హీరోయిన్ అంజలిపై పెళ్లి పుకార్లు ఇప్పటివి కాదు. ఎప్పటికప్పుడు ఆమెపై ఈ తరహా రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆమె పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ నిర్మాతతో ఆమె సహజీవనం చేస్తోందని, త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది.
ఈసారి తన పెళ్లి పుకార్లపై విస్పష్టంగా ప్రకటన చేసింది అంజలి. తనకు ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేశారని, తాజాగా మీడియాలో ఐదో పెళ్లి కూడా జరుగుతోందని తెలిపింది.
“నా పెళ్లి నాకు చెప్పకుండా చేసేస్తున్నారు. ఇప్పటికే 4సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. ఈసారైనా నా పెళ్లికి నన్ను పిలుస్తారేమో చూడాలి. జనాలు విన్న న్యూస్ కు నాకు నాకు ఏ సంబంధం లేదు. నేను లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నానంటున్నారు, నేనే మా ఇంట్లోనే ఉండడం లేదు, రోజూ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాను. నిజంగా లివిన్ లో ఉంటే ఆ వ్యక్తి నాతో రెంట్ షేర్ చేసుకుంటే బెటర్.”
ఇలా తనపై వస్తున్న పెళ్లి పుకార్లను ఖండించింది అంజలి. తను ఏ విషయంపైనా స్ట్రయిట్ గా మాట్లాడతానని, పెళ్లి-ప్రేమ లాంటి అంశాలపై కూడా అంతే ఓపెన్ గా ఉన్నానని అంటోంది. భవిష్యత్తులో కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, కాకపోతే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేవీ లేవని తెలిపింది.