విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వరసబెట్టి పదవీ విరమణ చేస్తున్నారు. ఏటా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. వివిధ విభాగాలలో పదవీ విరమణ చేస్తున్న అధికారులు సిబ్బంది ఖాళీలు అలాగే పడి ఉంటున్నాయి. దాంతో ఉక్కులో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. ఎటూ విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టేసిన తరువాత కొత్త కొలువులు ఎందుకు అని కేంద్రం నిర్లిప్తంగా చూస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులు ఉన్నారు చూస్తే గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వచ్చే మూడేళ్లలో 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఇలా ఖాళీలు వేలల్లో ఉంటే కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటోంది అంటే దానికి కేంద్రం ఉక్కు శాఖ మంత్రి చెప్పిన జవాబు చూస్తే చిత్రంగానే ఉంది అంటున్నారు.
విశాఖ ఉక్క్కులో ప్రాధాన్యత లేని విభాగాల్లో కార్యకలాపాలు అన్నీ కూడా ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా భర్తీ చేస్తామని అంటున్నారు. కీలక విభాగాల్లో సైతం ఇపుడు ఖాళీలు ఉన్నాయి. మరి వాటిని ఎలా భర్తీ చేస్తారు అంటే కేంద్రం వద్ద జవాబు ఉందా అన్నదే ప్రశ్న. ఉక్కు ప్రైవేట్ బాటను పట్టించిన నేపధ్యంలో సిబ్బంది ఎంత తగ్గితే అంత మంచిదన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదని ఉద్యోగులు సిబ్బంది మాత్రం గతాని కంటే కూడా ఎక్కువ ఉత్పత్తిని చేస్తున్నారు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. తక్కువ మంది సిబ్బందితోనే ఇదంతా సాధ్యం చేస్తున్నారు. పని భారం గతంతో పోలిస్తే రెట్టింపు అవుతోందని ఉద్యోగులు అంటున్నారు. కానీ కేంద్రం అవుట్ సోర్స్ అంటోంది కానీ అది కూడా చేసేది లేదని ఉద్యమకారులు అంటున్నారు. అవుట్ సోర్సింగ్ వద్దు పర్మనెంట్ ఉద్యోగాలే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.