ఏడాదికి డజను భారీ సినిమాలు వస్తే రెండు మూడు డజన్ల మీడియం సినిమాలు వస్తాయి. మిగిలినవన్నీ చిన్న సినిమాలే. ఇదిలా వుంటే రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. చూస్తే మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడడం లేదా ఓటిటి కోసం వెయిట్ చేయడం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా స్ట్రీట్ అనుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాభవం రాను రాను తగ్గుతోంది. భారీ సినిమాలు తప్ప చిన్న సినిమాలు బతకడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా పెంచి, ఇండస్ట్రీకి మేలు చేసిందని అంటున్నారు. కానీ ఈ మేలు కేవలం పెద్ద సినిమాలకు తప్ప మరే సినిమాకు ఉపకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే మిడ్ రేంజ్ సినిమాలు ఎవరు చేసినా చాలా ఇబ్బంది కరమైన పరిస్థితుల ఎదుర్కొంటున్నారు. నలభై యాభై కోట్ల సినిమాలు మిడ్ రేంజ్ హీరోలతో చేస్తే గట్టెక్కడం కష్టం అవుతోంది.
చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు మరీ అద్భుతమైన టాక్ వస్తే తప్ప జనం థియేటర్లలో చూడడానికి ఇష్ట పడడం లేదు. ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ లో మూడు వందల రూపాయలు టికెట్ అంటే, ఫ్యామిలీ చూడాలంటే కనీసం వెయ్యి నుంచి పదిహేను వందలు ఖర్చవుతుంది. ఈ రీజన్ మిడ్ రేంజ్ సినిమాలను చాలా గట్టిగా దెబ్బతీసే అవకాశం వుంది.
అయితే పెద్ద హీరోల భారీ సినిమాలకు మాత్రం ఈ రేట్లు బ్రహ్మాండంగా వుంటాయి. పెద్ద హీరోల సినిమాలు నైజాంలో 35 నుంచి 45 కోట్ల రేంజ్ లో పలుకుతున్నాయి. ఆ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు యాభై కోట్ల రేంజ్ లో వున్నాయి. ఈ నైజాం కలెక్షన్లు చూపించి అవి మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.