వైసీపీ పవర్ ఫుల్ అస్త్రం… సక్సెస్ కొడుతుందా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ సామాజిక న్యాయం పాటిస్తూ సీట్లు పంపిణీ చేసింది. అంతే కాదు ఈసారి లోకల్ అభ్యర్థులను నిలబెట్టింది. విశాఖ పార్లమెంట్ విషయంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగు…

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ సామాజిక న్యాయం పాటిస్తూ సీట్లు పంపిణీ చేసింది. అంతే కాదు ఈసారి లోకల్ అభ్యర్థులను నిలబెట్టింది. విశాఖ పార్లమెంట్ విషయంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ అంటే నాన్ లోకల్ అన్నదే జరుగుతోంది.

అన్ని పార్టీలు కూడబలుక్కున్నట్లుగా ఇతర ప్రాంతాల వారిని తెచ్చి సీట్లు ఇస్తున్నారు. వైసీపీ ఆ సంప్రదాయాన్ని ఈసారి బద్ధలు కొట్టింది. విశాఖ ఆడపడుచు అయిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికి టికెట్ ఇచ్చింది. అలాగే బీసీ మహిళగా ఆమెను ప్రొజెక్ట్ చేస్తోంది.

విశాఖ ఎంపీ సీట్లో బీసీలు గెలీచి అర్ధ శతాబ్దం దాటుతోంది. మహిళ గెలిచి దశాబ్దన్నర కాలం అవుతోంది. దాంతో అన్నీ ఆలోచించి వైసీపీ ఈ ఎంపిక చేసింది. అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో వైసీపీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. స్థానికుడు అయిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని అభ్యర్థిగా నిలబెట్టింది. అలాగే అత్యధిక సంఖ్యలో ఉన్న బలమైన సామాజిక వర్గం నుంచి ఆయనను ఎంపిక చేసింది.

అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్ధిగా స్థానికుడు మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్ కుమార్ కి టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ ని ఆయన సొంత నియోజకవర్గం గాజువాకకు పంపించింది. అలా లోకల్ ప్రయారిటీ ఇస్తూ సెలెక్షన్ చేసింది.

దాంతో అభ్యర్ధులు కూడా తమ ప్రచారంలో తాము పక్కా లోకల్ అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాధ్ తాను గాజువాకకు స్థానికుడిని తన తండ్రి తాత ఎమ్మెల్యేలుగా పనిచేసారు అని తనకు అన్ని విషయాల మీద అవగాహన ఉందని చెబుతున్నారు. తనకు చాన్స్ ఇస్తే గాజువాక ని అభివృద్ధి చేస్తాను ఆ విజన్ తన దగ్గర ఉందని అంటున్నారు.

గాజువాకకు గుడివాడ అభ్యర్థి అయ్యాక టైట్ ఫైట్ గా పరిస్థితి మారింది. ఎవరికీ ఈజీ కాదు అన్నట్లుగానే ఉంది. మంత్రి సైతం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన తనతో వారిని ఉంచుకునే ప్రయత్నం చేస్తూ అన్ని వర్గాలకు చేరువ అవుతున్నారు. విశాఖ జిల్లాలో వైసీపీ పవర్ ఫుల్  అస్త్రం  ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది.