అంత్యక్రియలకూ కులాల లెక్కలున్నాయి

ఒక వ్యక్తి తన ప్రతిభతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా అంతిమయాత్ర గౌరవంగా జరగాలంటే చాలా అంశాలు తోడవ్వాలి. అందులో ముఖ్యంగా బలమైన వారసులుండాలి. ఆ వారసులకి విపరీతమైన మాస్ ఫాలోయింగో లేదా ప్రభుత్వాన్ని…

ఒక వ్యక్తి తన ప్రతిభతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా అంతిమయాత్ర గౌరవంగా జరగాలంటే చాలా అంశాలు తోడవ్వాలి. అందులో ముఖ్యంగా బలమైన వారసులుండాలి. ఆ వారసులకి విపరీతమైన మాస్ ఫాలోయింగో లేదా ప్రభుత్వాన్ని శాసించేటంత పలుకుబడో ఉండాలి. అప్పుడే పోలీసు కవాతులు, గాలిలో కాల్పుల మధ్య అంత్యక్రియలు జరుగుతాయి. లేదంటే ఒక సాదాసీదా వ్యక్తిలాగ మట్టిలో కలవాలంతే. 

పైన చెప్పుకున్న దానికి భిన్నంగా జరిగిన రెండు గొప్ప అంత్యక్రియల గురించి ముందుగా చెప్పుకుందాం. ఆ రెండూ ప్రత్యేకమైనవి ఎందుకో కూడా చెప్పుకోవాలి. 

ఒకటి 2017లో డాక్టర్ సి నారాయణరెడ్డి అంత్యక్రియలు. ఆయన సినీగీతరచయితగా రిటైరయ్యి అప్పటికే చాలా ఏళ్లయ్యింది. ఒకతరం వారికి తప్ప నవతరం వారికి దగ్గరయ్యే విధంగా ఆయన తన పంథా మార్చుకోలేదు. ఒకప్పుడు జ్ఞానపీఠమెక్కినా, రాజ్యసభ సభ్యుడిగా పార్లెమెంటు మెట్లెక్కినా అదంతా గతం. కానీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. అన్నిరకాల రాజలాంఛనాలతో ఆయన చితికి నిప్పంటింది. ఆయనకు కొడుకుల్లేరు. ఉన్న కుమార్తెలవరూ పబ్లిక్ లైఫులో ఉన్నవారు కారు. మరెలా సాధ్యమయింది ఆ స్థాయిలో అంత్యక్రియలు అంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఆయన ఆరాధ్యకవి కావడం. కేసీయార్ యువకుడిగా ఉన్నప్పటినుంచి సినారె పట్ల పెంచుకున్న అభిమానం అందుకు కారణం. ఒక కవి తన వీరాభిమాని ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రాణం విడిస్తే ఏం జరుగుతుందో అది జరిగింది. 

అదలా ఉంటే రెండోది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు కూడా పవర్ఫుల్ వారసులు లేరు. అయినప్పటికీ చివరి వరకు నవతరానికి కూడా రిలవెంట్ గా ఉండే విధంగా పాటలు పాడడం, ప్రాంతాలకు అతీతంగా కోట్లాదిమంది అభిమానుల మనసుల్లో బలంగా ఉండడం, వారిలో ప్రభుత్వాధినేతలు కూడా ఉండడంతో అన్ని రాజలాంఛనాలు వారి స్వీయార్హతకు తగ్గట్టుగా జరిగిపోయాయి. పైగా తెలుగునేలపై ఉన్న కులం లెక్క అక్కడ లేదనడానికి తార్కాణం ఈ వ్యాసం చివరన తెలుస్తుంది. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి విషయానికొద్దాం. వారసులు మాస్ ఫాలోయింగ్ ఉన్నవారు కాకపోయినా ఆయనకి కూడా అధికార లాంఛనాల అర్హత లేకపోలేదు. అశ్లీలం లేకుండా సినిమా పాట ఎలా రాసి నెంబర్ వన్ లా ఎలా నిలవాలో ఆయనొక్కరే చేసి చూపారు. యువతకి ప్రబోధాన్నిచ్చే గీతాలు ఎన్నో రాసారు. పైగా ఈయన రిటైరపోయిన వ్యక్తి కాదు. అప్పటికీ యువరచయితలతో పోటీగా సాహిత్యాన్ని పండిస్తునే ఉన్నారు. అవి చాలవా ఆయనకు ఘనమైన వీడ్కోలు పలకడానికి? కానీ జరగలేదు. 

ఇక సూపర్ స్టార్ కృష్ణ, రిబెల్ స్టార్ కృష్ణంరాజు విషయాలకు వద్దాం. వాళ్లిద్దరూ కచ్చితంగా గొప్ప హీరోలే. సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. కానీ వారెవరని ఈ తరం వారిని అడిగితే మహేష్ బాబు తండ్రిగా, ప్రభాస్ పెదనాన్నగా మాత్రమే చెబుతారు. అదే వాళ్ల అదృష్టం. ఆ స్థాయిలో తమ వారసులు లైం లైట్లో ఉండడం మూలాన ముఖ్యమంత్రులు కూడా ఇంటికొచ్చి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. 

మరి కైకాల సత్యనారాయణకు ఎందుకు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి? ఇక్కడొక ప్రత్యేక కారణముంది. తన సామాజికవర్గానికి సీనియర్ మోస్ట్ సినీనటుడాయన. గతంలో పార్లమెంటు సభ్యుడిగా చేసినా అది తెదేపా నుంచి. ఆ పార్టీకి కేసీయార్ కి ఎటువంటి మిత్రత్వమూ లేదని అందరికీ తెలుసు. మరి ఎందుకీ ప్రత్యేక గౌరవమంటే…కేసీయార్ తన బీఆరెస్ ని ఆంధ్రలో కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆ సామాజికవర్గానికి దగ్గర కావడం కోసమే అధికారలాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిపారని ఒక వాదన ఉంది. కారణమేదైనా అంతిమయానం ఆయనకి గొప్పగా జరిగింది. అర్హతతో పాటూ ఇలా కాలం కూడా కలిసొచ్చింది. 

కానీ ఆ అదృష్టం జమునకి గానీ, కె. విశ్వనాథ్ కి కాని కలిసిరాకపోవడం కూడా గమనించాలి. ఇద్దరూ కృష్ణ, కృష్ణం రాజు, కైకాల మాదిరిగా రిటైరైపోయిన వారే. కానీ బలమైన వారసులు లేకపోవడం, రాజకీయంగా ఉపయోగపడే కులం కాకపోవడం అనేవి అధికారలాంఛనలకు అనర్హుల్ని చేసేసాయనుకోవాలి. నిజానికి సంగీతం, సాహిత్యం, నాట్యం పట్ల ప్రజల్లో అభిరుచిని పెంచిన గొప్ప దార్శనికుడు కె విశ్వనాథ్. ఆయన సినిమాలు కాసులతో పాటూ సంస్కారాన్ని కూడా కురిపించాయి. ఆ దాదాసహెబ్ ఫాల్కే గ్రహీత అన్ని రకాలుగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలకి అర్హుడు. కానీ జరగలేదు. 

ఈ అధికారలాంఛనాలన్నీ పోయినవారి కోసం కాదు. ఉన్నవారు వారికి ఇచ్చుకునే గౌరవం, మనసుకి కలిగించుకునే సంతృప్తి. కానీ అన్నిటికీ లెక్కలున్నట్టే ఈ విషయానికి కూడా లెక్కలున్నాయి- బలమైన వారసులు లేదా రాజకీయానికి పనికొచ్చే కులం లేదా ముఖ్యమంత్రితో వ్యక్తిగత ఆత్మీయ బంధం! అంతే.

సిహెచ్. రాధాకృష్ణమూర్తి