దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!

సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్‌ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగుపెట్టారు.

తొమ్మిది నెల‌లుగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. వ్యోమ‌నౌక మొరాయించ‌డంతో తొమ్మిది నెల‌లుగా అంత‌రిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్‌ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా దివి నుంచి భువికిపై అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్ నుంచి మంగ‌ళ‌వారం తిరుగుప్ర‌యాణం అయినా వీరు భార‌త కాల‌మానం ప్ర‌కారం ఇవాళ తెల్ల‌వారుజామున 3.27 నిమిషాల‌కు ఫ్లోరిడా తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు.

2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయోగాత్మక వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్‌కు వెళ్లారు. మిషన్ వ్యవధి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కాగా, సాంకేతిక లోపం కారణంగా స్టార్‌లైనర్‌లో వారు తిరిగి రాలేకపోయారు. దీంతో వారిని తీసుకురావ‌డంతో కోసం నాసా- స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్-9 రాకెట్.. క్రూ డ్రాగన్‌‌ను ఆదివారం ఐఎస్ఎస్‌కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని నలుగురు వ్యోమగాములు.. ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు.

ప్రస్తుతం నలుగురు వ్యోమగాముల్నీ హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. వారికి అక్కడ వైద్య పరీక్షలు చేసి.. వారికి భూమి వాతావరణం, గ్రావిటీని అలవాటు చేస్తారు. ఇందుకు కొన్ని రోజులు పడుతుంది. అలాగే.. సునీతా విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో ఉండటం వల్ల ఆమె కాలి పాదాలు మెత్తగా అయిపోయాయి. అందువల్ల ఆమె నడవలేరు. ఆమె పాదాలు తిరిగి గట్టిగా అయ్యేందుకు కొన్ని రోజులు టైమ్ పట్టు అవ‌కాశం ఉంది.

సునీతా విలియమ్స్, ఆమె టీమ్ అంతరిక్షం నుంచి సుర‌క్షితంగా తిరిగి రావడంతో భార‌త్‌లో సంబ‌రాలు చేసుకుంటున్నారు. సునీతా విలియ‌మ్స్ తండ్రి పుట్టిన జులాస‌న్ గ్రామంలో బాణాసంచా కాల్చి సంబ‌రాలు చేసుకున్నారు. సునీతాకు సెల‌బ్రిటీలు, ప్ర‌జ‌లు సైతం వెల్ క‌మ్ సునీతా అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

2 Replies to “దివి నుంచి భువికి.. సునీతా విలియమ్స్!”

Comments are closed.