తన పెళ్లి విషయంలో ఆది నుంచి వెరైటీగానే వ్యవహరిస్తోంది తాప్సి. గతంలో పెళ్లి ఎప్పుడు అని అడిగినందుకు ఇంకా తను గర్భం దాల్చలేదని, ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ సెటైర్ వేసింది. ఆ తర్వాత అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానంది.
కట్ చేస్తే, అత్యంత రహస్యంగా బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడింది. ఆ పెళ్లి ఎంత సీక్రెట్ గా జరిగిందంటే, పెళ్లయిన మరుసటి రోజు వరకు ఎవ్వరికీ ఎలాంటి లీకుల్లేవ్. కనీసం ఫొటోలు కూడా బయటకు రాలేదు.
అలా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ విషయాన్ని తాప్సి ప్రకటించలేదు. ఏమీ జరగట్టే వ్యవహరించింది. ఇప్పుడు తాప్సి పెళ్లికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోను తాప్సి విడుదల చేయలేదు. ఇది లీక్ అయింది. ఇంకా చెప్పాలంటే తాప్సి కావాలనే లీక్ చేసిందంటున్నారు చాలామంది.
సిక్కు సంప్రదాయంలో తాప్సి, మథియాస్ పెళ్లి జరిగింది. మార్చి 23న ఉదయ్ పూర్ లో జరిగిన ఈ వేడుకలో ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో తాప్సి కనిపించగా, మథియాస్ షేర్వానీ వేసుకున్నాడు. అతడి వైపు ఊరేగింపుగా తాప్సిని తీసుకెళ్లారు. ఊరేగింపుకు వెళ్తూ తాప్సి హుషారుగా స్టెప్పులేసింది.
ఆ తర్వాత మథియాస్ బో వైపు వెళ్లింది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ వెంటనే వాళ్లపై పూల వర్షం కురిసింది. ఈ వీడియో ఓ సోషల్ మీడియా వేదికలో ప్రత్యక్షమైంది. ఆ వెంటనే వైరల్ అయింది. అలా తన పెళ్లి మేటర్ ను వీడియో లీక్ చేసి మరీ బయటపెట్టింది తాప్సి.