తెలుగు సినిమాల‌దే శాస‌నం

భార‌తీయ ప్రేక్ష‌కుల్లో కొత్త మార్పు వ‌స్తోంది. బాహుబ‌లి దేశం మొత్తంగా ముఖ్యంగా హిందీలో కూడా సూప‌ర్‌హిట్ అయిన త‌రువాత ఇండియ‌న్ సినిమా రూపురేఖ‌లు మారిపోతున్నాయి. భ‌విష్య‌త్తులో హిందీ సినిమాల రాజ్యం మాయ‌మై తెలుగు సినిమాలే…

భార‌తీయ ప్రేక్ష‌కుల్లో కొత్త మార్పు వ‌స్తోంది. బాహుబ‌లి దేశం మొత్తంగా ముఖ్యంగా హిందీలో కూడా సూప‌ర్‌హిట్ అయిన త‌రువాత ఇండియ‌న్ సినిమా రూపురేఖ‌లు మారిపోతున్నాయి. భ‌విష్య‌త్తులో హిందీ సినిమాల రాజ్యం మాయ‌మై తెలుగు సినిమాలే ఇండియా మొత్తం సూప‌ర్‌హిట్‌గా మారుతాయి. ద‌క్షిణ భాష‌ల డ‌బ్బింగ్ సినిమాలు మార్కెట్‌ను ముంచెత్త‌నున్నాయి. వాటిలో తెలుగుకే బిజినెస్ ఎక్కువ‌.

ద‌క్షిణాది సినిమాల గురించి పెద్ద‌గా రాయ‌ని ఇంగ్లీష్ ప‌త్రిక‌లు ఇపుడు క‌వ‌ర్‌స్టోరీలు ప్ర‌చురిస్తున్నాయి. ఈ వారం ఔట్‌లుక్ క‌థ‌నం మ‌న సినిమాల మీదే. పుష్ప‌, KGF2 త‌రువాత లెక్క‌లు మారాయి. దీనికి కార‌ణం క‌రోనా అంటే ఆశ్చ‌ర్యంగా వుంటుంది. ఎందుకంటే క‌రోనా మ‌న‌కి OTTల్లో అన్ని భాష‌ల సినిమాల‌ని అల‌వాటు చేసింది. 

ఇత‌ర భాష‌ల సినిమాల‌కి తెలుగు ఆడియో ఆప్ష‌న్ వుండ‌డంతో న‌టుల‌తో సంబంధం లేకుండా మ‌నం సినిమాలు చూసిన‌ట్టే దేశం మొత్తం ప్రేక్ష‌కులు కూడా చూసారు. వాళ్ల‌కి భాష‌తో ప‌నిలేదు. సినిమా బాగుంటే చాలు. క‌రోనా త‌రువాత పుష్ప దీన్ని రుజువు చేసింది.

పుష్ప రిలీజ్ అయిన‌పుడు హిందీ మార్కెట్‌లో ఎలాంటి అంచ‌నాలు లేవు. 83 హిందీ సినిమాపై అంద‌రికీ ఆస‌క్తి. అయితే పుష్ప త‌రువాత దాని గురించి ప‌ట్టించుకోలేదు. నిజానికి అల్లు అర్జున్ స‌హా పుష్ప‌లో న‌టించిన వాళ్లెవ‌రూ పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. అయినా న‌చ్చే స‌రికి హిందీ వెర్ష‌న్ నూరు కోట్లు వ‌సూలు చేసింది. బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో KGF1 త‌రువాత థియేట‌ర్లు ఫుల్ చేసిన డ‌బ్బింగ్ సినిమా పుష్ప‌నే.

త‌రువాత వ‌చ్చిన RRR, KGF2 త‌రువాత సీన్ మారింది. రెండూ క‌లిపి దాదాపు వెయ్యి కోట్లు వ‌సూలు చేసాయని అంచ‌నా. ఇపుడు తెలుగు డ‌బ్బింగ్ సినిమాలు వ‌స్తాయంటే హిందీ హీరోలే భ‌య‌ప‌డుతున్నారు. RRRకి రాజ‌మౌళి ఇమేజ్, KGF2కి ఫ‌స్ట్ పార్ట్ క్రేజ్ వుంది. మ‌రి పుష్ప హిట్‌కి కార‌ణ‌మేంటి అని విశ్లేషిస్తే ర‌ఫ్‌గా వుండే హీరోని హిందీ ప్రేక్ష‌కులు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. అమితాబ్ స‌క్సెస్‌కి ఇదే కార‌ణం. దీవార్‌, త్రిశూల్‌, లావారిస్ హిట్ ఫార్ములా అదే. కొంత కాలంగా హిందీలో ఈ టైప్ హీరో మిస్స‌య్యాడు. పుష్ప‌లో దొరికాడు.

పుష్ప జుకెగాన‌హీ (త‌గ్గేదేలే) డైలాగ్‌కి చ‌ప్ప‌ట్లు ప‌డ్డాయి. ర‌ఫ్‌నెస్, స్మ‌గ్లింగ్ యాక్టివిటి, మ‌ద‌ర్ సెంటిమెంట్ జ‌నాల‌కి ఎక్కింది. ఒక డ‌బ్బింగ్ సినిమా, న‌టులెవ‌రో తెలియ‌ని సినిమా నార్త్ ఇండియాలోని మారుమూల ట‌వున్‌లో హౌస్‌ఫుల్ న‌డిచిందంటే మామూలు రికార్డ్ కాదు.

సౌత్ ఇండియా సినిమాలు ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ కోసం హిందీ డిస్ట్రిబ్యూట‌ర్లు ఎదురు చూస్తున్నారు. రూపాయికి ప‌ది రూపాయిల లాభాన్ని ఎవ‌రైనా వ‌దులుకుంటారా?

జీఆర్ మ‌హ‌ర్షి