టీడీపీని భయపెడుతున్న సీటు!

తెలుగుదేశం పార్టీ విశాఖలో సేఫ్ గా ఉంది అని అంతా అంటున్నారు. గతసారి జగన్ వేవ్ ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా బలంగా వీచినా విశాఖ సిటీలో మాత్రం సైకిల్ జోరు చేసింది. ఈసారి…

తెలుగుదేశం పార్టీ విశాఖలో సేఫ్ గా ఉంది అని అంతా అంటున్నారు. గతసారి జగన్ వేవ్ ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా బలంగా వీచినా విశాఖ సిటీలో మాత్రం సైకిల్ జోరు చేసింది. ఈసారి అయితే ప్రతిపక్షంలో టీడీపీ ఉంది కాబట్టి సిటీలో మరోసారి జెండా ఎగరడం ఖాయమని భావిస్తోంది.

విశాఖ ఎంపీ సీటుని గతసారి స్వల్ప తేడాతో పోగొట్టుకున్న టీడీపీకి ఈసారి అంతా సాఫీగా ఉంది అనుకుంటే కీలకమైన నియోజకవర్గంలో మాత్రం పసుపు పార్టీ కలవరపడుతోంది. విశాఖ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఎస్ కోటలో టీడీపీ రెండుగా చీలిపోయింది.

ఎన్నారై గొంప క్రిష్ణ ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధం అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినా తగ్గడం లేదు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇవ్వడంతో గొంప అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయనకు ఎస్ కోట మండలాల్లో పట్టుంది. ఆయన అనుకున్నంత పని చేస్తే విశాఖ ఎంపీ సీటు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ కలవరపడుతోంది.

ఆయన అయితే టీడీపీ పెద్దలకు అందుబాటులోకి రావడంలేదు. టికెట్ ఇస్తాను అంటేనే మాట్లాడమంటున్నారు. దాంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 2019లో కూడా టీడీపీ ఎంపీ సీటుకు కన్నం పెట్టింది ఎస్ కోటలో తగ్గిన మెజారిటీయే అని గుర్తు చేసుకుంటున్నారు.

ఇపుడు అంతా బాగుంది అనుకుంటే ఎస్ కోట మరోమారు రివర్స్ గేర్ వేయడం పట్ల తమ్ముళ్ళు సతమతమవుతున్నారు. ఈ విషయంలో ఏదో ఒకటి చేసి పార్టీని ఒక్కటిగా చేయకపోతే ఆ ప్రభావం పడి మరో మారు విశాఖ ఎంపీ సీటు చేజారుతుందని అంటున్నారు.