ఈ ముగ్గురికీ సమ్మర్ టెస్ట్

ఒకేసారి 3 భాషలకు చెందిన ముగ్గురు హీరోలు ఈ వేసవిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు

ఈ వేసవి ముగ్గురు హీరోలకు పరీక్ష. ఎట్టిపరిస్థితుల్లో సక్సెస్ కొట్టాల్సిందే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, కోలీవుడ్ లో సూర్య నటించిన సినిమాలు ఈ సమ్మర్ కు వస్తున్నాయి. ఈ ముగ్గురికీ తమ సినిమాలు కీలకం.

ముందుగా విజయ్ దేవరకొండ విషయానికొద్దాం. ఇతడు నటిస్తున్న కింగ్ డమ్ సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విజయ్ కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్ లాంటి ఫ్లాప్ తర్వాత కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితికి వచ్చాడు విజయ్. తొలిసారి అతడి నటనపై విమర్శలొచ్చాయంటే అది ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచే. సో.. కింగ్ డమ్ తో ఈ హీరో హిట్ కొట్టాల్సిందే.

సూర్య నటించిన కంగువాపై కూడా దాదాపు అలాంటి విమర్శలే వచ్చాయి. కంగువా సమీక్షలపై ఇప్పటికీ జ్యోతిక ఫీల్ అవుతోందంటే, ఆ సినిమా ఎఫెక్ట్ సూర్య కెరీర్ పై ఎంత పడిందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే ఈ సమ్మర్ కు రెట్రోతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు సూర్య. పైగా విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో, కోలీవుడ్ లో ఉన్న ఆ గ్యాప్ ను భర్తీ చేయాలని చాలామంది చూస్తున్నారు. ఈ వార్ లో నిలబడాలంటే రెట్రోతో సూర్య పెద్ద సక్సెస్ అందుకోవాల్సి ఉంది.

ఇక మిగిలిన మరో హీరో సల్మాన్ ఖాన్. ఈమధ్య కాలంలో తన స్థాయి విజయాన్ని అందుకోలేకపోతున్నాడు ఈ కండల వీరుడు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న సికిందర్ సినిమా సల్మాన్ ను మరోసారి రేస్ లో నిలబెడుతుందేమో చూడాలి.

ఇలా ఒకేసారి 3 భాషలకు చెందిన ముగ్గురు హీరోలు ఈ వేసవిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రేసులో మొన్నటివరకు రవితేజ కూడా ఉన్నప్పటికీ, అతడి సినిమా వాయిదా పడింది.

2 Replies to “ఈ ముగ్గురికీ సమ్మర్ టెస్ట్”

Comments are closed.