తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌పై విమ‌ర్శ‌ల వెల్లువ‌!

వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు పెరిగిపోయాయ‌నే విమ‌ర్శ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

తిరుమ‌ల నుంచే సంస్క‌ర‌ణ‌లు మొద‌లు పెడ‌తామ‌ని ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు చేసిన మొద‌టి ప్ర‌క‌ట‌న‌. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న వెంట‌నే ఆయ‌న తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడుతామ‌ని, గ‌తంలో ఏవేవో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు మాట‌ల్ని నిజంగానే అంద‌రూ న‌మ్మారు.

అయితే చంద్ర‌బాబు చెప్పిందొక‌టి, ఆచ‌ర‌ణ మ‌రొక‌టి అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌నే బీఆర్ నాయుడు ప్ర‌క‌టించారు. అయితే రోజుకు 7,500 వీఐపీ ద‌ర్శ‌నాలు ఇస్తున్నార‌ని, సామాన్య భ‌క్తుల‌ను గాలికి వదిలేశార‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ విమ‌ర్శించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే త‌మ హ‌యాంలో రోజుకు ఐదు వేల‌కు మించి వీఐపీ ద‌ర్శ‌నాలు ఇవ్వ‌లేద‌ని భూమ‌న తెలిపారు.

వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు పెరిగిపోయాయ‌నే విమ‌ర్శ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. దీంతో సామాన్య భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం తీవ్ర ఆల‌స్య‌మ‌వుతోంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. మ‌రీ ముఖ్యంగా గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బ్లాక్‌లో ద‌ర్శ‌న టికెట్లు ల‌భ్య‌మ‌వుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో బ్లాక్‌లో ద‌ర్శ‌న టికెట్లు విక్ర‌యిస్తున్న వాళ్ల‌ను విజిలెన్స్ సిబ్బంది ప‌ట్టుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగిస్తోంది.

ఎలాగైనా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌నే భక్తుల కోరిక‌ను ద‌ళారులు సొమ్ము చేసుకోడానికి కొండ‌పై మ‌కాం వేశారు. అలాంటి వాళ్ల‌ను విజిలెన్స్ టీమ్ పట్టుకోవ‌డం అభినంద‌నీయ‌మే. అయితే ప‌ట్టుబ‌డ‌ని ద‌ళారుల సంగ‌తేంటి? సిఫార్సు లేఖ‌ల్ని అమ్ముకునే వాళ్లు ఉండ‌డం వ‌ల్లే క‌దా… బ్లాక్ టికెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా విరాజిల్లేద‌నే విమ‌ర్శ‌కు స‌మాధానం ఎవ‌రు చెప్పాలి? కావున వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల‌పై దృష్టి సారించి, సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

7 Replies to “తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌పై విమ‌ర్శ‌ల వెల్లువ‌!”

Comments are closed.