ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న సిత్రాలు మునుపెన్నడూ చూసి వుండరు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అంటే ఏపార్టీ అభ్యర్దులు వారికి వుంటారు. అలా కాకుండా ఒకే పార్టీకి చెందిన వారు మూడు పార్టీల మీద, సీట్ల సర్దుబాటుకు అనుగుణంగా పోటీ చేయడం వరకే మనకు తెలిసింది. 2024లో చంద్రబాబు కొత్త ఫార్ములా కనిపెట్టి ప్రయోగాత్మకంగా అమలు చేసారు. తన మనుషులను భాజపాలోకి పంపి, ఆ పార్టీకి సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి, అక్కడ నుంచి తన మనుషులనే పోటీ చేయించడం. ఇదో కొత్త ఫార్ములా అప్పటికి.
2024 వచ్చేసరికి ఇది బాగా ముదిరిపోయింది. చంద్రబాబుతో పొత్తుకు పూర్తిగా సాగిలపడిపోవడం జనసేన వంతు అయింది. అది ఎందుకన్నది ఆ పార్టీకే తెలియాలి. జగన్.. రాష్ట్రం.. అభివృద్ది అనే కబుర్లు అంతా వుత్తిత్తివే అని అందరికీ తెలుసు. భాజపా కూడా అదే బాటలో నడిచింది. ఆరంభంలో ఆ పార్టీ కండిషన్లు, సీట్లు ఎంచుకోవడం అన్నీ చూసి, అమ్మో… భాజపా మామూలుగా ఆడుకోవడం లేదు బాబోరితో అనిపించేసింది అందరికీ. కానీ అంతలోనే అదంతా బుస్ అని అర్థం అయిపోయింది.
ఇప్పుడు అసలు ఈ మూడు పార్టీల సీట్ల పంపకమే పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఈ సీటు మీరు తీసుకోండి, ఆ సీటు మాకివ్వండి.. అంటూ అనుకోవడం కనిపిస్తోంది తప్ప, పార్టీ ఏదైనా పోటీ చేసే జనాలు మాత్రం తెలుగుదేశం జనాలే వుంటున్నారు. దానికి జనసేన, భాజపా ఎందుకు తలూపుతున్నాయో వారికే తెలియాలి. మా పార్టీని నమ్ముకున్న జనాలు వున్నారు. మా పార్టీ నేతలు వున్నారు. వారికీ అవకాశం ఇవ్వాలి. అనే ఆలోచనను భాజపా కానీ, జనసేన కానీ చేయడం లేదు.
పేరుకు మాత్రమే జనసేన సీటు, భాజపా సీటు.. కానీ అభ్యర్ధులు మాత్రం తేదేపా నుంచి వచ్చి కండువా కప్పుకుంటున్న వారు. లేదా వైకాపా నుంచి వచ్చిన వారు. అనపర్తి భాజపాకు ఇచ్చినందుకు గొడవ అవుతోంది. సరే అయితే ఎవరు అయితే గొడవ చేస్తున్నారో, వాళ్లనే తీసుకుని మీ కండువా కప్పి, మీ టికెట్ ఇచ్చేయండి అంటే సరే అంటోంది భాజపా. అలాగే అవనిగడ్డ. మా మండలి బుద్ద ప్రసాద్ ను తీసుకుని, మీ కండువా కప్పి, మీ టికెట్ ఇవ్వండి అంటే సరే అన్నారు పవన్. ఇలాంటి ఉదాహరణలే మొత్తం అన్నీ కూడా.
భాజపా, జనసేన ఇంతలా గులాంగిరీ చేయాలి, గుడ్డిగా తల ఊపాలి అంటే చంద్రబాబు చాకచక్యం అద్భుతం, అనితరసాధ్యం. లేదా బాబుగారికి వశీకరణ మంత్రాలు ఏమైనా వచ్చి వుండాలి. పల్లెల్లో అంటుంటారు. ఏం మందు పెట్టారో, వాళ్ల మాటే వింటున్నారు. వాళ్లు చెప్పినట్లే చేస్తున్నారు అని. అలాగ్గానే వుంది. బాబుగారు మరి ఏం మందు పెట్టారో కానీ జనసేన, భాజపా రెండూ మారు మాట్లాడడం లేదు. స్టాండ్ అంటే స్టాండ్.. సిట్ అంటే సిట్..
ఈ ప్లాన్ సక్సెస్ అయితే బాగానే వుంటుంది. అంత వరకు భాజపా, జనసేన జనాలు కిమ్మనకుండా వుంటారు. సక్సెస్ కాకపోతే లేచే నోళ్లకు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేక, ఎక్కడో మౌనంగా దాక్కుని పోవడమే.