జాగ్రత్తలు తీసుకొని డబ్బింగ్ చేసే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలకు మాత్రమే కొద్దోగొప్పో జాగ్రత్తలు తీసుకుంటారు. మిగతా సినిమాల్ని అలా చూసీచూడనట్టు వదిలేస్తుంటారు.
ఒక డబ్బింగ్ ఆర్టిస్టుతోనే ఇద్దరు ముగ్గురు నటులకు డబ్బింగ్ చెప్పించడం లాంటి వ్యవహారాలు చాలానే జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ కాస్ట్ కటింగ్ కక్కుర్తి గురించి కాదు. ప్రస్తుతం నడుస్తున్న ఓ 'డబ్బింగ్ పైత్యం' గురించి.
ఈమధ్య అజిత్ వలిమై అనే సినిమా చేశాడు. దాన్ని అదే టైటిల్ తో నేరుగా తెలుగులో డబ్ చేశారు. వలిమై అంటే అర్థమేంటో సగటు తెలుగు ప్రేక్షకుడికి తెలియదు. త్వరలోనే పృధ్విరాజ్ నటించిన మలయాళం సినిమా కడువా కూడా తెలుగులోకి వస్తోంది. దీనికి తెలుగులో కూడా ఇదే పేరు పెట్టారు. ఇక ఈమధ్య తమిళ, మలయాళ వెబ్ సిరీసులు కూడా ఆయా మాతృభాషల టైటిల్స్ తోనే తెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్ గా నుడుల్ అంటూ ఒకటి ఓటీటీలోకి వచ్చింది.
అసలేంటీ పైత్యం. డబ్బింగ్ సినిమాల్ని రుద్దుతున్నారు సరే. కనీసం వాటికి పేర్లయినా మార్చొచ్చు కదా. ఉన్న పేరుతోనే యథాతథంగా డబ్బింగ్ చేసి మొహంమీద పడేస్తే ఏంటి అర్థం. సెట్ అవ్వకపోయినా, ఏదో ఒక తెలుగు పదంతో ఇన్నాళ్లూ డబ్బింగ్ సినిమాలొచ్చాయి. కానీ ఇప్పుడు తమిళ, మలయాళ టైటిల్సే తెలుగు టైటిల్స్ గా మారిపోయి చిరాకు తెప్పిస్తున్నాయి.
ఈ పైత్యాన్ని ఇలా భరించాల్సిందేనా? నేరుగా ఓ తెలుగు సినిమాను అదే టైటిల్ తో తమిళ్ లో రిలీజ్ చేస్తే తంబీలు ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తారు, చీల్చిచెండాడతారు. అవసరమైతే థియేటర్లు క్లోజ్ చేస్తారు. అది వాళ్ల భాషాభిమానం. మరి మనకెందుకు ఆ అభిమానం లేదు. భాష, అభిమానం, ప్రేమ లాంటి పదాలు మరిచిపోదాం.
కనీసం తెలుగు ప్రేక్షకుడికి అర్థమయ్యే టైటిల్ పెట్టాలని ఎందుకు అనుకోవడం లేదు. మరో టైటిల్ గురించి ఆలోచించడం ఎందుకు టైమ్ వేస్ట్ అనుకుంటున్నారా? అటు మేకర్స్ మాత్రం ఈ కొత్త పోకడకు సరికొత్త రీజన్ చెబుతున్నారు. రెండు టైటిల్స్ పెడితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ కష్టమౌతోందట. హ్యాష్ ట్యాగ్ రికార్డులు రిజిస్టర్ అవ్వడం లేదంట. అందుకే ఒకే టైటిల్ తో అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారట. మరి అంత రికార్డుల పిచ్చి ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టుకోవాలి.
ఆర్ఆర్ఆర్, పుష్ప, విక్రమ్, కేజీఎఫ్.. భాషతో సంబంధం లేకుండా కనెక్ట్ అయిన టైటిల్స్ ఇవి. ఈ విధంగా ఆలోచించి టైటిల్స్ పెట్టుకుంటే ఎవరికీ సరిపోద్ది కదా. తెలుగోడికే ఎందుకీ కష్టం.
తెలుగోళ్లకు అర్థంకాని నడుల్, కడువా, వలిమైలు మనకెందుకు? ఇకనైనా ఈ పిచ్చి ట్రెండ్ కు అడ్డుకట్ట వేయాలి? లేదంటే భవిష్యత్తులో వలిమైని కూడా తెలుగుపదం అని భ్రమపడే రోజులొస్తాయి.