స్వయంవరం..మనోహరం

మండు వేసవి వేళ పిల్లతిమ్మెర చల్లగా పలకరిస్తే ఎలా వుంటుంది. చెవులు బద్దలైపోయేంత బీట్ ను నిలువెల్లా నింపేసుకుని, సాహిత్యాన్ని మింగేసి, కేవలం పబ్ ల్లో డ్యాన్స్ లకు మాత్రమే పనికి వచ్చేలా పాటలు…

మండు వేసవి వేళ పిల్లతిమ్మెర చల్లగా పలకరిస్తే ఎలా వుంటుంది. చెవులు బద్దలైపోయేంత బీట్ ను నిలువెల్లా నింపేసుకుని, సాహిత్యాన్ని మింగేసి, కేవలం పబ్ ల్లో డ్యాన్స్ లకు మాత్రమే పనికి వచ్చేలా పాటలు వస్తున్న కాలంలో ఓ మంచి పాట వస్తే అలాగే వుంటుంది. 

హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై నిర్మిస్తున్న ‘సీతారామం’ సినిమా ఓ క్లాసిక్ గా నిలిచిపోబోతోందని ఇప్పటికే ఇమేజ్ తెచ్చేసుకుంది. ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంలా నిలుస్తున్నాయి. యుద్దంతో రాసిన ప్రేమలేఖ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ఇప్పుడు మూడో పాట విడుదలైంది.

దివంగత కవి సీతారామశాస్త్రి రాసిన గీతం ఇది.

కానున్న కళ్యాణం ఏమన్నది ? అన్నది అమ్మాయి ప్రశ్న…

అసలు ప్రశ్నే చిత్రంగా వుంది. దానికి అబ్బాయి సమాధానం ఇంకా చిత్రంగా…

’’… స్వయంవరం.. మనోహరం –’’ అంటూ వచ్చింది.

రానున్న వైభోగం ఎటువంటిది? అన్నది అమ్మాయి మదిలో మరో అనుమానం.

‘’..ప్రతి క్షణం మరో వరం..’’ అన్నది అబ్బాయి బాస..అంతకన్నా ఏం కావాలి ఏ అమ్మాయికైనా

”విడువని ముడి ఇది కదా

ముగింపు లేని గాధగా

తరముల పాటుగా

తరగని పాటగా

ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా..’’

అన్నది ఆపైన ఇద్దరి ఆలాపన. సీతారామశాస్త్రి ఏం రాసినా అది అద్భుతంగా వుంటుంది అనడానికి ఈ పాట మరో ఉదాహరణ. విశాల్ చంద్రశేఖర్ అందించిన ట్యూన్ కొత్తగా లేదు. ఎక్కడో విన్నట్లే వుంది. కానీ అద్భుతమైన సాహిత్యం ఆ విషయాన్ని గుర్తు చేయదు. మంచి అభిరుచితో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను స్వప్నదత్..అశ్వనీదత్..ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా.