అనుమానాలతోనే చిరంజీవి, వెంకటేష్ తనకు అవకాశాలివ్వలేదని బాధపడ్డారు. అయితే కృష్ణ లాంటి పెద్ద హీరోతో తను సినిమా తీసి హిట్ కొట్టిన విషయాన్ని అప్పట్లో ఎవ్వరూ గుర్తించలేదన్నారాయన.
ఇక ఎస్వీ కృష్ణారెడ్డి తన కెరీర్ లో చేసిన రెండో అతి పెద్ద తప్పు, హీరోగా మారడం. తను హీరోగా మారి చాలా పెద్ద తప్పు చేశానంటున్నారు. కేవలం దర్శకత్వంపై దృష్టి పెట్టి ఉంటే తన కెరీర్ మరో విధంగా ఉండేదని, హీరోగా మారి తన కెరీర్, మనీషా ఫిలిమ్స్ కెరీర్ కు బ్రేకులేశానని బాధపడ్డారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు, దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ అందుకున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తీశారు. ఎప్పట్లానే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం కృష్ణారెడ్డే చూసుకున్నారు. వీటికి అదనంగా ఈసారి డైలాగ్స్ కూడా అందించారు.